60 వయసులో ఏంటిది అవసరమా అని ఫీలవుతున్న ఫ్యాన్స్!
సల్మాన్ భాయ్ రిలీజ్ చేసిన తాజా వీడియోలో అతడు ఒక పందెంలో పాల్గొన్నాడు. అతడు గుర్రాన్ని మించిన వేగంతో పరుగు పెడుతూ కనిపించాడు.;
ఇటీవలే షష్ఠిపూర్తి పూర్తి చేసుకున్నాడు సల్మాన్ భాయ్. అతడి షష్ఠిపూర్తికి టాలీవుడ్ నుంచి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా అటెండయ్యాడు. సల్మాన్, ఎం.ఎస్.ధోనీతో కలిసి చరణ్ పార్టీలో ఫుల్ గా చిల్ అయ్యాడు. అదంతా సరే కానీ, సల్మాన్ భాయ్ ఈ ఏజ్‌లో చేస్తున్న సాహసాలు అన్నీ ఇన్నీ కావని తాజాగా అతడు షేర్ చేసిన ఓ వీడియో చెబుతోంది.
సల్మాన్ భాయ్ రిలీజ్ చేసిన తాజా వీడియోలో అతడు ఒక పందెంలో పాల్గొన్నాడు. అతడు గుర్రాన్ని మించిన వేగంతో పరుగు పెడుతూ కనిపించాడు. లక్ష్యాన్ని చేరుకోవడం కోసం సల్మాన్ భాయ్ ఎంత కసిగా ఉంటాడో ఈ వీడియో చూస్తుంటే చెబుతోంది. అసలు వయసును కూడా మర్చిపోయి, అతడు ఇంకా టీనేజీ కుర్రాడిలా అంత వేగంగా ఎలా పరిగెత్తగలడు? అంటూ అందరూ నోరెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం ఈ స్పెషల్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
ఇటీవలే 'ది బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' చిత్రం కోసం సల్మాన్ ఖాన్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని కథనాలొచ్చాయి. ఇండో-చైనా బార్డర్ గల్వాన్ లో జరిగిన ఆయుధ రహిత బాహాబాహీ యుద్ధం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో సల్మాన్ భాయ్ పాత్ర శత్రువులను ఢీకొట్టడానికి చేతిలో ఎలాంటి ఆయుధాలు ధరించడానికి లేదు. అందువల్ల అతడు ముష్ఠి యుద్ధం చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగానే అతడు తన శరీరాన్ని ప్రిపేర్ చేసాడు. మునుపటిలా సల్మాన్ కండలు మెలి తిప్పుతున్నాడు. భీకర పోరాటంలో చైనా సైనికుల్ని మట్టి కరిపించే వీరుడిలా కనిపించాలి గనుక దానికి తగ్గట్టుగా మారాడు. ఇప్పుడు రన్నింగ్ రేస్ లో పిక్కబలం ప్రదర్శిస్తున్న తీరు కూడా ఆశ్చర్యపరిచింది.
టీజర్ కి అద్భుత స్పందన..
అపూర్వ లఖియా తెరకెక్కిస్తున్న 'ది బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' పై చాలా అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 27న ఈ చిత్రం మొదటి టీజర్‌ను విడుదల చేయగా చక్కని స్పందన వచ్చింది. అయితే ఈ టీజర్ వచ్చిన తర్వాత చైనా పత్రికలు సినిమా కంటెంట్ వన్ సైడెడ్ గా ఉంటుందని ఆరోపించాయి. ఈ చిత్రంలో చిత్రాంగద సింగ్ కథానాయికగా నటిస్తోంది. జైన్ షా, హీరా సోహల్, అభిలాష్ చౌదరి, అంకుర్ భాటియా.. విపిన్ భరద్వాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.