'సేవ్ ద టైగర్స్-3' వెబ్ సిరీస్ రివ్యూ

భార్యా బాధితుల కష్టాల నేపథ్యంలో తెలుగులోనే కాదు వివిధ భాషల్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి.

Update: 2026-06-20 09:11 GMT

'సేవ్ ద టైగర్స్-3' వెబ్ సిరీస్ రివ్యూ

నటీనటులు: ప్రియదర్శి- అభినవ్ గోమఠం- చైతన్యకృష్ణ- పావని గంగిరెడ్డి-జోర్దార్ సుజాత-దేవయాని శర్మ- గంగవ్వ- వెన్నెల కిషోర్- గుండు సుదర్శన్- శ్రీకాంత్ అయ్యంగార్- మిర్చి కిరణ్ తదితరులు.

సంగీతం: వెంకటస్వామి

ఛాయాగ్రహణం: ఎస్. వి.విశ్వేశ్వర్

రచన-ప్రదీప్ అద్వైతం-విజయ్ నమోజు- జి.ఎస్.గౌతమ్

నిర్మాతలు: శివ మేక- సాహితి చింతలపూడి

దర్శకత్వం: శ్రీరామ్ ఎరగం

భార్యా బాధితుల కష్టాల నేపథ్యంలో తెలుగులోనే కాదు వివిధ భాషల్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. పెళ్లిని ఒక బూచిలా.. పెళ్లయిన మహిళల్ని రాకాసుల్లా చూపిస్తూ వినోదాన్ని పండించడం రచయితలు-దర్శకులకు అలవాటైన వ్యవహారమే. ఐతే ఈ పాత కథా వస్తువునే ఎంచుకున్నప్పటికీ.. జోక్స్ ఎక్కడా హద్దులు దాటకుండా.. మహిళలు సైతం ఎంజాయ్ చేసేలా.. వాళ్ల వైపు నుంచి నుంచి కథను బ్యాలెన్స్ చేస్తూ.. చాలా వరకు లైట్ హార్టెడ్ హ్యూమర్ తో సన్నివేశాలను నడిపిస్తూ.. అక్కడక్కడా కొంచెం ఎమోషన్ కూడా జోడించి ప్రేక్షకులను మెప్పించిన సిరీస్.. సేవ్ ద టైగర్స్. ఈ తరహా కథలకు రెండో సీజన్ తీయడానికి ఏమంటుంది అనిపిస్తుంది కానీ.. ఈ టీం మాత్రం సీజన్-2ను సైతం బోర్ కొట్టించకుండానే నడిపించింది. కానీ దీనికి మూడో సీజన్ అంటే.. వర్కవుట్ చేయడం కష్టమే అని.. ఓవర్ డోస్ అయిపోతుందనే సందేహాలే కలిగాయి. కానీ ఈ సారి కథకు ఫాంటసీ ఎలిమెంట్ జోడించి.. మరోసారి ఎంగేజ్ చేసింది టీం. కథ పరంగా వైవిధ్యం తోడవడం.. స్క్రీన్ ప్లేతోనూ మ్యాజిక్ చేయడం.. జోకులు ఎప్పట్లాగే పేలడంతో మరోసారి ‘సేవ్ ద టైగర్స్’తో జర్నీ మంచి కాలక్షేపాన్నిస్తుంది.

పశువుల కొట్టానికి ఆనుకుని ఉండే ఇల్లొద్దు.. గేటెడ్ కమ్యూనిటీకి వెళ్దామని పోరు పెట్టే భార్యతో కొట్లాడే ఘంటా రవి (ప్రియదర్శి).. తాను రైటింగ్ లో కొనసాగాలని అనుకుంటున్నప్పటికీ భార్య అభీష్టం మేరకు అయిష్టంగా ఐటీ ఉద్యోగం చేస్తున్న రాహుల్ (అభినవ్ గోమఠం).. తనకు అక్రమ సంబంధం ఉందని అనుమానించే భార్యతో పోట్లాడుతున్న విక్రమ్ (చైతన్య కృష్ణ).. ఈ ముగ్గురి జీవితాలు సీజన్-3లో కొత్త మలుపు తీసుకుంటాయి. పెళ్లి అనే బంధంలో తమను ఇరికించాడంటూ స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడిని ఈ ముగ్గురూ తిట్టుకోవడంతో.. వాళ్ల ఆకాంక్షలకు తగ్గట్లే జీవితాలుంటే ఎలా ఉంటుందో వారికి పరిచయం చేస్తాడు ఇంద్రుడు. మరి ఆ ఆ జీవితాలు వారికి నచ్చాయా.. దాని వల్ల వాళ్ల సంసారాలు బాగుపడ్డాయా.. ఆ జీవితాలనే వారు కోరుకున్నారా లేక పాతవాటికే పరిమితం అయ్యారా అన్న నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. చాలా ఏళ్ల కిందట తమిళంలో ‘12 బి’ అనే సినిమా ఒకటి వచ్చింది. ‘కిక్’ శ్యామ్ అందులో హీరో. ఒక ఇంటర్వ్యూ కోసం బయల్దేరిన హీరో బస్సు మిస్సయినందుకు ఫీలవుతాడు. ఐతే ఒకవేళ అతనా బస్సు ఎక్కి ఉంటే జీవితం ఎలా ఉండేదో చూపిస్తూ.. ఎక్కకపోవడం వల్ల తన లైఫ్ ఎలా ఉండేదో రెండు కోణాల్లో చూపిస్తాడు అందులో దర్శకుడు.

ఇలాంటి కాన్సెప్ట్స్ హాలీవుడ్ సినిమాల్లోనూ ఉన్నాయి. ‘సేవ్ ద టైగర్’ రైటర్స్ వాటి నుంచి స్ఫూర్తి పొందారో ఏమో కానీ.. స్ఫ గమ్మత్తయిన ఆ పాయింటునే ఈ సిరీస్ కు అప్లై చేశారు. దీని వల్ల సిరీస్ కు ఒక కొత్తదనం వచ్చింది. ఏడు ఎపిసోడ్ల పాటు బోర్ కొట్టకుండా ఈ కథను నడిపించడానికి తగ్గ మంచి ముడిసరుకును ఎంచుకున్న రైటర్లు ప్రదీప్ అద్వైతం.. విజయ్ నమోజు.. జి.ఎస్.గౌతమ్ దాని చుట్టూ ఇంట్రెస్టింగ్ సీన్లు రాసుకున్నారు. గత సీజన్లలో మాదిరే మంచి ఫన్ ఉన్న డైలాగులు జోడించారు. ఆర్టిస్టులు అందరూ తమకు అలవాటైన పాత్రల్లో చాలా కాన్ఫిడెంటుగా నటించడం.. మంచి టైమింగ్ తో డైలాగులను పేల్చడంతో సిరీస్ ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. దర్శకుడు శ్రీరామ్ ఎరగం తొలి రెండు సీజన్ల ఫ్లోను అలాగే కంటిన్యూ చేశాడు. తక్కువ నిడివితో సాగిపోయే ఎపిసోడ్లు మంచి కాలక్షేపాన్ని ఇస్తాయి. ఈ సిరీస్ లో సన్నివేశాలు.. డైలాగులు ఎంత లైట్ హార్టెడ్ గా.. ట్రెండీగా ఉంటాయంటే ఇంద్రుడు చిత్రగుప్తుడిని మిస్టర్ గుప్తా అని సంబోధిస్తాడు. ల్యాప్ టాప్ ముందు పెట్టుకుని తన టైంలైన్లోకి వచ్చే వీడియోల గురించి ప్రస్తావిస్తాడు. పురాణ పాత్రలను కూడా ట్రెండీగా ప్రెజెంట్ చేయడం ద్వారా ఎక్కడా ఫన్ తగ్గకుండా చూశారు మేకర్స్.

ఐతే కేవలం వినోదంతో సరిపెట్టకుండా.. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సర్దుబాట్లతో ఎలా కాపురాలు చక్కబడతాయనే విషయాన్ని కూడా ప్రభావవంతంగా చెప్పారు. సంబంధిత సన్నివేశాల్లో మెలోడ్రామాతో పిండేయకుండా సింపుల్ సీన్లతోనే ఇవ్వాల్సిన సందేశాన్ని ఇచ్చారు. మొదటి మూడు ఎపిసోడ్లలో కామెడీ ఆకర్షణ అయితే.. చివరి రెండు ఎపిసోడ్లలో ఎమోషన్ బాగా వర్కవుట్ అయింది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు నెమ్మదించిన భావన కలగడం.. హీరోల డూప్లికేట్లు వచ్చాక కొన్ని చోట్ల సన్నివేశాల్లోని గందరగోళం.. కొన్ని చోట్ల శ్రుతి మించిన బూతులు ఈ సిరీస్ లో చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్లు. వాటిని మినహాయిస్తే ‘సేవ్ ద టైగర్స్-3’ బాగా ఎంగేజ్ చేస్తుంది. కథ పరంగా గత సీజన్ల కంటే ఇది కొత్తగా.. థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఆర్టిస్టుల్లో అందరూ పోటీ పడి పెర్ఫామ్ చేశారు. హీరోల పాత్రల గురించైతే చెప్పాల్సిన పని లేదు. ప్రియదర్శి.. అభినవ్.. కృష్ణచైతన్య ముగ్గురూ కూడా తమ పాత్రలతో చెడుగుడు ఆడేశారు. కామెడీ టైమింగ్ విషయంలో ఎవరికి వారే అన్నట్లు అదరగొట్టారు. ముగ్గురూ మంచి సింక్ లో సాగుతూ చేసిన అల్లరి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. అందరిలోకి అభినవ్ జోకులు బాగా పేలాయి. పని మనిషితో అతడి కాంబినేషన్ మరోసారి పేలింది. కథానాయికలు జోర్దార్ సుజాత.. పావని గంగిరెడ్డి.. దేవయాని శర్మ కూడా మంచి పెర్ఫామెన్స్ ఇచ్చారు. వెన్నెల కిషోర్ పాత్రను ఇంకొంచెం పొడిగించి ఉంటే బాగుండేదనిపిస్తుంది. గుండు సుదర్శన్.. శ్రీకాంత్ అయ్యంగార్.. మిర్చి కిరణ్ సహా మిగతా ఆర్టిస్టులంతా బాగా చేశారు. రైటర్లతో పాటు దర్శకుడి పనితనానికి ప్రశంసలు దక్కుతాయి. వెంకటస్వామి మ్యూజిక్.. విశ్వేశ్వర్ ఛాయాగ్రహణం బాగా కుదిరాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. గత రెండు సీజన్లలాగే ‘సేవ్ ద టైగర్స్’ మూడో సీజన్ కూడా చక్కటి కాలక్షేపమే.

చివరగా: టైగర్స్ మళ్లీ గర్జించారు

రేటింగ్ - 3/5

Tags:    

Similar News