స్టార్లు బౌండ్ స్క్రిప్ట్ చదవాల్సిన పని లేదంటారా?
స్క్రిప్ట్ పుస్తకాలు చదివేదానికంటే.. సదరు దర్శకుడు కథ చెప్పేటప్పుడు ఆ కథలోని `ఫీల్` (భావోద్వేగం) ఎంత బలంగా ఉంది?
బౌండ్ స్క్రిప్టు చదవాల్సిన పని లేదు. కానీ సినిమాని ఫీలవ్వడం.. కమర్షియల్ గా విజువలైజ్ చేసుకోవడం చాలా ముఖ్యం.. ఈ మాట అన్నది ఆషామాషీ స్టార్ కాదు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తానేం చేస్తాడో చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎవరైనా స్టార్ వందశాతం స్క్రిప్టు చదివి తన పాత్రను ఆకళింపు చేసుకున్న తర్వాతే ఓకే చెబుతానని అంటారు. కానీ సల్మాన్ అందుకు భిన్నంగా ఉన్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా తిరుగులేని కమర్షియల్ సినిమా రారాజుగా రాణిస్తున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన సినిమా ఎంపిక ప్రక్రియ గురించి ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. తన సుదీర్ఘమైన సినీ ప్రస్థానంలో ఎన్నో ఇండస్ట్రీ హిట్లను, వందల కోట్ల వసూళ్లను సాధించిన ఖాన్.. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క పూర్తి స్క్రిప్ట్‌ను కూడా చదవలేదని వెల్లడించారు. `వెరైటీ ఇండియా`కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన విషయాలు ఇప్పుడు బాలీవుడ్ వర్గాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
నా జీవితంలో నేను ఎప్పుడూ ఒక పూర్తి స్క్రిప్ట్‌ను కూర్చుని చదవలేదు.. కథలు నేనే రాశాను తప్ప.. ఇతరులు రాసిన స్క్రిప్ట్‌లను మాత్రం చదవలేదు! అంటూ సల్మాన్ భాయ్ చేసిన వ్యాఖ్యల ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దర్శకులు కథ పట్టుకుని తన వద్దకు వచ్చినప్పుడు పూర్తి స్క్రిప్ట్ రీడింగ్‌లను తాను ఎందుకు స్కిప్ చేస్తారో సల్మాన్ ఖాన్ చాలా సరళంగా వివరించారు. స్క్రిప్ట్‌ను లైన్-టు-లైన్ చదవడం వల్ల అనవసరంగా ఎక్కువ ఆలోచించాల్సి వస్తుందని.. దానివల్ల సినిమా మూలకథపై ఉన్న క్లారిటీ దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
స్క్రిప్ట్ పుస్తకాలు చదివేదానికంటే.. సదరు దర్శకుడు కథ చెప్పేటప్పుడు ఆ కథలోని `ఫీల్` (భావోద్వేగం) ఎంత బలంగా ఉంది? అలాగే దానికి బాక్సాఫీస్ వద్ద ఉండే `కమర్షియాలిటీ` (వ్యాపార సామర్థ్యం) ఎంతవరకు ఉంది? అనే అంశాలను మాత్రమే తాను చూస్తానని స్పష్టం చేశారు. ఆ ఫీల్ నచ్చితేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానని.. ఒకవేళ మార్పులు అవసరమైతే తానే స్వయంగా కూర్చుని స్క్రిప్ట్ ఐడియాలు రాస్తానని సల్మాన్ భాయ్ తన ప్రత్యేకమైన శైలిని బయటపెట్టారు.
ఇదే ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత జీవితంపైనా. విలాసవంతమైన వస్తువుల కొనుగోళ్లకు సంబంధించి మీడియాలో నిరంతరం నడిచే ఆసక్తికరమైన చర్చలపైనా కూడా చాలా సరదాగా స్పందించారు. సాధారణంగా సల్మాన్ పబ్లిక్ ఈవెంట్లలో లేదా ప్రమోషన్లలో కనిపించినప్పుడు ఆయన చేతికి దాదాపు రూ. 1 కోటికి పైగా విలువ చేసే అత్యంత ఖరీదైన లగ్జరీ వాచీలు కనిపిస్తూ ఉంటాయి. వీటిపై సూపర్ స్టార్ స్పందిస్తూ.. ఆ లగ్జరీ వాచీల కలెక్షన్ అంతా తన సొంతం కాదంటూ ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. మీరు నన్ను రకరకాల లగ్జరీ వాచీలు ధరించి చూడవచ్చు.. అంతమాత్రాన ఆ వాచీలన్నీ నావని కాదు.. అది ఈ ఫ్రెండ్ దో లేక ఇంకెవరైనా ఫ్రెండ్ ఇచ్చిందో అయ్యుంటుంది. నేను కేవలం వారి వాచీలను పెట్టుకుంటాను అంతే! అని నవ్వుతూ సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
సల్మాన్ ఇటీవల విడుదలైన `రాజా శివాజీ` చిత్రంలో చేసిన ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్‌తో సోషల్ మీడియాను షేక్ చేశారు. నటుడు రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ భారీ చిత్రంలో సల్మాన్ ఖాన్ `జీవా మహాలా` అనే అత్యంత పరాక్రమవంతుడైన యోధుడి పాత్రలో మెరిశారు. సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యాబాలన్ వంటి పెద్ద తారాగణంతో రూపొందిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కనిపించిన కొద్ది నిమిషాల స్క్రీన్ ప్రెజెన్స్.. ఆయన చూపించిన రౌద్రం థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడమే కాకుండా సినిమా విజయానికి ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
సినిమా ఇండస్ట్రీలో ఒక స్క్రిప్ట్‌ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే దానికి ఉండే సాంప్రదాయ పద్ధతులను పక్కనబెట్టి కేవలం తన సిక్స్త్ సెన్స్ .. కమర్షియల్ పల్స్ ఆధారంగానే సల్మాన్ ఖాన్ దశాబ్దాలుగా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఏలుతున్నారు. కథలోని ఆత్మను, ప్రేక్షకుల మూడ్‌ను పట్టుకోగలగడమే తన విజయ రహస్యమని ఆయన తాజా వ్యాఖ్యలు చెబుతున్నాయి. పూర్తి స్క్రిప్ట్ చదవకపోయినా.. తనకున్న అపారమైన అనుభవంతో దర్శకుల విజన్‌ను స్క్రీన్ పైకి తెచ్చి బ్లాక్‌బస్టర్లు కొట్టడం కేవలం సల్మాన్ భాయ్ కే సాధ్యమంటూ ట్రేడ్ వర్గాలు సైతం ఆయన జడ్జిమెంట్‌ను మెచ్చుకుంటున్నాయి. సల్మాన్ చెప్పిన దానిని బట్టి బౌండ్ స్క్రిప్టు చదవనిదే మేం సెట్స్ కి వెళ్లబోం అనే చెప్పే హీరోలందరినీ రొటీన్ సాంప్రదాయవాదులుగా భావించాల్సి ఉంటుంది.