రామాయణం: అభినవ సీతాదేవి ముందున్న సవాళ్లు
భారతీయ చలనచిత్ర చరిత్రలో `రామాయణం` కథకు.. అందులోని సీతాదేవి పాత్రకు ఒక గొప్ప పవిత్రత ఉంది.;
భారతీయ చలనచిత్ర చరిత్రలో `రామాయణం` కథకు.. అందులోని సీతాదేవి పాత్రకు ఒక గొప్ప పవిత్రత ఉంది. ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న `రామాయణం` చిత్రంలో సీతాదేవిగా సాయి పల్లవి ఎంపిక కావడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. పురాణాల్లో సీతమ్మను `పంకజముఖి` అని, సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని వర్ణించారు. జనక మహారాజుకు భూమిలో లభించిన ఆ పవిత్ర మూర్తి పాత్రలో సాయి పల్లవి ఎలా ఒదిగిపోతుందనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ దర్శకుడు నితీష్ తివారీ - హీరో రణబీర్ కపూర్ మాత్రం సీతమ్మ పాత్రకు సాయి పల్లవి తప్ప మరొకరిని ఊహించుకోలేమని బలంగా నమ్ముతున్నారు. అయితే సాయిపల్లవిని ప్రతిభ ప్రాతిపదికగా ఎంపిక చేసారు కానీ.. అందం ప్రాతిపదికగా కాదని కొందరు నెటిజనులు విమర్శిస్తున్నారు.
గతంలో సీతాదేవి పాత్రను పోషించిన దిగ్గజ నటీమణులతో సాయి పల్లవిని ప్రజలు పోల్చి చూస్తున్నారు. ముఖ్యంగా నాటి మేటి కథానాయిక, అభినయనేత్రి అంజలీదేవి తర్వాత సీతమ్మ అంటే ఇలాగే ఉంటుందేమో అనేంతగా జయప్రద `సీతా కళ్యాణం` చిత్రంలో మెప్పించారు. ఒక తీర్చిదిద్దిన శిల్పంలా జయప్రద ఆ పాత్రలో అద్భుతంగా కనిపించడమే కాకుండా.. హిందీలో కూడా మూడుసార్లు సీతగా నటించి మెప్పించారు. అలాగే నయనతార సైతం `శ్రీరామరాజ్యం` చిత్రంలో ఎంతో ఒద్దికగా, చక్కని అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ దిగ్గజ తారల సరసన సాయి పల్లవి తనదైన ముద్ర వేయడం ఇప్పుడు తన ముందున్న ప్రధాన సవాల్‌గా మారింది.
సీనియర్ నటి వాణిశ్రీ విషయానికి వస్తే.. తన అద్భుత నటనా సామర్థ్యంతో సత్యభామ వంటి పౌరాణిక పాత్రల్లో మెప్పించారు. తన రంగు తక్కువైనా ఆకర్షణీయమైన ముఖకవళికలతో తనను తాను ఒక శిల్పంలా మలుచుకుని పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారు. సీతాదేవి వంటి పాత్రల్లో నటించేటప్పుడు కేవలం నటన మాత్రమే కాకుండా.. ఆ పాత్రకు తగ్గ ఆహార్యం, పవిత్రత, గాంభీర్యం ప్రతిబింబించాలి. సీనియర్ నటీమణులు నెలకొల్పిన ఆ ఉన్నత ప్రమాణాలను అందుకోవాలంటే సాయి పల్లవి తన అభినయంతో పాటు బాహ్య సౌందర్యం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది.
సాధారణంగా పౌరాణిక పాత్రల చిత్రీకరణలో నటీనటుల బాహ్య సౌందర్యం కీలక పాత్ర పోషిస్తుంది. రాకుమార్తెలు లేదా దేవతల పాత్రలకు ఉండే ప్రత్యేక ఆహార్యానికి ప్రేక్షకులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. కేవలం నటన బాగుంటే సరిపోదని ఆ పాత్ర రూపానికి కూడా న్యాయం చేయాలని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో `ఆదిపురుష్` చిత్రంలో సీతాదేవిగా నటించిన కృతి సనన్ పై వచ్చిన విమర్శలను ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆధునిక శైలితో కనిపించే నటీమణుల ఆహార్యం పౌరాణిక పాత్రల పవిత్రతను దెబ్బతీసే అవకాశం ఉన్నందున మేకర్స్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
సాయి పల్లవికి ఉన్న సహజమైన నటన.. తనకు ప్రేక్షకుల్లో ఉన్న గౌరవం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ కానున్నాయి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ... కేవలం నటనకు ప్రాధాన్యత ఇచ్చే సాయి పల్లవి తన అద్భుత ప్రదర్శనతో విమర్శలను పటాపంచలు చేస్తుందని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. బాహ్య సౌందర్యం కంటే ఘాఢమైన ముద్ర వేసే అభినయం ద్వారానే సీతమ్మలోని పవిత్రతను ఆవిష్కరించవచ్చని అభిమానులు వాదిస్తున్నారు. ఏది ఏమైనా భారతీయ వెండి తెరపై అభినవ సీతాదేవిగా సాయి పల్లవి చేసే ప్రయాణం ఎలాంటి చర్చకు తావిస్తుందో వేచి చూడాలి.