క‌ట‌క‌టాల్లోకి హీరోయిన్ ను వేధించిన డీప్‌ఫేక్ క్రియేటర్లు!

పోలీసుల వివరాల ప్రకారం బాగలకోట జిల్లా‌కు చెందిన రవికుమార్, ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్న శివ‌మొగ్గ‌కు చెందిన చంద్రకాంత్, బెంగళూరుకు చెందిన రంజిత్ లను అరెస్ట్ చేశారు.

Update: 2026-06-20 09:17 GMT

కన్నడ సినీ పరిశ్రమలో హ్యాపెనింగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రుక్మిణీ వసంత్‌ను టార్గెట్ గా చేసుకుని AI టెక్నాల‌జీతో డీప్‌ఫేక్ ఫోటోలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఘటనలో కర్ణాటక సైబర్ క్రైమ్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. రుక్మిణి కంప్లైంట్ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు, ఫేక్ ఫోటోల‌ను తయారు చేసి ఆన్‌లైన్‌లో వైర‌ల్ చేసిన వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం బాగలకోట జిల్లా‌కు చెందిన రవికుమార్, ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్న శివ‌మొగ్గ‌కు చెందిన చంద్రకాంత్, బెంగళూరుకు చెందిన రంజిత్ లను అరెస్ట్ చేశారు. ఈ నకిలీ కంటెంట్ తయారీ మరియు వైర‌ల్ చేయ‌డానికి వాడిన మూడు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

ఇటీవల రుక్మిణీ వసంత్‌కు సంబంధించిన కొన్ని అసభ్యకర ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అవి ఆమెకు సంబంధించిన అసలు ఫొటోలు లేదా సినిమా షూటింగ్‌కు చెందిన విజువల్స్ అని ప్రచారం జరిగినప్పటికీ, అవన్నీ AI సహాయంతో రూపొందించిన ఫేక్ ఫోటోలేన‌ని తర్వాత తేలింది. ఈ కంటెంట్ తన ప‌ర్మిష‌న్ లేకుండా క్రియేట్ చేయ‌బ‌డింద‌ని, తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడంతో పాటు ఫ్యామిలీ మెంబ‌ర్స్ ను కూడా తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని రుక్మిణీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గత నెలలోనే ఈ అంశంపై రుక్మిణీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన పేరుతో ప్రచారంలో ఉన్న ఫోటోలు పూర్తిగా ఫేక్ అని, వాటికి తనతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా రూపొందించిన ఈ కంటెంట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఆమె ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు టెక్నిక‌ల్ ప్రూఫ్స్ తో విచారణ జరిపి నిందితులను గుర్తించారు. ఈ కేసు మరోసారి డీప్‌ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగంపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రముఖులు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా AI ఆధారిత ఫేక్ ఫోటోలు, వీడియోల బారిన పడుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిపుణులు ఇటువంటి కంటెంట్‌ను షేర్ చేసే ముందు నిజానిజాలు పరిశీలించాలని, అనుమానాస్పద పోస్టులను వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే, రుక్మిణీ వసంత్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. యశ్ నటిస్తున్న టాక్సిక్ సినిమాతో పాటు, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక డ్రాగన్ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఎన్ని ఘ‌ట‌న‌లు వ‌చ్చినా ఆమె మాత్రం వాటిని ఎదుర్కొంటూ కెరీర్లో వేగంగా ముందుకు సాగుతుండటం విశేషం.

Tags:    

Similar News