సైయారా ని 'సత్రంగా' దించుతున్నారా?
బాలీవుడ్ యువ జంట అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన 'సైయారా' ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే.;
బాలీవుడ్ యువ జంట అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన 'సైయారా' ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. సంగీతపరంగానూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మోహిత్ సూరి క్లాసిక్ హిట్స్ లో 'సైయారా' ఒకటిగా నిలిచింది. తాజాగా ఇదే జోడితో మోహిత్ సూరి సైయారాకి సీక్వెల్గా మరో చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. తాజాగా ఈ సీక్వెల్ కు 'సత్రంగా' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. 'సత్రంగా' అంటే హిందీలో 'ఏడు రంగులు' కలిగినది అని అర్థం.
అయితే ఈ సినిమా టైటిల్ రంగులకు సంబంధించింది కాదు. ప్రేమలోని వివిధ దశలను ,భావోద్వేగాలను సూచిస్తుంది. 'సత్రంగా' అనే పదం ప్రేమలోని ఏడు స్థాయిలను అంటే ఆకర్షణ , వ్యామోహం , ప్రేమ నమ్మకం , ఆరాధన , వెర్రితనం , చివరికి మరణం వంటి విభిన్న పార్శ్వాలను ప్రతిబింబించేలా ఈ కథను మోహిత్ సూరి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మోహిత్ సూరి మార్క్ సినిమాల్లో సంగీతం ,భావోద్వేగాలు ఎంతో బలంగా ఉంటాయి. `సైయారా`లో చూసిన ఫీల్ కంటే కూడా `సత్రంగా`లో మరింత గాఢమైన ,సంక్లిష్టమైన ప్రేమకథను ఆశించవచ్చు.
యష్ రాజ్ ఫిల్మ్స్ సీఈఓ అక్షయ్ విద్వానీ ఈ చిత్రాన్ని ''మరింత నిజాయితీతో కూడినది. సున్నిత మైనది.శాశ్వతమైనది'' అని అభివర్ణించారు. అంటే యువతను ఆకట్టుకునే అంశాలతో పాటు, గుండెలను హత్తుకునే లోతైన భావాలు ఇందులో ఉంటాయన్నది స్పష్టమవుతోంది. గతంలో రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' చిత్రంలో 'సత్రంగా' అనే పాట ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ పాటలో ప్రేమలోని నొప్పిని, అంకితభావాన్ని ఎంతో అందంగా చూపించారు. అదే పేరుతో సినిమా రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత రెట్టింపు అయింది.
అహాన్ పాండే - అనీత్ పడ్డాల మధ్య ఉన్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఈ రంగుల ప్రేమకథకు ప్రధాన ఆకర్షణ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ ఏడాది చివరలో షూటింగ్ ప్రారంభించి 2027 చివరలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అహాన్ పాండే ఇప్పటికే అలీ అబ్బాస్ జాఫర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అనీత్ పడ్డా మాడక్ ఫిల్మ్స్ హారర్ కామెడీలో నటిస్తోంది. ఆ రెండు సినిమాల నుంచి ఇద్దరు రిలీవ్ అవ్వగానే 'సత్రంగా' కోసం సెట్స్‌పైకి వెళ్తారు. 'సైయారా' సక్సెస్ అయిన నేపథ్యంలో సీక్వెల్ ను పాన్ ఇండియాలో ప్లాన్ చేసే అవకాశాలు లేకపోలేదు. యశ్ రాజ్ ఫిలింస్ కూడా పాన్ ఇండియా మార్కెట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోన్న నేపథ్యంలో సత్రంగా మంచి ఆప్షన్ కానుంది.