ఆ సంక్రాంతి కాంబో మళ్లీ రిపీట్ కానుందా?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న జన నాయగన్ కూడా సంక్రాంతికే రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.;
టాలీవుడ్ లో ఎన్ని సీజన్లు ఉన్నప్పటికీ సంక్రాంతి సీజన్ సంథింగ్ స్పెషల్. సెలవుల్లో ఫ్యామిలీలతో కలిసి సినిమాలకు వెళ్లాలనుకుంటారు కాబట్టి చిన్న నుంచి పెద్ద సినిమాలన్నీ ఆ సీజన్ నే టార్గెట్ చేస్తుంటాయి. తీరా రిలీజ్ దగ్గర పడుతున్న నాటికి చిన్న సినిమాలన్నీ తప్పుకుని కేవలం పెద్ద సినిమాల మధ్యే పోటీ నెలకొంటూ ఉంటుంది.
కలెక్షన్లు బావుంటాయి కాబట్టి నిర్మాతలు కూడా తమ సినిమాలను రిలీజ్ చేయడానికి రెడీగానే ఉంటారు. అయితే ఎక్కువ సినిమాలు ఆ సీజన్ ను టార్గెట్ చేయకూడదనే నేపథ్యంలో ఇప్పుడు సంవత్సరం ముందుగానే దానిపై కర్ఛీఫ్ వేస్తున్నాయి చిత్ర యూనిట్స్. ప్రతీ సంవత్సరం లానే నెక్ట్స్ సంక్రాంతికి కూడా చాలా ముందుగానే సినిమాలు షెడ్యూల్ అయ్యాయి.
వాటిలో అన్నింటికంటే ముందుగా సంక్రాంతి సీజన్ ను లాక్ చేసుకున్న సినిమా మెగా157. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొన్న ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఎంతో ఘనంగా లాంచ్ అయిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ముందుగానే అనౌన్స్ చేశారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న జన నాయగన్ కూడా సంక్రాంతికే రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ కూడా సంక్రాంతి అన్నారు కానీ షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ అవలేదు కాబట్టి డ్రాగన్ పండక్కి రావడం డౌటే. ఇదిలా ఉంటే బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న అఖండ2 కూడా సంక్రాంతిపై కన్నేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి అఖండ2 ఈ ఇయర్ సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ అవసరం ఉండటంతో సంక్రాంతికి వస్తే బావుంటుందని ఆలోచిస్తున్నారట. సంక్రాంతికి అయితే బెటర్ అని బాలయ్య ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.
అంటే మెగా 157, జననాయగన్, అఖండ2 2026లో పోటీ పడనున్నాయన్నమాట. సేమ్ ఇదే కాంబినేషన్ లో మూడేళ్ల కిందట పోటీగా సినిమాలొచ్చాయి. చిరంజీవి, బాలకృష్ణ, విజయ్ ముగ్గురూ తమ సినిమాలను సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేసి మంచి హిట్స్ అందుకున్నారు. చిరు నుంచి వాల్తేరు వీరయ్య రిలీజ్ కాగా, బాలయ్య నుంచి వీర సింహారెడ్డి వచ్చింది. ఈ రెండు సినిమాలూ ఒక రోజు గ్యాప్ లో రిలీజై నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ కు లాభాల వర్షం కురిపించాయి. రెండ్రోజుల తర్వాత విజయ్ నుంచి వచ్చిన వారసుడు తెలుగులో గొప్ప ఫలితాల్ని రాబట్టుకోలేకపోయినప్పటికీ డీసెంట్ గా ముగిసింది. కోలీవుడ్ లో మాత్రం ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఒకవేళ పోటీ నిజమైతే ఈసారి ముగ్గురిలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.