'ఒక్క విషయంలోనూ వేలు పెట్టకుండా కోపరేషన్'.. అబ్బవరంపై సాయి రాజేష్ ప్రశంసలు

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కొత్త మూవీ చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందడిగా జరిగింది.

Update: 2026-07-18 17:18 GMT

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కొత్త మూవీ చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందడిగా జరిగింది. జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమా ట్రైలర్ ఈవెంట్‌ లో మూవీ టీమ్ సినిమా విశేషాలను పంచుకుంది. ముఖ్యంగా నిర్మాత, స్టోరీ రైటర్ సాయి రాజేష్ చేసిన కామెంట్స్ ఆకట్టుకున్నాయి. కిరణ్ అబ్బవరం వర్కింగ్ స్టైల్, సినిమా పట్ల ఆయన చూపిన నమ్మకంపై సాయి రాజేష్ ప్రశంసలు కురిపించారు.

సాయి రాజేష్ మాట్లాడుతూ.. కిరణ్ అబ్బవరం ప్రస్తుతం సక్సెస్ జోష్ లో ఉన్నప్పటికీ, కథ వినగానే వెంటనే అంగీకరించారని చెప్పారు. "ఒక్క విషయంలోనూ వేలు పెట్టకుండా మొత్తం టీమ్‌ కు ఫ్రీడమ్ ఇచ్చారు. మమ్మల్ని నమ్మి సినిమా చేస్తానని చెప్పారు. గత ఏడాది కాలంగా అద్భుతంగా సహకరిస్తున్నారు. ఆయన చాలా ప్రశాంతంగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. చెన్నై లవ్ స్టోరీ తర్వాత కిరణ్ అబ్బవరం మరో స్థాయికి వెళ్తారని నమ్ముతున్నాను" అని అన్నారు.

సినిమా సెకండాఫ్ ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్‌ గా ఉంటుందని సాయి రాజేష్ తెలిపారు. ఈ సినిమా కోసం కిరణ్ అబ్బవరం ఎంత కష్టపడ్డారో ప్రేక్షకులకు అప్పుడు అర్థమవుతుందన్నారు. వచ్చే పుట్టినరోజు నాటికి ఆయనను మరింత బెస్ట్ ప్లేస్ లో చూడాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ప్రేమ కథలపై తన అభిప్రాయాన్ని కూడా సాయి రాజేష్ పంచుకున్నారు. ప్రేమలో 'ప్రే' అంటే ప్రేమించడం, 'అ' అంటే మరిచిపోవడమని అన్నారు.

ప్రేక్షకులను ఏడిపించడం తన టార్గెట్ కాదని, అయితే ప్రతి దర్శకుడు లేదా రచయితలా ప్రేక్షకుల మనసులపై డీప్ ఎఫెక్ట్ చూపించాలనే ఉద్దేశంతో కథలు రాస్తానని వెల్లడించారు. దర్శకుడు రవి నంబూరి మాట్లాడుతూ.. సినిమా టైటిల్‌ లో చెన్నై అనే పదం ఎందుకు ఉందో ప్రస్తుతం పూర్తిగా చెప్పలేనని అన్నారు. కథకు మరో బ్యాక్ డ్రాప్ ఎంచుకోవచ్చని మొదట సజెషన్లుు వచ్చినా, చెన్నైతో చాలా మందికి కనెక్టివిటీ ఉండటంతో అదే బ్యాక్‌ డ్రాప్‌ ను ఎంచుకున్నామని చెప్పారు.

హీరోయిన్ గౌరీప్రియ మాట్లాడుతూ.. సినిమా తన కెరీర్‌ లో మైల్ స్టోన్ గా నిలుస్తుందని చెప్పారు. కథ విన్న తర్వాత రిజెక్ట్ చేయడానికి ఒక్క కారణం కూడా కనిపించలేదని, అందుకే వెంటనే అంగీకరించానన్నారు. సినిమాలోని ఎమోషనల్ సీన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయని, ముఖ్యంగా సెకండాఫ్ లో కొన్ని సీన్స్ తనను రోజుల తరబడి వెంటాడాయని వెల్లడించారు. నటి సిరి హన్మంత్ కూడా సినిమాలో తన రోల్ పై ఆనందం వ్యక్తం చేశారు.

తన రోల్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికీ అలాంటి ఫ్రెండ్ ఉండాలని అనిపిస్తుందని చెప్పారు. బేబి, కలర్ ఫోటో వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత ఎస్‌కేఎన్, సాయి రాజేష్ కాంబినేషన్ లో వస్తున్న చెన్నై లవ్ స్టోరీపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ ఈవెంట్‌ లో మూవీ టీమ్ చూపించిన నమ్మకం, కిరణ్ అబ్బవరంపై వ్యక్తమైన ప్రశంసలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

Tags:    

Similar News