నీట్ నిర‌స‌న ఓ డ్రామా అంటూ న‌టిపై నిప్పులు!

ప్రజా పోరాటంలో కనిపించిన ఒక వ్యక్తి ఇలాంటి వాణిజ్యపరమైన రియాలిటీ షోలోకి వెళ్లడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2026-09-03 12:30 GMT

ఇటీవల ఢిల్లీలో జరిగిన నీట్ పేపర్ లీకేజీ నిరసనల్లో పోలీసు వ్యాన్‌ను ఒంటిచేత్తో అడ్డుకుని రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మోడల్ రియా ఆహీర్ మరోసారి వార్తల్లో నిలిచారు. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలో రియా ధైర్యంగా నిలబడిన తీరు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. ఆ ఒక్క సంఘటనతో వేలమంది అభిమానాన్ని సంపాదించుకున్న రియా అనూహ్యంగా పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 20లోకి అడుగు పెడుతుండటం గమనార్హం. ఈ విష‌యం బ‌య‌ట‌కు రాగానే నెటిజన్లు, రియా అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

ప్రజా పోరాటంలో కనిపించిన ఒక వ్యక్తి ఇలాంటి వాణిజ్యపరమైన రియాలిటీ షోలోకి వెళ్లడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం పబ్లిసిటీ, ఫేమ్ కోసమే రియా ఆ రోజు నిరసనల్లో పాల్గొందని, అదంతా ఒక డ్రామా అని పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఫేమ‌స్ అవ్వ‌డం కోస‌మే అమ్మ‌డు అలా ఫోజులిచ్చింద‌ని మండిప‌డుతున్నారు. తాజాగా ఈ విమ‌ర్శ‌ల‌పై రియా ఆహీర్ స్పందించారు. `నేను కేవలం ప్రచారం కోసమే ఆ నిరసనలు చేశానని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇతరులు చెప్పే మాటలను ..కథనాలను గుడ్డిగా నమ్మవద్దని ప్రేక్షకులను కోరుతున్నాను.

నాలోని నిజమైన వినోదాత్మక కోణాన్ని, నా అసలు వ్యక్తిత్వాన్ని ప్రజలకు నేరుగా చూపించాలనుకుంటున్నాను` అని వివరణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు. చిన్నతనం నుంచి బిగ్ బాస్ షో పట్ల త‌న‌కున్న కుతూహలమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని రియా వెల్లడించారు. చిన్నప్పుడు తల్లి, సోదరితో కలిసి ఈ కార్యక్రమాన్ని చూసేదాన్నని అని.. అసలు అంత పెద్ద ప్రొడక్షన్ వెనుక ఏం జరుగుతుంది? అంతమంది పోటీదారులను నిర్వాహకులు ఎలా మేనేజ్ చేస్తారనే సందేహాలు తనకు ఉండేవని తెలిపారు.ఆ భారీ సెట్ లోపలి పనితీరును స్వయంగా తెలుసుకోవాలనే ఆసక్తితోనే షోలోకి వెళ్తున్నట్లు చెప్పారు.

27 ఏళ్ల రియా ఆహీర్ మోడల్ మాత్రమే కాదు. విజయవంతమైన పారిశ్రామికవేత్త కూడా. `రియాసత్` పేరుతో లగ్జరీ హ్యాండ్‌క్రాఫ్టెడ్ దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించారు. అలాగే భారతీయ చేతివృత్తుల కళాకారులను ప్రోత్స హిస్తున్నారు. సోషల్ మీడియాలో 3 లక్షలకు పైగా ఫాలోవర్లతో క్రేజ్ సంపాదించిన రియా `దిల్బారా` వంటి ప్రముఖ మ్యూజిక్ వీడియోలలో కూడా నటించి మెప్పించారు.

సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా బిగ్ బాస్ 20వ సీజన్ ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ రియా ఆహీర్ రాక షోపై అంచనాలను అంత‌కంత‌కు పెంచుతోంది. నిరసనల ద్వారా వచ్చిన ఇమేజ్ ఇప్పుడు రియాలిటీ షో ద్వారా లభించే గుర్తింపు మధ్య రియా కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో? చూడాలి.

Tags:    

Similar News