10 వేల కోట్ల ఆస్తిలో క‌రిష్మా క‌పూర్ పిల్ల‌ల వాటా కోసం పోరాటం!

ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత‌, న‌టుడు, పారిశ్రామిక వేత్త సంజ‌య్ క‌పూర్ లండ‌న్ లో పోలో ఆడుతూ అక‌స్మాత్తుగా గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-09-10 00:30 GMT

ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత‌, న‌టుడు, పారిశ్రామిక వేత్త సంజ‌య్ క‌పూర్ లండ‌న్ లో పోలో ఆడుతూ అక‌స్మాత్తుగా గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. 10,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి సృష్టి క‌ర్త అత‌డు. అత‌డి మూడు పెళ్లిళ్లు ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశ‌మే. అయితే రెండో భార్య క‌రిష్మాక‌పూర్ తో ఇద్ద‌రు పిల్ల‌లు, మూడో భార్య ప్రియా స‌చ్ దేవ్ తో ఇద్ద‌రు పిల్ల‌ల‌కు తండ్రి అత‌డు.

అయితే సంజ‌య్ ఆకస్మిక మృతి త‌ర్వాత కుటుంబంలో పెద్ద ఎత్తున ఆస్తి త‌గాదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. వేల కోట్ల ఆస్తుల కోసం అంత‌ర్గ‌తంగా కుమ్ములాట మొద‌లైంద‌ని, సంజ‌య్ ప్ర‌స్తుత భార్య ప్రియా స‌చ్ దేవ్ ఆస్తుల‌న్నిటినీ గుప్పిట ప‌ట్టేందుకు కుట్ర ప‌న్నింద‌ని ఇప్పుడు రెండో భార్య‌ క‌రిష్మా క‌పూర్ పిల్ల‌లు దిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు. త‌మ తండ్రి ఆస్తుల నుంచి న్యాయ‌బ‌ద్ధంగా ఐదో వంతు వాటా త‌మ‌కు చెందాల్సి ఉందని కోర్టుకు విన్న‌వించారు.

ప్రస్తుతం ఆస్తి కీలక అంశాలను నియంత్రించే ప్రియా సచ్‌దేవా ప్రవర్తన‌పై ఈ దావా తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. సంజ‌య్ ఆస్తి విభజన, ఖాతాల మార్పిడి, ఆస్తుల బ‌ద‌లాయింపు వంటి వాటిపై శాశ్వత నిషేధం కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. వారి తండ్రి మరణం తర్వాత, ప్రియా సచ్‌దేవా తన ఆస్తులకు సంబంధించిన ఎటువంటి పత్రాలు లేదా సమాచారాన్ని షేర్ చేయ‌డానికి నిరాకరించారని, పిల్లలకు హాని కలిగించే విధంగా ప‌త్రాల‌ను దాచేసార‌ని దావాలో పేర్కొన్నారు. సంజయ్ కపూర్ మరణించిన తేదీ నాటికి అతని ఎస్టేట్ స్థితిని, ఆ తర్వాత తీసుకున్న ఏవైనా చర్యలను వెల్లడించాలని ప్రియా సచ్‌దేవాకు ఆదేశాలు జారీ చేయాలని దావాలో కోరారు.

సంజ‌య్ మ‌ర‌ణం త‌ర్వాత చివ‌రి వీలునామా గురించి చాలా ప్ర‌శ్నించిన త‌ర్వాత‌ బ‌హిర్గ‌తం చేసారు. అంత‌కుముందు ప్రియా సచ్‌దేవా తమకు ఎటువంటి వీలునామా లేదని పదేపదే చెప్పారని పిల్లలు చెబుతున్నారు. తమ తండ్రి మరణించిన సమయంలో సంజయ్ కపూర్ ఆస్తులన్నీ ఆర్‌కె ఫ్యామిలీ ట్రస్ట్ వద్దే ఉన్నాయని సమాచారం ఉంది. 25 జూలై 2025న జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) సందర్భంగా ట్రస్ట్‌కు సంబంధించిన ఫారమ్‌లపై సంతకం చేయవలసి ఉంటుందని చెప్పినా కానీ, ఎటువంటి వివరణ లేకుండా వారి హాజరు ఇకపై అవసరం లేదని ఫోన్‌ కాల్ వచ్చిన‌ట్లు పిటిష‌న్‌లో తెలిపారు. పిల్లల‌కు వారి తల్లికి ప్రియా స‌చ్ దేవ్ కుటుంబ ట్రస్ట్ డీడ్ లేదా ట్రస్ట్ ఆస్తుల గురించి పూర్తి వివరాలు ఎప్పుడూ అందించలేదు. ఈ పారదర్శకత లేకపోవడంపై పిటిష‌న్ లో ప్ర‌శ్న‌ల్ని లేవ‌నెత్తారు. ప్ర‌తి అంశంలో ప్రియా సచ్‌దేవా ప్రవర్తన చాలా ప్రశ్నార్థకమని దావా పేర్కొంది.

చివ‌రి వీలునామాను ప్రియా స‌చ్ దేవ్ తారుమారు చేసార‌ని కూడా ఆరోపించారు. వీలునామాను చాలా కాలం పాటు దాచి ఉంచార‌ని కూడా క‌రిష్మా పిల్ల‌లు దావాలో పేర్కొన్నారు. ఇప్పుడు క‌రిష్మా పిల్ల‌లు త‌మ తండ్రి వార‌స‌త్వంగా వ‌చ్చే ఆస్తుల‌లో త‌మ వంతు న్యాయ‌మైన వాటాను అడుగుతున్నారు. కోర్టు వీలునామా చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌, కుటుంబ ట్రస్ట్ స్థితి, ప్రియా సచ్‌దేవా చర్యలు పిల్లల హక్కుల‌కు హాని కలిగించాయా లేదా అనే విషయాన్ని హైకోర్టు విచార‌ణ‌లో తేల్చాల్సి ఉంది.

Tags:    

Similar News