ట్రెండీ టాక్‌: ఆ ముగ్గురి త‌ర్వాత పైడిప‌ల్లి నిరూపిస్తాడా?

భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగు దర్శకుల పేర్లే మార్మోగుతున్నాయి.;

Update: 2026-04-03 05:42 GMT

భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగు దర్శకుల పేర్లే మార్మోగుతున్నాయి. ముఖ్యంగా ముగ్గురు దర్శకులు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తూ అక్కడ అగ్ర దర్శకులకు సైతం చెమటలు పట్టిస్తున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి 2, ఆర్.ఆర్.ఆర్ చిత్రాలతో గ్లోబల్ మార్కెట్‌ను శాసించగా, సందీప్ రెడ్డి వంగా కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో సంచలనం సృష్టించారు. ఇక సుకుమార్ పుష్ప, పుష్ప 2 చిత్రాలతో మాస్ జాతరను ఉత్తరాదికి పరిచయం చేసి టాప్ లీగ్‌లో చేరిపోయారు. ఇప్పుడు ఈ ముగ్గురి తర్వాత అదే స్థాయిలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న తదుపరి తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి కావడం విశేషం.

వంశీ పైడిపల్లికి ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం దక్కింది. బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్‌తో వంశీ ఒక భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించబోతున్నారు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సల్మాన్ కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించాల్సిన బాధ్యత వంశీపై ఉంది. ఇప్పటివరకు క్లాస్ సినిమాలతో మెప్పించిన అత‌డు సల్మాన్ వంటి మాస్ ఐకాన్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రాజమౌళి, సుకుమార్ తరహాలో వంశీ కూడా మ్యాసివ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ల‌తో 1000 కోట్ల క్లబ్ లీగ్‌లో చేరుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

వంశీ పైడిపల్లి సాధారణంగా ఫ్యామిలీ ఎమోషన్స్, క్లాసిక్ టచ్ ఉన్న కథలను ఎంచుకుంటారు. కానీ సల్మాన్ ఖాన్ ఇమేజ్‌కు అది సరిపోదని అభిమానులు భావిస్తున్నారు. అంతేకాదు.. ర‌ణ‌బీర్ క‌పూర్, ర‌ణ్ వీర్ సింగ్, విక్కీ కౌశ‌ల్ లాంటి నేటిత‌రం స్టార్లు రేసులో అగ్ర‌ప‌థాన దూసుకుపోతుంటే ఖాన్ ల‌కు ఇది కంటిపై కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీట్ గా మారింది. దీంతో వారంతా 1000 కోట్ల క్ల‌బ్ ల‌పై ఆశ‌ల‌తో ఉన్నారు. అందుకే ఇప్పుడు స‌ల్మాన్ కోసం వంశీ తన పంథాను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంత పెద్ద స్టార్ తో గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తారా? లేక కల్ట్ క్లాసిక్ సినిమాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తారా? అన్న చర్చ మొదలైంది. కేవలం సౌత్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా.. పాన్ ఇండియా స్థాయిలో అందరినీ మెప్పించే గ్లోబల్ కంటెంట్‌ను ఆయన ఎంచుకున్నట్లు సమాచారం.

సల్మాన్ ఖాన్‌కు వంశీ పైడిపల్లి ఎలాంటి స్క్రిప్ట్ వినిపించి ఉంటారనే దానిపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సల్మాన్ మార్కెట్‌కు వంశీ మేకింగ్ స్టైల్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో కొత్తదనాన్ని చూపిస్తూనే, సల్మాన్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా పవర్‌ఫుల్ డైలాగ్స్‌ను వంశీ సిద్ధం చేసినట్లు టాక్. ఈ సినిమా పట్టాలెక్కితే బాలీవుడ్‌లో తెలుగు దర్శకుల ప్రాభవం మరింత పెరగడం ఖాయం.

మొత్తానికి రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా సృష్టించిన ప్రభంజనాన్ని వంశీ పైడిపల్లి కొనసాగిస్తారో లేదో వేచి చూడాలి. సల్మాన్ ఖాన్‌కు ఒక భారీ హిట్ ఇచ్చి.. తన మార్కెట్‌ను బాలీవుడ్‌లో సుస్థిరం చేసుకోవడానికి వంశీకి ఇది ఒక సువర్ణావకాశం. ఒకవేళ ఈ సినిమా క్లిక్ అయితే 1000 కోట్ల క్లబ్‌లో చేరిన నాలుగో తెలుగు దర్శకుడిగా వంశీ చరిత్ర సృష్టిస్తారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Tags:    

Similar News