బైరాన్‌పల్లి గడ్డపై 'ఛాంపియన్' అడుగు
ఈ వీడియోలో హైలైట్ ఏంటంటే అక్కడ ఉన్న ఒక పురాతనమైన బురుజు. ఆ రాతి కట్టడం ఇప్పటికీ ఆనాటి పోరాటానికి సాక్ష్యంగా నిలబడి ఉంది.;
టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఛాంపియన్'. స్వప్న సినిమాస్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా కేవలం ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు, ఒక బర్నింగ్ హిస్టరీ. 1948లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ ను టీమ్ చాలా వినూత్నంగా ప్లాన్ చేసింది. అందులో భాగంగా రోషన్ స్వయంగా ఆ ఘటన జరిగిన 'బైరాన్‌పల్లి' గ్రామాన్ని సందర్శించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా అంటే కేవలం సెట్స్ మాత్రమే కాదు, ఆ ఎమోషన్ పుట్టిన మట్టి కూడా అని రోషన్ నిరూపించారు.
వరంగల్ లో ప్రమోషన్స్ ముగించుకున్న వెంటనే, రోషన్ అర్ధరాత్రి సమయంలో నేరుగా బైరాన్‌పల్లికి వెళ్లారు. "ఈ ఊరి గురించే మన సినిమా.. ఈ ఊరు ఈ కథలో చాలా ముఖ్యమైన భాగం" అంటూ రోషన్ చెప్పడం ఆడియెన్స్ కి ఒక కొత్త క్యూరియాసిటీని కలిగించింది. 1948లో రజాకార్లకు వ్యతిరేకంగా ఈ గ్రామ ప్రజలు చేసిన పోరాటం, వారి త్యాగాలే ఈ సినిమాకు అసలైన స్ఫూర్తి అని వీడియోలో క్లియర్ గా చూపించారు.
అసలు ఆ ఊరి చరిత్ర వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. స్వాతంత్ర్యం కోసం, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా బైరాన్‌పల్లి ప్రజలు ఎదురొడ్డి పోరాడారు. ఈ పోరాటంలో దాదాపు 90 మందికి పైగా అమరులయ్యారని స్థానికులు రోషన్ కు వివరించారు. ముఖ్యంగా 'రాజిరెడ్డి' అనే పాత్ర ద్వారా ప్రజలందరూ ఎలా ఏకమయ్యారు, అర్ధరాత్రి జరిగిన దాడులను ఎలా తిప్పికొట్టారు అనే విషయాలు వింటుంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థమవుతోంది.
ఈ వీడియోలో హైలైట్ ఏంటంటే అక్కడ ఉన్న ఒక పురాతనమైన బురుజు. ఆ రాతి కట్టడం ఇప్పటికీ ఆనాటి పోరాటానికి సాక్ష్యంగా నిలబడి ఉంది. ఆ బురుజు గోడలకు ఉన్న చిన్న చిన్న రంధ్రాల ద్వారానే నాటు తుపాకులతో రజాకార్లపై కాల్పులు జరిపేవారట. లోపల ఒక సీక్రెట్ రూమ్, ఆయుధాలు దాచుకోవడానికి ఒక ప్లేస్, సడన్ ఎటాక్ జరిగితే ఎలా తట్టుకోవాలి అనే డిఫెన్స్ మెకానిజం చూస్తుంటే ఆనాటి వారి తెలివితేటలకు హాట్సాఫ్ చెప్పాల్సిందే అని గ్రామ ప్రజలు తెలిపారు.
రోషన్ ని చూసి అక్కడి గ్రామస్తులు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. తమ ఊరి గొప్పతనాన్ని, తమ పూర్వీకుల త్యాగాలను పదిమందికి తెలిసేలా సినిమా తీస్తున్నందుకు రోషన్ కు థాంక్స్ చెప్పారు. రియల్ లొకేషన్ లో నిలబడి, ఆ చరిత్రను వింటున్నప్పుడు రోషన్ కళ్ళలో కూడా ఒక రకమైన గర్వం కనిపించింది. 'ఛాంపియన్' టీమ్ చేసిన ఈ 'డే ఇన్ బైరాన్‌పల్లి' వీడియో ప్రమోషన్స్ లో ఒక కొత్త స్టాండర్డ్ ని సెట్ చేసింది. రోషన్ చెప్పినట్లు, ఈ సినిమా తర్వాత బైరాన్‌పల్లి పేరు మళ్ళీ బలంగా వినిపించడం ఖాయం. చరిత్రలో కనుమరుగైన ఒక గొప్ప పోరాటాన్ని డిసెంబర్ 25న వెండితెరపై చూడడానికి ఆడియెన్స్ ఇప్పుడు ఇంకాస్త ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాకు జనాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.