శోభన్ బాబు, కృష్ణ.. ఇద్దరూ కరెక్టే! మురళీమోహన్ విశ్లేషణ

శోభన్ బాబు అంత కఠినంగా ఉండటానికి వెనుక ఉన్న ప్రధాన కారణం ఆయన ఆర్థిక ప్రణాళికేనని మురళీ మోహన్ వివరించారు.

Update: 2026-08-05 04:09 GMT

తెలుగు చిత్రసీమలో నటులకు, నిర్మాతలకు ఉండే ఆర్థిక సంబంధాలు.. క్రమశిక్షణ.. సినిమా నిర్మాణంలో భాగస్వాముల పాత్రలపై అగ్ర నటుడు మురళీ మోహన్ తన అనుభవాలను ఒక ఛానెల్ ఇంట‌ర్వ్యూలో షేర్ చేసారు. ముఖ్యంగా శోభన్ బాబు, సూపర్‌స్టార్ కృష్ణల పనితీరును పోలుస్తూ... నాటి సినీ పరిశ్రమలోని ఆర్థికప‌ర‌మైన‌ సంస్కృతిని విశ్లేషించారు. శోభన్ బాబు త‌న రెమ్యునరేషన్ విషయంలో ఎంతో నిక్కచ్చిగా ఉండేవారని... సమయానికి డబ్బులు చెల్లించకపోతే షూటింగ్‌లకు హాజరయ్యేవారు కాదని ప్రచారంలో ఉన్న విషయాలను ఆయన ప్రస్తావించారు.

శోభన్ బాబు అంత కఠినంగా ఉండటానికి వెనుక ఉన్న ప్రధాన కారణం ఆయన ఆర్థిక ప్రణాళికేనని మురళీ మోహన్ వివరించారు. ఒక సినిమా ఒప్పుకున్నప్పుడు వచ్చే పారితోషికాన్ని ఎక్కడ, ఎలా పెట్టుబడి పెట్టాలి? ఏ నెలలో ఎంత ఆదాయం వస్తుంది? భూముల్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? అనే విషయాలపై ఆయన స్పష్టమైన నోట్‌బుక్ ప్లానింగ్ కలిగి ఉండేవారు. తాను కట్టాల్సిన ఇన్‌స్టాల్‌మెంట్లు సమయానికి చెల్లించాల్సి రావడం వల్లే... నిర్మాతల నుంచి క్రమం తప్పకుండా డబ్బులు తీసుకోవాల్సి వచ్చిందని... అంతే తప్ప ఆయనకి క్యారెక్టర్ పై శ్రద్ధ లేక కాదని స్పష్టం చేశారు.

మరోవైపు సూపర్‌స్టార్ కృష్ణ విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. కృష్ణ గారు నిర్మాతల విష‌యంలో ఎంతో ఉదార స్వభావంతో ఉండే వారని.. పారితోషికం విషయంలో ఎన్నడూ ఒత్తిడి తెచ్చేవారు కాదని తెలిపారు. పరిశ్రమలో నిర్మాతల కష్టాలను అర్థం చేసుకునే విషయంలో కృష్ణ గారి తర్వాతే ఎవరైనా అని కొనియాడారు. నాటి నటులందరికీ కృష్ణ గారే ఒక ఆదర్శంగా నిలిచారని... ఆయన మార్గమే అందరికీ స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డారు.

వ్యాపార నేపథ్యం నుండి వచ్చిన వ్యక్తిగా తాను నిర్మాత పడే కష్టాలను... ఫైనాన్స్ తెచ్చే ఒత్తిళ్లను పూర్తిస్థాయిలో అర్థం చేసుకున్నానని మురళీ మోహన్ తెలిపారు. సినిమా నిర్మాణంలో మొదట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది నిర్మాత మాత్రమేనని... ఆఖరున మిగిలిన చిల్లర ఏరుకునేది కూడా వాళ్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ లాభాలు వస్తేనే మరొక సినిమా తీసే అవకాశం నిర్మాతకు ఉంటుందని... అందుకే తాను ఎల్లప్పుడూ నిర్మాత సంక్షేమాన్ని కోరుకునే `నిర్మాతల హీరో`గా నిలిచానని స్పష్టం చేశారు.

తాను ఏ రోజూ ``డబ్బులు ఇస్తేనే షూటింగ్‌కి వస్తాను`` అని ఏ నిర్మాతతోనూ అనలేదని.. వారు ఎంత ఇస్తే అంత తీసుకుని సహకరించానని మురళీ మోహన్ వెల్లడించారు. తన సహాచ‌ర విద్యార్థి, మిత్రుడు అయిన కృష్ణ గారి ప్రభావం తనపై ఎంతగానో ఉందని గుర్తు చేసుకున్నారు. నటులు కేవలం తమ సంపాదన పైనే కాకుండా... పరిశ్రమను నిలబెట్టే నిర్మాతల శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకున్నప్పుడే చిత్రసీమ ఆరోగ్యకరంగా ఎదుగుతుందని ఈ విశ్లేషణ ద్వారా స్పష్టమవుతోంది.

అయితే పారితోషికం విష‌యంలో నిక్క‌చ్ఛిగా ఉండే శోభన్ బాబు గారి విష‌యంలో నెగెటివ్ ప్ర‌చారం సాగి ఉండొచ్చు కానీ.. ఆయ‌న పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌, ఆలోచ‌నా విధానం వందశాతం స‌రైన‌దేన‌ని ముర‌ళీమోహ‌న్ అంగీక‌రించేవార‌న్న విష‌యం కూడా గుర్తుంచుకోవాలి.

Tags:    

Similar News