ప్రభాస్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన సందీప్.. కారణమేంటి?
సందీప్ రెడ్డి వంగ. ఈ పేరు పదేళ్ల కింద ఇండస్ట్రీలో ఎవరికీ తెలియదు. కానీ, రెండు సినిమాలతోనే భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్ గా మారారు.;
సందీప్ రెడ్డి వంగ. ఈ పేరు పదేళ్ల కింద ఇండస్ట్రీలో ఎవరికీ తెలియదు. కానీ, రెండు సినిమాలతోనే భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్ గా మారారు. ఆయన చిన్న మాట మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్ట్ వేసినా అది ట్రెండ్ గా మారిపోతుంది. తెలుగులో అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించిన సందీప్.. హిందీలో యానిమల్ తో సత్తా చాటాడు. అలా రెండు సినిమాలకే టాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమల చూపు తనపైపు తిప్పుకున్నారు.
ఇప్పుడు పాన్ఇండియా హీరో ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రకటన ఇచ్చినప్పటిక నుంచే దీనిపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. ఎంతలా అంటే, ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయాలనుకున్నా ఈ సినిమా వందల కోట్లు వసూల్ చేసేంత. అటు ప్రభాస్ కు భారీ రేంజ్ లో మార్కెట్ ఉండడం, బోల్డ్ యాక్షన్ సినిమాలకు సందీప్ కేరాఫ్ అడ్రస్ గా ఉండడం దీనికి మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. అందరి అంచనాలు అందుకునేలా గురువారం లేట్ నైట్ లో ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఇందులో సరిగ్గా గమనిస్తే టైటిల్ కార్డ్స్ లో సందీప్.. ప్రభాస్ కు ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు. ఇది ఆయన మార్క్ ను చూపిస్తుంది. టైటిల్స్ లో ప్రభాస్ పేరుకు ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ట్యాగ్ జతచేశారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ లో ఎక్కడాలేని జోష్ వచ్చింది. అసలే సందీప్ సినిమాలు అంటే ఓ లెవెల్ లో ఉంటాయి. దానికి తోడు ఆయన ప్రభాస్ కు.. ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ట్యాగ్ జోడించడంతో ఆగలేకపోతున్నారు.
టాలీవుడ్ సహా దేశంలో ఆయా భాషల్లో పులువురు స్టార్లు ఉన్నారు. వాళ్ల సినిమాలు కూడా పాన్ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి. స్వయంగా సందీప్ తీసిన యానిమల్ కూడా ఐదు భాషల్లో రిలీజ్ అయ్యింది. కానీ మునుపెన్నడూ సందీప్ తన హీరోకు ఇలాంటి భారీ ట్యాగ్ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభాస్ ను అలా చూపించడంతో.. ఇది బాలీవుడ్ కు ఓ రకమైన హెచ్చకరినే అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాతో సందీప్ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ను కొల్లగొట్టడం పక్కా అని పోస్టులు పెడుతున్నారు.
వాస్తవానికి ప్రభాస్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్లలో ఒకరే. బాహుబలితో పాన్ఇండియా స్టార్ గా మారిన ఆయన.. ఆ తర్వాత ఒక్కో సినిమాకు మార్కెట్ పెంచుకుంటున్నారు. బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి ఇలా ఒక్కో సినిమాకు ఆయన స్టార్ డమ్, మార్కెట్ పెరిగింది. 10ఏళ్ల కాలంలో వచ్చిన ఈ సినిమాలు దాదాపు రూ.5 వేల కోట్ల మార్కెట్ చేశాయి. భారత్ దేశంలో ఏ హీరో కూడా ఇదే సమయంలో ఇంత బిజినెస్ చేయలేదు. అందుకే ప్రభాస్ ఇండియా బిగ్గెస్ట్ స్టారే. అందులో ఎలాంటి డౌట్ లేదు.