NYE 2026: కొత్త జంట విదేశీ బీచ్‌ల‌కు జంప్

సమంత లైఫ్‌ గేమ్ ఛేంజింగ్ ఇయ‌ర్ ఇది. `ది ఫ్యామిలీమ్యాన్` ఫేం రాజ్ నిడిమోరును పెళ్లాడిన త‌ర్వాత త‌న జీవితంలో ఒక కొత్త వెలుగు స్ప‌ష్టంగా కనిపిస్తోంది.;

Update: 2025-12-30 19:28 GMT

సమంత లైఫ్‌ గేమ్ ఛేంజింగ్ ఇయ‌ర్ ఇది. `ది ఫ్యామిలీమ్యాన్` ఫేం రాజ్ నిడిమోరును పెళ్లాడిన త‌ర్వాత త‌న జీవితంలో ఒక కొత్త వెలుగు స్ప‌ష్టంగా కనిపిస్తోంది. మునుప‌టితో పోలిస్తే ఇటీవ‌ల‌ సామ్ ఎంతో ఆనందంగా ఎంతో ఉద్విగ్నంగా క‌నిపిస్తోంది. భ‌ర్త‌తో విదేశీ విహార యాత్ర‌ల‌ను ఎంత‌గానో ఆస్వాధిస్తోంది. ప్ర‌స్తుతం ఈ అంద‌మైన జంట పోర్చ్ గీస్ లో హ‌నీమూన్ ని ఆస్వాధిస్తున్నారు. 2025 ముగింపు పార్టీని, కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను ఆస్వాధించేందుకు ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌తో మైమ‌రిపించే అంద‌మైన దేశాన్ని ఈ జంట ఎంపిక చేసుకోవ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. పోర్చ్ గీస్ బీచ్ ల‌లో, అంద‌మైన ప్ర‌కృతి దృశ్యాల‌లో షికార్ చేస్తున్న ఫోటోల‌ను సామ్ సోష‌ల్ మీడియాల్లో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారుతున్నాయి.

అందాల క‌థానాయిక స‌మంత‌కు వృత్తిగ‌తంగా వ్య‌క్తిగ‌తంగా ఈ సంవ‌త్స‌రం అత్యంత క‌లిసి వ‌చ్చిన సంవ‌త్స‌రం అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. 2025 సామ్ కు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తన సొంత‌ నిర్మాణ సంస్థ త్రలాలా మూవింగ్ పిక్చర్స్‌ను ఈ ఏడాది ప్రారంభించింది. ఈ బ్యాన‌ర్‌ మొదటి చిత్రం `శుభమ్` విడుద‌లైంది. డిసెంబర్‌లో రాజ్ నిడిమోరును వివాహం చేసుకోవ‌డం త‌న జీవితంలో మ‌రో కీల‌క మలుపు.

వ్య‌క్తిగ‌త జీవితంలో బ్రేక‌ప్, చాలా స‌ర్ధుబాటు త‌ర్వాత మ‌యోసైటిస్ నుంచి కోలుకుని స‌మంత చేసిన సాహ‌సాలు అన్నీ ఇన్నీ కావు. అన్ని క‌ల‌త‌ల‌ నుంచి బ‌య‌ట‌ప‌డి మ‌న‌సుకు సాంత్వ‌నతో కూడుకున్న ఆనందం క‌లిగించే కొత్త బంధంలోకి సామ్ అడుగుపెట్టింది. స‌మంత‌ -రాజ్ నిడిమోరు జంట డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో వివాహం చేసుకున్నారు. అంత‌కుముందు, యోగ వేడుకలో రాజ్ తో క‌లిసి ఉన్న‌ ఫోటోలను సామ్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 (2021).. సిటాడెల్: హనీ బన్నీ (2024) వెబ్ సిరీస్ ల కోసం కలిసి పనిచేసిన త‌ర్వాత వారి మ‌ధ్య స్నేహ‌బంధం ప్రేమ‌గా మారింది. అటుపై 2023లో ఈ జంట‌పై చాలా ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.

కొన్ని వ‌రుస‌ ఈవెంట్లలో కలిసి కనిపించిన తర్వాత .. ఒకరి సోషల్ మీడియా పోస్ట్‌లలో ఒక‌రు ఉన్న విష‌యాన్ని అర్థ‌మ‌య్యేలా చెప్పే ప్ర‌య‌త్నం చేసాక జ‌నాల‌కు అర్థ‌మైంది. 2024లో ఈ జంట న‌డుమ డేటింగ్ గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. డిసెంబర్ 2025లో వివాహ ప్రకటనతో ఈ జంట అధికారికంగా తమ సంబంధాన్ని ధృవీకరించారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, సమంత మరోసారి `రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్‌డమ్‌` వెబ్ సిరీస్ కోసం రాజ్ అండ్ డికెతో కలిసి పనిచేస్తోంది. ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్, వామికా గబ్బి, జైదీప్ అహ్లావత్ త‌దిత‌రులు న‌టించిన‌ ఈ సిరీస్ 2026లో విడుదలవుతుంది. రాజ్ అండ్ డీకే `ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3` ఈ సంవత్సరం నవంబర్‌లో విడుదలై ప్రజాదరణ పొందిన సంగ‌తి తెలిసిందే.



Tags:    

Similar News