సీనియర్ నటుడు శరత్ బాబు వారసుడు ఎంట్రీ
ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయుష్ తేజస్ ప్రెస్ మీట్‌లో ఎంతో వినయంగా మాట్లాడారు.
ఈ రోజుల్లో చిత్ర పరిశ్రమలో నటవారసుల రాక సర్వసాధారణమైపోయింది. స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, చివరకు విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల పుత్రరత్నాలు కూడా వెండితెరపై మెరిసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కలలు కంటున్నారు. ఇదే బాటలో తెలుగు సినీ పరిశ్రమతో పాటు, బుల్లితెరపై తనదైన హుందాతనంతో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటుడు శరత్ బాబు వారసుడు కూడా ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడు. శరత్ బాబు అంతటి దిగ్గజ నటుడి కుమారుడైనా.. ఆయుష్ తేజస్ ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా లో-ప్రొఫైల్‌లో, సింప్లిసిటీతో.. కేవలం కంటెంట్‌ను నమ్ముకుని ముందుకు వెళ్తుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయుష్ తేజస్ ప్రెస్ మీట్‌లో ఎంతో వినయంగా మాట్లాడారు. ముందుగా ఈ ఈవెంట్‌కు విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రేక్షకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమ చిత్రానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మొదటి షాట్‌కు క్లాప్ కొట్టిన ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ కి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వినాయక్ లాంటి పెద్ద దర్శకుడు వచ్చి తమ చిత్రాన్ని ఆశీర్వధించడం తమ చిత్ర బృందానికి ఎంతో సంతోషాన్ని.. కొండంత బలాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రెస్ మీట్ లోనే తన పేరు ఆయుష్ తేజస్ అని పరిచయం చేసుకున్నాడు. తాను సీనియర్ నటుడు శరత్ బాబు గారి కుమారుడినని అధికారికంగా పరిచయం చేసుకుంటూ ఈ సినిమాతో లీడ్ హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నట్లు స్పష్టం చేశారు. ఇది తమ తొలి ప్రెస్ మీట్.. పూజా కార్యక్రమం కాబట్టి ప్రస్తుతానికి సినిమా గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఏమీ లేదని సరదాగా వ్యాఖ్యానించారు. త్వరలోనే ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలతో ప్రేక్షకుల ముందుకు వస్తామని చెబుతూ.. తమ చిత్ర బృందానికి ..తనకి ఆడియన్స్, మీడియా మిత్రులు సంపూర్ణ సపోర్ట్ అందించాలని కోరారు.
టాలీవుడ్ - తెలుగు బుల్లితెరతో చెరగని అనుబంధం:
భారతీయ చలనచిత్ర రంగంలో ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటన, హుందాతనంతో చెరగని ముద్ర వేసిన నటుడు శరత్ బాబు. 1973లో వచ్చిన `రామరాజ్యం` చిత్రంతో టాలీవుడ్‌లో నటుడిగా అరంగేట్రం చేసిన ఆయన స్వతహాగా ఆంధ్రా ప్రాంతానికి చెందినవారు కావడంతో తెలుగు భాషపైనా, ఇక్కడి ప్రేక్షకులపైనా ప్రత్యేకమైన అభిమానాన్ని కలిగి ఉండేవారు. కథానాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించినా.. ఆ తర్వాత సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా, మంచి మిత్రుడి పాత్రల్లో ఒదిగిపోయి సుదీర్ఘకాలం పాటు టాలీవుడ్‌లో అగ్రనటుడిగా కొనసాగారు.
టాలీవుడ్‌లోని దాదాపు అందరు అగ్ర హీరోలతోను శరత్ బాబు నటించి మెప్పించారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబుల కాలం నుండి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణల వరకు ఎంతోమంది హీరోలకు సోదరుడిగా, ప్రాణస్నేహితుడిగా ఆయన పోషించిన పాత్రలు ఎవర్ గ్రీన్. సాగర సంగమం, స్వాతిముత్యం, సంసారం ఒక చదరంగం, అన్వేషణ, ముత్తు (తెలుగు డబ్బింగ్) వంటి చిత్రాలలో శరత్ బాబు నటన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. ఆయన సున్నితమైన నటనకు, ఆహార్యానికి గుర్తింపుగా పలుమార్లు ప్రతిష్టాత్మక నంది అవార్డులు కూడా వరించాయి.
కేవలం వెండితెరపైనే కాకుండా.. తెలుగు బుల్లితెరపై కూడా శరత్ బాబు తన ప్రత్యేకతను చాటుకున్నారు. బుల్లితెర విస్తరిస్తున్న ప్రారంభ రోజుల్లోనే కుటుంబ కథా సీరియళ్ల ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు.. ముఖ్యంగా గృహిణులకు బాగా దగ్గరయ్యారు. ఈటీవీ, జెమినీ వంటి ప్రముఖ ఛానళ్లలో ప్రసారమైన పలు సీరియళ్లలో ఆయన పోషించిన గౌరవప్రదమైన తండ్రి, కుటుంబ పెద్ద పాత్రలు చానెళ్ల సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి. వెండితెరపై ఎంతటి గ్రేస్ చూపించారో.. బుల్లితెరపైనా అదే స్థాయి నటనతో మెప్పించి రెండు తరాల తెలుగు ప్రేక్షకులకు ఆత్మీయుడిగా నిలిచిపోయారు. అయితే శరత్ బాబు నటి రమాప్రభతో బ్రేకప్ అయ్యారు. అయితే ఈ జంటకు వారసులు లేరు. తన సోదరుడి కుమారుడిని ఎప్పుడూ తన కుమారుడిగానే చూసుకుంటానని శరత్ బాబు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.