'ధురంధర్'ని మించే వివాదాస్పద స్టోరీతో సంజయ్‌దత్!
ఇందులో ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు నమాశి చక్రవర్తి పీహెచ్‌డీ చేసే విద్యార్థిగా సంజయ్‌దత్ శిష్యుడిగా నటిస్తున్నాడు.;
జీయో పాలిటిక్స్ నేపథ్యంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ `ధురంధర్`, ధురంధర్ 2. రన్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించగా టాలెంటెడ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ ఆదిత్యధర్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూడు నెలల వ్యవధిలోనే ఈ రెండు సినిమాలు విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టాయి. మార్చి 19న విడుదలైన `ధురంధర్ 2` ఊహించని విధంగా వసూళ్ల సునామీని సృష్టిస్తూ బాక్సాఫీస్ వద్ద విజయ దుందుభి మోగిస్తోంది.
ఓ పక్క కలెక్షన్‌ల వర్షం కురిపిస్తూనే వివాదాస్పదలతో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే `ధురంధర్`ని మించే వివాదాస్పద స్టోరీతో సంజయ్‌దత్ రెడీ అవుతున్నాడు. బాబ్రీ మసీదు కూల్చివేత, ఆర్ ఎస్ ఎస్ వివాదం నేపథ్యంలో సంజయ్‌దత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `ఆఖ్రీ సవాల్`. వివాదాస్పద అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా మరో సంచలనంగా మారనుందా? అనే చర్చ జరుగుతోంది. జాతీయ అవార్డు గ్రహీత అభిజీత్ మోహన్ వారంగ్ దర్శకత్వంలో అత్యంత సున్నితమైన అంశాల నేపథ్యంలో ఈ మూవీని నిర్మించారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) శతాబ్ది ప్రయాణాన్ని ప్రధాన నేపథ్యంగా తీసుకుని అందులో వివాదాస్పద బాబ్రీ మసీదు అంశాన్ని జోడించడంతో దేశ వ్యాప్తంగా `ఆఖ్రీ సవాల్` పెను సంచలనం సృష్టించే అవకాశం ఉందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. మే 8న భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఇందులోని కీలక పాత్రలో బాలీవుడ్ బ్యాడ్‌మెన్ సంజయ్ దత్ నటిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన సంచలన చిత్రం `ధురంధర్`, `ధురంధర్ 2`లో ఎస్పీ చౌదరీ అస్లాం క్యారెక్టర్‌లో నటించి ఆకట్టుకున్న సంజయ్ ఇప్పుడు ఈ మూవీలో మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ప్రొఫెసర్ గోపాల్ నాదకర్ణిగా కనిపించి ఆకట్టుకోబోతున్నాడు.
ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు నమాశి చక్రవర్తి పీహెచ్‌డీ చేసే విద్యార్థిగా సంజయ్‌దత్ శిష్యుడిగా నటిస్తున్నాడు. గాంధీ హత్యానంతరం ఆర్ ఎస్ ఎస్‌పై ఆనాటి ప్రభుత్వం నిషేధాన్ని ఎందుకు విధించింది? దాని వెనకున్న పరిస్థితులు ఏమీటి? 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఎందుకు జరిగింది? వంటి సున్నితమైన అంశాలని ఇందులో ప్రధానంగా చర్చిస్తున్నారు.
టీజర్‌లో ఇవే అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. 1992లో బాబ్రీ మసీదుని కూల్చి వేయడం తెలిసిందే. ఇప్పుడు అదే ప్రదేశంలో రామ మందిరాన్ని నిర్మించారు. ఇన్నేళ్ల తరువాత మళ్లీ బాబ్రీ మసీదు అంశాన్ని తెరపైకి తీసుకొస్తుండటంతో ఈ సినిమా దేశ వ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపడం ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. సమీరారెడ్డి, నీతూ చంద్ర, త్రిధా చౌదరి, అర్చనా అయ్యర్, మ్రిణాల్ కులకర్ణి, అమిత్ సాధ్ కీలక పాత్రల్లో నటించారు. నిఖిల్ నందా, సంజయ్‌దత్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.