స్టార్ హీరోని వేటాడుతున్న కృష్ణ జింక
దశాబ్ధాలుగా స్టార్ హీరోకి కంటిమీద కునుకుపట్టనివ్వకుండా చేసిన ఒక కృష్ణ జింక ఇప్పటికీ అతడిని వెంటాడుతోంది.;
దశాబ్ధాలుగా స్టార్ హీరోకి కంటిమీద కునుకుపట్టనివ్వకుండా చేసిన ఒక కృష్ణ జింక ఇప్పటికీ అతడిని వెంటాడుతోంది. అది తనను వేటాడినందున కృష్ణ జింక శాపం అని ఒక గ్రామంలోని గిరిజన తెగ భావిస్తోంది. ఈ గొడవ ఏమిటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. 1998లో జోధ్ పూర్ పరిసర అడవుల్లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను వేటాడి చంపిన కేసులో ఇప్పటికీ నిర్ధోషిగా బయటపడలేదు. అప్పట్లోనే కోర్టు అతడిని దోషి అని పేర్కొంటూ, ఐదేళ్ల జైలు, రూ.2500 ఫైన్ విధించింది. కానీ సల్మాన్ కొన్నాళ్ల పాటు జైలులో ఉన్నా, ఆ తర్వాత బెయిల్ పై బయటికి వచ్చారు. అతడు యథేచ్ఛగా సినిమాలు తీసుకుంటున్నారు.
కానీ ఈ కేసుతో సంబంధం ఉన్న బిష్ణోయ్ కమ్యూనిటీ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపులతో సల్మాన్ పూర్తిగా భయాందోళనలో ఉన్నాడు. సల్మాన్, అతడి కుటంబ భద్రత గురించి ముంబై పోలీసులు నిరంతరం కునుకు కరువై ఆందోళనలో ఉన్నారు. ఇంతలోనే ఇప్పుడు ఈ నల్ల జింక కేసు మరోసారి కోర్టులో విచారణకు వచ్చింది.
నిజానికి కృష్ణ జింక వేట కేసులో నిర్ధోషులుగా బయటపడ్డ సల్మాన్ సహచరులు సైఫ్ ఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలం, దుష్యంత్ సింగ్ లపై తిరిగి విచరించాలని ఇటీవల రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయడంతో ఇది పెద్ద చర్చగా మారింది. సల్మాన్ తో పాటు వేటలో ఉన్న ఇతర స్టార్లను నిర్ధోషులుగా వదిలేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లడంతో అది సీరియస్‌గా మారుతోంది. ఇప్పుడు దీనిపై విచారణ షురూ అయింది. ఇదే సమయంలో సల్మాన్ దోషిగా తేలడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ కూడా రాజస్థాన్ హైకోర్టు విచారిస్తుండడం ప్రజల్లో చర్చగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన లీవ్ టు అప్పీల్‌ను కూడా హై కోర్టు తాజాగా విచారించింది.
అయితే నిర్ధోషులుగా విడుదలైన వారిపై చాలా ఆలస్యంగా ఇప్పుడు అప్పీల్ కి రావడంతో ఈ కేసును హైకోర్ట్ బెంచ్ వాయిదా వేసింది. తదుపరి తేదీని ఇప్పటి నుండి ఎనిమిది వారాలకు షెడ్యూల్ చేశారు. ఇప్పటికే ఈ కేసుల్లో విచారణలు ఆలస్యం కాగా, ఇతర జాప్యం జరగకపోతే ఈ కేసు ఏడాది చివరి నాటికి తిరిగి విచారణ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
1998లో `హమ్ సాత్ సాత్ హై` షూటింగ్ సమయంలో జరిగిన ఘటన ఇది. జోధ్ పూర్‌లోని కంకణి గ్రామం సమీపంలో షూటింగ్ జరుగుతుండగా, సల్మాన్ అతడి సహచర బృందం అడవిలో వేటకు వెళ్లారు. అక్కడ బిష్ణోయ్ లు పవిత్రంగా భావించే కృష్ణజింకను వేటాడారు. దశాబ్ధాల పాటు ఈ కేసు వారిని విడిచిపెట్టడం లేదు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఎంత పవర్ ఫుల్ గా ఉందో సల్మాన్ కేసు ప్రజలకు పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది. ఒక కృష్ణ జింక స్టార్ హీరోని సంఘంలో పెద్ద స్టాటస్, ఆస్తులు అంతస్తులు ఉన్నవాడిని ఎలా వేటాడిందో నిరూపించే అద్భుత కథ ఇది.