సినిమాలు తీయ‌డం గొప్ప కాదు.. అదే గొప్ప‌!

సినిమా రంగమ‌న్నా, సినిమా తీయ‌డ‌మ‌న్నా ఆషా మాషీ వ్య‌వ‌హారం కాదు. కానీ బ‌య‌టి నుంచి చూసే వాళ్ల‌కు మాత్రం సినీ రంగంలో ఉన్నంత సుఖం ఇంకెక్క‌డా ఉండ‌ద‌నుకుంటారు.;

Update: 2025-11-06 14:33 GMT

సినిమా రంగమ‌న్నా, సినిమా తీయ‌డ‌మ‌న్నా ఆషా మాషీ వ్య‌వ‌హారం కాదు. కానీ బ‌య‌టి నుంచి చూసే వాళ్ల‌కు మాత్రం సినీ రంగంలో ఉన్నంత సుఖం ఇంకెక్క‌డా ఉండ‌ద‌నుకుంటారు. అయితే నిజానిజాలేంట‌నేది అందులో ఉన్న వాళ్ల‌కు మాత్ర‌మే తెలుస్తోంది. సినిమాను తీయాలంటే దానికెంతో మంది కృషి అవ‌స‌రం, ఎంతో డ‌బ్బు అవ‌స‌రం, అన్నింటికంటే అంద‌రి క‌ష్టాన్ని గుర్తించే ఆడియ‌న్స్ ను సంపాదించుకోవడం ఇంకా క‌ష్టం.

ఇదంతా ఎందుకంటే అక్క‌డికే వ‌ద్దాం. ఇండ‌స్ట్రీలోకి చాలా మంది సినిమాలు తీయ‌డ‌మే గొప్ప‌ని ఫీల‌వుతూ ఉంటారు. ఎంతో క‌ష్ట‌ప‌డి సినిమా తీశాం. ఇక దాంతో మ‌న ప‌ని అయిపోయిందిలే అని స‌ర్ది చెప్పుకుంటూ ఉంటారు. కానీ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు మాత్రం సినిమాలు తీయ‌డం గొప్ప కాద‌ని అంటున్నారు. రీసెంట్ గా సంతాన ప్రాప్తిర‌స్తు ట్రైల‌ర్ లాంచ్ కు హాజ‌రైన దిల్ రాజు సినిమాల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ప్రెస్ మీట్ పెట్టి ట్రైల‌ర్ లాంచ్ చేయ‌డం గొప్ప కాదు

సినిమాలు తీయ‌డం, ఆ త‌ర్వాత ప్రెస్ మీట్ పెట్టి ట్రైల‌ర్ లాంచ్ చేయ‌డం గొప్ప కాద‌ని, మార్నింగ్ షో కు జ‌నాల‌ను తీసుకొచ్చి, వారితో సినిమా హిట్ అనిపించుకోవ‌డ‌మే గొప్ప అని దిల్ రాజు పేర్కొన్నారు. ముందుగా సినిమాలోని కంటెంట్ తో ఆడియ‌న్స్ ను ఎగ్జైట్ చేసి, త‌ర్వాత ఎంగేజ్ చేసి, దానికి మీడియా కూడా పాజిటివ్ గా రివ్యూలు రాస్తే ఫ‌స్ట్ షో కు క‌లెక్ష‌న్స్ పెరుగుతున్నాయని, అప్పుడే సినిమాలు ఎక్కువ‌గా స‌క్సెస్ అవుతాయ‌ని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

న‌వంబ‌ర్ 14న సంతాన ప్రాప్తిరస్తు రిలీజ్

సంతాన ప్రాప్తిర‌స్తు సినిమా విష‌యానికొస్తే విక్రాంత్, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, షేక్ దావూద్ స్క్రీన్ ప్లే అందించారు. న‌వంబ‌ర్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంతాన ప్రాప్తిర‌స్తు సినిమాలో ప్ర‌స్తుత రోజుల్లో సంతానం కోసం యువ‌త ప‌డే పాట్ల‌ను ఇందులో చూపించ‌నున్నారు.



Tags:    

Similar News