పదేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లో ఆ పేరు...!

ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా కమర్షియల్‌గా మంచి ఆధరణ లభిస్తున్న విషయం తెల్సిందే.;

Update: 2026-01-05 06:27 GMT

ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా కమర్షియల్‌గా మంచి ఆధరణ లభిస్తున్న విషయం తెల్సిందే. మొదటి నుంచి కూడా మలయాళ సినిమాలకు ప్రత్యేకమైన బ్రాండ్‌ ఉంది. మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమా అంటే కంటెంట్‌ ఉన్న సినిమా అనే అభిప్రాయం చాలా ఏళ్లుగా ఉంది. మధ్యలో కాస్త గాడి తప్పినట్లుగా అనిపించినా మళ్లీ మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి సూపర్‌ హిట్‌ సినిమాలు, పాన్ ఇండియా రేంజ్‌లో దుమ్మురేపుతున్నాయి. ఆకట్టుకునే కథ, కథనంతో పాటు, నటీనటులు ఆకట్టుకోవడం మనం చూస్తున్నాం. తాజాగా మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి 'సర్వం మాయ' అనే సినిమా వచ్చింది. విభిన్నంగా ఉన్న ఈ సినిమా మొదటి వారం రోజుల్లోనే ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ సినిమాను పాన్‌ ఇండియా సినిమా మలయాళ మీడియా వర్గాల వారు తెగ ప్రమోట్‌ చేస్తూ ఉన్నారు.

సర్వం మాయ సినిమాకు భారీ వసూళ్లు...

మలయాళంలో మాత్రమే విడుదల అయిన ఈ సినిమా మెల్లమెల్లగా ఇండియా మొత్తం విస్తరించింది. ఇతర భాషల్లో డబ్బింగ్‌ చెప్పించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొన్ని భాషల ఫిల్మ్‌ మేకర్స్ మాత్రం రీమేక్‌ హక్కులు కొనుగోలు చేసేందుకు సిద్ధం అయ్యారు. తెలుగులో సర్వం మాయ సినిమా రీమేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాతో పదేళ్ల తర్వాత మలయాళ హీరో నివిన్ పౌలీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మలయాళంలో చాలా సినిమాలు చేసిన ఈయన 'ప్రేమమ్‌' సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ సినిమా ఇతర భాషల్లో డబ్బింగ్‌ కాకుండా రీమేక్ అయింది. అయినా కూడా నివిన్ పౌలీ కి అన్ని భాషల్లోనూ ఆ సమయంలో మంచి గుర్తింపు లభించింది. అన్ని భాషల ప్రేక్షకులు ఈయన్ను గుర్తించడం జరిగింది. ఆ హిట్‌తో బ్యాక్ టు బ్యాక్‌ ఆఫర్లను సొంతం చేసుకున్నాడు. కానీ ఆ స్థాయి హిట్‌ మాత్రం సొంతం చేసుకోవడంలో నివిన్‌ విఫలం అయ్యాడు అని చెప్పక తప్పదు.

నివిన్‌ పౌలీ హీరోగా వచ్చిన సినిమా...

పదేళ్ల క్రితం వచ్చిన ప్రేమమ్‌ సినిమా మలయాళ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం మాత్రమే కాకుండా డబ్‌ అయిన అన్ని భాషల్లోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాతో వచ్చిన స్టార్‌డం, ఇమేజ్ కారణంగా మలయాళంలో నివిన్‌ స్టార్‌ హీరోగా వెలుగు వెలగడం ఖాయం అని అంతా భావించారు. కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఎంపిక చేసుకున్న సినిమాల కారణంగా వెనుక పడ్డాడు. సరైన సినిమా పడి దాదాపు ఆరు ఏళ్ళు అవుతుంది. ఈ ఆరు ఏళ్ల కాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఒక్కటి అంటే ఒక్కటి కూడా మినిమం వసూళ్లు సాధించలేదు. ఆయన అభిమానులు సైతం ఒకానొక సమయంలో అసహనం వ్యక్తం చేశారు. ఏం సినిమాలు ఇవి, ఎలాంటి కథలు ఎంపిక చేసుకుంటున్నారు అంటూ తీవ్రంగా స్పందిస్తూ కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎట్టకేలకు సర్వం మాయ సినిమాతో నివిన్‌ కి ఊరట దక్కింది. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో మరోసారి నివిన్‌ పౌలీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

ప్రేమమ్‌ సినిమా తర్వాత పదేళ్లుగా..

2025 చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్వం మాయ సినిమాకు అఖిల్‌ సత్యన్‌ దర్శకత్వం వహించాడు. నివిన్‌ పౌలీ, రియా శిబు, అజు వర్గీస్‌, జనార్థనన్‌, ప్రీతి ముఖుందన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఫైర్‌ ఫ్లై ప్రొడక్షన్స్‌ ఆధ్వర్యంలో అజయ్‌ కుమార్‌ ఇంకా రాజీవ్‌ మీనన్‌ లు నిర్మించారు. క్రిస్మస్ కానుకగా థియేట్రికల్‌ రిలీజ్ అయిన సర్వం మాయ సినిమాకు అనూహ్య స్పందన లభించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాకు హిట్‌ టాక్ దక్కడంతో మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు, రెండో రోజుతో పోల్చితే మూడో రోజు ఎక్కువ వసూళ్లు నమోదు అయ్యాయి. మొత్తంగా ఒక వారం ముగియకుండానే రూ.100 కోట్ల క్లబ్‌లో ఈ సినిమా చేరింది అంటూ మలయాళ బాక్సాఫీస్‌ వర్గాల వారు చెబుతున్నారు. ఈ స్థాయి విజయం సాధించడంతో నివిన్‌ పౌలీ మళ్లీ పాన్ ఇండియా రేంజ్‌లో చర్చనీయాంశం అయ్యాడు. పదేళ్ల తర్వాత నివిన్‌ కు దక్కిన ఈ భారీ విజయంతో ఈసారి పాన్ ఇండియా రేంజ్‌ లో వరుస సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News