5 ఏళ్లలో 10 కోట్ల సంపాదన.. క్రేజీ నటి బిగ్ గ్యాంబ్లింగ్!
కన్నడ చిత్రపరిశ్రమ నుంచి వచ్చి ఇప్పుడు దక్షిణాది మొత్తం తన నటనతో మాయ చేస్తున్న నటి రుక్మిణి వసంత్.;
కన్నడ చిత్రపరిశ్రమ నుంచి వచ్చి ఇప్పుడు దక్షిణాది మొత్తం తన నటనతో మాయ చేస్తున్న నటి రుక్మిణి వసంత్. `సప్త సాగరదాచే ఎల్లో` చిత్రంతో యువత ఆరాధ్య దేవతగా మారిన ఈ బ్యూటీ ఇప్పుడు పాన్-ఇండియా రేంజ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కేవలం వెండితెరపైనే కాకుండా.. తన వ్యక్తిత్వంతోనూ అందరినీ ఆకర్షిస్తున్న రుక్మిణి వసంత్ కెరీర్ కి కాంతార ఆఫర్ ఒక కీలక మలుపు.
నటి రుక్మిణి వసంత్ నేపథ్యం చాలా గర్వించదగ్గది. తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ భారత సైన్యంలో పని చేస్తూ 2007లో ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందారు. ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం అత్యున్నత అశోక చక్ర అవార్డును అందించింది. అటువంటి సైనిక కుటుంబం నుంచి వచ్చిన రుక్మిణి తన తండ్రి నుంచి క్రమశిక్షణను, తల్లి (సుభాషిణి వసంత్) నుంచి కళల పట్ల మక్కువను పుణికిపుచ్చుకుంది. ఈ క్రమశిక్షణే ఆమెను ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే ఒక నిలకడైన నటిగా నిలబెట్టింది.
ప్రస్తుతం రుక్మిణి వసంత్ నెట్ వర్త్ సుమారు రూ.7 కోట్లు ఉంటుందని అంచనా. ఒకప్పుడు చిన్న సినిమాలతో మొదలైన ఈ నటి ప్రయాణం ఇప్పుడు భారీ ప్రాజెక్టుల వరకు చేరింది. `సప్త సాగరదాచే ఎల్లో` సాధించిన విజయం తర్వాత కాంతార చిత్రంతో మరో భారీ పాన్ ఇండియా విజయం తన స్థాయిని అమాంతం పెంచేసింది. ఇటీవల రుక్మిణి తన పారితోషికాన్ని భారీగా పెంచింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రూ.3 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం సినిమాలే కాకుండా..బెంగళూరులో ఉన్న వారి కుటుంబ ఆస్తులు.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా 2026 చివరి నాటికి రుక్మిణి సంపద 10 కోట్లకు చేరుతుందని అంచనా.
రుక్మిణి కెరీర్ గ్రాఫ్ చూస్తే 2026 ఆమెకు గోల్డెన్ ఇయర్ అని చెప్పవచ్చు. రిషబ్ శెట్టి ప్రతిష్టాత్మక చిత్రం `కాంతార: చాప్టర్ 1`లో కనకవతి అనే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న `టాక్సిక్`లో మెల్లిసా అనే కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఇవే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న `డ్రాగన్` సినిమాలోనూ ఈ బ్యూటీ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం.
కేవలం కన్నడకే పరిమితం కాకుండా రుక్మిణి తెలుగు, తమిళ పరిశ్రమల్లోనూ అడుగుపెట్టింది. తమిళంలో విజయ్ సేతుపతితో ఏస్ .. శివకార్తికేయన్‌తో`మదరాసి` వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు నటిగా తనకు పేరు తెచ్చాయి. భాషా భేదం లేకుండా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటోంది.
సోషల్ మీడియాలో నిరాడంబరమైన వ్యక్తిత్వంతో ఆకర్షిస్తున్న రుక్మిణి భవిష్యత్తులో బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టే యోచనలో ఉంది. మణిరత్నం వంటి దిగ్గజ దర్శకుల సినిమాల్లోనూ తన పేరు వినిపిస్తుండటం గమనార్హం. కేవలం అందంతోనే కాకుండా.. తన సహజ సిద్ధమైన నటనతో దక్షిణాది సినీ రంగంలో ఒక వెలుగు వెలుగుతున్న రుక్మిణి వసంత్ మునుముందు మరింతగా దూసుకువెళుతుందని అభిమానులు భావిస్తున్నారు.