టైగర్స్ మళ్లీ గర్జించబోతున్నారు.. ప్రీమియర్‌తోనే హైప్ పీక్స్‌కు!
తెలుగు ఓటీటీ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సేవ్ ది టైగర్స్ మూడో సీజన్ కు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తెలుగు ఓటీటీ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సేవ్ ది టైగర్స్ మూడో సీజన్ కు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రెండు సీజన్లతో ప్రేక్షకులను అలరించిన ఈ సిరీస్, ఇప్పుడు మరింత వినోదంతో తిరిగి వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన సేవ్ ది టైగర్స్ సీజన్3 స్పెషల్ ప్రీమియర్ ఈవెంట్ ఆకట్టుకుంది. సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై ఈ ఈవెంట్‌కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.
హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో జరిగిన ఈ ప్రీమియర్ సందడి వాతావరణంలో సాగింది. సిరీస్‌కు సంబంధించిన నటీనటులు, టెక్నికల్ టీమ్, క్రియేటర్లు, స్పెషల్ గెస్టులు ఒకే వేదికపై కనిపించడంతో వేడుకకు మరింత కళ వచ్చింది. ఈ ప్రీమియర్ కు హీరో సందీప్ కిషన్‌తో పాటూ కామాక్షి భాస్కర్ల, రాగ్ మయూర్, వీజే సన్నీ, కళ్యాణ్ పడాలా, చైతన్య రావు, వెంకటేష్ కాకుమాను, కార్తిక్ రత్నం, ఆదిత్య మండల, శ్రీనాథ్ మాగంటి, ముక్కు అవినాష్, నిరుపమ్, కిరీటి దామరాజు, మానస్ తదితరులు పాల్గొన్నారు. పలువురు అతిథులు సిరీస్‌లోని ఎపిసోడ్‌లను వీక్షించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
స్క్రీనింగ్ తర్వాత సిరీస్‌లో కనిపించిన పాత్రలు, కథనం, కామెడీ సీన్స్ పై సెలబ్రిటీల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ప్రియదర్శి, జోర్దార్ సుజాత, కృష్ణ చైతన్య, దేవియాని శర్మ, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ప్రీమియర్ చూసివ వారు చెప్తున్నారు. వెన్నెల కిషోర్ చేసిన స్పెషల్ క్యామియో ప్రత్యేక పాత్ర కూడా ఈ సీజన్‌లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటి వరకు వచ్చిన రెండు సీజన్లలో ఫ్యామిలీ బాండింగ్స్, దాంపత్య జీవితంలోని ఫన్నీ ఇన్సిడెంట్స్, నేచురల్ కామెడీతో ఆడియన్స్ ను అలరించిన సేవ్ ది టైగర్స్ ఈసారి కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వస్తోంది. మేకర్స్ తెలిపిన వివరాల ప్రకారం, మూడో సీజన్‌లో ఫ్యాంటసీ అంశాలు కూడా కథలో భాగమవడంతో ఎంటర్టైన్మెంట్ నెక్ట్స్ లెవెల్ లో ఉండనుందని అర్థమవుతుంది. రెండు భిన్న ప్రపంచాల మధ్య జరిగే ఆసక్తికర పరిణామాలు కథను ముందుకు నడిపించనున్నట్లు తెలుస్తోంది.
మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం రూపొందించిన ఈ సిరీస్‌కు శ్రీరామ్ ఎరగం దర్శకత్వం వహించారు. శివ మేక, సాహితి చింతలపూడి నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌పై ఓటీటీ ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి ఆసక్తి కనిపిస్తోంది. వ్యూయర్‌షిప్ పరంగా తెలుగు వెబ్ సిరీస్‌లలో అగ్రస్థానంలో నిలిచిన ఈ ఫ్రాంచైజీ, మూడో సీజన్‌తో కూడా అదే విజయాన్ని కొనసాగిస్తుందా లేదా అనేది చూడాలి. జూన్ 19 నుంచి సేవ్ ది టైగర్స్ సీజన్3 జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది.