గొప్ప గొప్ప వారికే అవార్డులు రాలేదు.. నేనెంత?
మన పనిని మనం నిజాయితీగా చేసి, దాని కోసం 100% ఎఫర్ట్ పెట్టడం వరకే మన పని అని, ఆ తర్వాత ఫలితం దేవుడే చూసుకుంటాడని అంటున్నారు విలక్షణ నటుడు ఆర్. మాధవన్.;
మన పనిని మనం నిజాయితీగా చేసి, దాని కోసం 100% ఎఫర్ట్ పెట్టడం వరకే మన పని అని, ఆ తర్వాత ఫలితం దేవుడే చూసుకుంటాడని అంటున్నారు విలక్షణ నటుడు ఆర్. మాధవన్. హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా.. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోయి ఎప్పటికప్పుడు తన యాక్టింగ్ తో ఆడియన్స్ ను ఆశ్చర్యపరుస్తుంటారు మాధవన్. ఆయన లేటెస్ట్ ఫిల్మ్ ఆప్ జైసా కోయి రీసెంట్ గా రిలీజై మంచి సక్సెస్ ను అందుకున్న నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన మాధవన్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.
నటీనటుల్లో చాలా మంది అవార్డులు, గుర్తింపు కోసం తెగ పరితపిస్తుంటారు. కానీ మాధవన్ కు మాత్రం ఆ పిచ్చి లేదు. 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటుడిగా ఉన్న తనకు అవార్డులతో పని లేదని, తనకంటే గొప్ప యాక్టర్లు చాలా మంది ఉన్నారని, వారికే తగిన గుర్తింపు లభించలేదని, గొప్ప గొప్ప సినిమాలను తీసిన దిలీప్ కుమార్ లాంటి వారికే నేషనల్ అవార్డు రాలేదని, అందుకే తనకు అవార్డుల కంటే ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడమే ముఖ్యమన్నారు. ఇప్పటికీ తనకు మంచి పాత్రలొస్తున్నాయంటే దానికి కారణం ఆడియన్స్ ఇచ్చిన ఆదరణేనని తనకు అది చాలని మాధవన్ అన్నారు.
ఆ విషయం అసలు ఆలోచించను
తాను చేసే క్యారెక్టర్ ఆడియన్స్ కు నచ్చుతుందా లేదా అని ఆలోచించని, చేసే క్యారెక్టర్ ను నిజాయితీగా చేస్తానని, ఆ నిజాయితీనే తనకు ఆడియన్స్ ను దగ్గర చేస్తుందంటున్నారు మాధవన్. అందుకే తాను చేసే కథల్ని ఆడియన్స్ ఎలా తీసుకుంటారోనని ఎప్పుడూ భయపడనని అంటున్నారు. గతంలో ఒకే సంవత్సరంలో అమితాబ్ రెండు సినిమాల్లో లవర్ బాయ్ గా కనిపించి, ఆ తర్వాత వెంటనే జంజీర్ అనే సినిమాలో పోలీస్ గా అదరగొట్టారని, తాను కూడా అలాంటి యాక్టర్‌నే అవాలనుకుంటున్నట్టు మాధవన్ మనసులోని మాటను బయటపెట్టారు.
సూపర్ స్టార్ నుంచి నేర్చుకున్నా
ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ గురించి తనకు ఎలాంటి బాధ లేదని, అందుకే అవసరమైతే తప్ప జుట్టుకు రంగు వేసుకోనని, సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి తాను ఈ విషయాన్ని నేర్చుకున్నానని, ఆయన ఆఫ్ స్క్రీన్ లో ఎలా కనిపిస్తారో అందరికీ తెలుసని, కానీ ఎప్పుడైతే స్క్రీన్ పై కనిపిస్తారో అప్పుడు మ్యాజిక్ చేస్తారని, తన ఫ్రెండ్ అజిత్ కుమార్ కూడా అంతేనని, తన సీనియర్ల నుంచి తాను నేర్చుకున్న విషయం అదేనని, తాను చిన్నవాడినని ప్రతీసారీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఎంత వయసొచ్చినా తనలోని నటుడితో ఆడియన్స్ ను అలరించడమే తన లక్ష్యంగా చెప్తున్నారు మాధవన్.