సంక్రాంతికి ఆ సినిమాలకు ఛాన్స్ లేదంతే..?
న్యూ ఇయర్ కొత్త సినిమాల సందడితో సంక్రాంతి వైభవం మరింత కలర్ ఫుల్ గా ఉండేలా చేస్తారు.;
సంక్రాంతి వచ్చింది అంటే తెలుగు సినిమాలకు పండగ వచ్చినట్టే లెక్క. న్యూ ఇయర్ కొత్త సినిమాల సందడితో సంక్రాంతి వైభవం మరింత కలర్ ఫుల్ గా ఉండేలా చేస్తారు. ఐతే సంక్రాంతి టార్గెట్ గా సినిమాలు రిలీజ్ చేయాలని స్టార్స్ ప్లాన్ చేస్తారు. తక్కువలో తక్కువ ఆ సీజన్ లో 3, 4 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఐతే ఈసారి సంక్రాంతికి తెలుగు సినిమాలు ఏకంగా ఐదు రిలీజ్ అవుతున్నాయి. అందులో చిరంజీవి, ప్రభాస్, రవితేజతో పాటు నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ సినిమాలు ఉన్నాయి.
తమిళ డబ్బింగ్ సినిమాలు సంక్రాంతికి రిలీజ్..
ఇవి సరిపోవు అన్నట్టుగా ఆనవాయితీ ప్రకారం తమిళ డబ్బింగ్ సినిమాలు సంక్రాంతికి తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. అందులో దళపతి విజయ్ జన నాయకుడు ఒకటి కాగా రెండోది శివ కార్తికేయన్ పరాశక్తి మరోటి. సంక్రాంతికి తెలుగు ఐదు సినిమాలకే థియేటర్లు ఎలా సర్దుబాటు అవుతాయన్న కన్ ఫ్యూజన్ ఏర్పడగా తమిళ డబ్బింగ్ సినిమాలకు కూడా కొంత శాతం ఇచ్చేస్తున్నారు.
ఐతే దళపతి విజయ్ తన ప్రతి సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అవుతున్నా అప్పుడెప్పుడో తుపాకి సినిమాకు తప్ప మరో సినిమాకు ప్రమోషన్స్ చేయలేదు. శివ కార్తికేయన్ తన ప్రతి సినిమా రిలీజ్ టైం లో తెలుగు ప్రమోషన్స్ చేస్తున్నాడు. కానీ ఈసారి పరాశక్తి విషయంలో ఆయన కూడా వెనక్కి తగ్గాడు. తెలుగులో ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్న టైంలో తమిళ సినిమాల మీద ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారా అన్న డౌట్ ఉంది.
ఐదు సినిమాలు రిలీజ్..
ఎవరి సినిమాల లెక్క వారిది. తమిళంలో అయితే విజయ్ జన నాయగన్, శివ కార్తికేయన్ పరాశక్తి రెండు సినిమాలు వెంట వెట రోజుల్లో వస్తున్నాయి. తెలుగులో ఆ రెండు సినిమాలకు పెద్దగా సెంటర్స్ దొరకట్లేదు. ఆ సినిమాలకు సంబంధించిన తెలుగు ప్రమోషన్స్ కూడా చేయట్లేదు. ఏదో మొక్కుబడి కోసం ప్రెస్ మీట్ లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట తెలుగు డిస్ట్రిబ్యూటర్స్.
తెలుగులో ఈ సంక్రాంతికి ఐదు సినిమాలు రిలీజ్ అవ్వడం అన్నది రికార్డ్ అని చెప్పొచ్చు. ఐతే అన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ బేస్ తోనే వస్తున్నాయి. సంక్రాంతికి ఎంచక్కా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. ఇక తెలుగు సినిమాల ప్రమోషన్స్ కూడా ఊపందుకుంటున్నాయి. రాబోయే వారం రోజులు సినిమాల రిలీజ్ లు, ప్రమోషన్స్ తో హడావిడి షురూ అవుతుంది.
సో ఈ సంక్రాంతికి ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుండగా వాటిలో ఏ సినిమా ఎక్కువ ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటుంది అన్నది చూడాలి. రాజా సాబ్ కి ఒక 3 డేస్ గ్యాప్ ఉంది కాబట్టి ఈలోగా ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐతే తమిళ డబ్బింగ్ సినిమాలకు మాత్రం ఈసారి నిరాశ తప్పేలా లేదు.