రిషబ్ శెట్టి.. అంత డిమాండ్ చేస్తున్నారా?

ఒక్కో సినిమాకు దాదాపు రూ.80 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో అది తెలుసుకున్న నెటిజన్లు, సినీ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు.;

Update: 2026-02-01 10:31 GMT

కన్నడ నటుడు రిషబ్ శెట్టి పేరు ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మార్మోగుతోంది. కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ఆయన, అంతర్జాతీయ వేదికలపైనా గుర్తింపు తెచ్చుకున్నారు. ఫోక్ కల్చర్, భక్తి భావాలు, గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో రిషబ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే కాంతార ఫ్రాంచైజీతో స్టార్‌ డమ్ అందుకున్న రిషబ్ శెట్టి, తాజాగా తెలుగులో రెండు భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

టాలీవుడ్‌ లో అగ్ర నిర్మాణ సంస్థలు ఆయనతో సినిమాలు చేసేందుకు ముందుకు రావడం విశేషం. అయితే ఆ సినిమాల కంటే ఎక్కువగా చర్చనీయాంశమవుతోంది ఆయన డిమాండ్ చేస్తున్న పారితోషికం. నిజానికి పెద్ద హీరోలతో సినిమా తీసేటప్పుడు ప్రాఫిట్ షేరింగ్ విధానం అనుసరించాలని నిర్మాతలు కోరుతుంటారు. ఇది కొంతకాలంగా జరుగుతున్న ప్రాసెస్. ఇప్పుడు రిషబ్ శెట్టి మాత్రం అందుకు ఓకే చెప్పడం లేదని వినికిడి.

ఫిక్స్‌ డ్ రెమ్యునరేషన్‌ కే ప్రాధాన్యం ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒక్కో సినిమాకు దాదాపు రూ.80 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో అది తెలుసుకున్న నెటిజన్లు, సినీ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ స్థాయిలోనే ఆ మొత్తం ఉండటంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ గా మారింది.

ప్రస్తుతం రిషబ్ శెట్టి నటించబోయే తొలి తెలుగు ప్రాజెక్ట్ జై హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శఖత్వం వహిస్తున్న ఆ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తోంది. పౌరాణిక నేపథ్యంతో భారీ విజువల్స్‌ తో రూపొందే ఆ చిత్రంపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ప్రశాంత్ వర్మ స్టైల్‌ కు రిషబ్ యాక్టింగ్ జతకావడంతో ఆ ప్రాజెక్ట్‌ పై మంచి హైప్ ఏర్పడింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది.

అదే సమయంలో మరో ప్రముఖ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై మరో తెలుగు సినిమాకు కూడా రిషబ్ సైన్ చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా ఆ చిత్రం తెరకెక్కనుందట! చారిత్రక నేపథ్యంతో సాగే ఆ కథలో రిషబ్ శెట్టి విభిన్న పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఆ రెండు సినిమాలు భారీ బడ్జెట్‌ తో నిర్మితమవుతుండటంతో నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడకుండా ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. స్క్రిప్ట్ వర్క్, లొకేషన్లు, టెక్నీషియన్లు ఎంపిక వంటి పనులు పూర్తి చేసే దశలో ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది పూర్తిగా ఆ రెండు సినిమాలపైనే దృష్టి పెట్టాలని రిషబ్ నిర్ణయించుకున్నారనని సమాచారం. ఏదేమైనా రిషబ్ శెట్టి భారీ పారితోషికం నిర్మాతలకు సవాల్‌ గా మారుతుందా? లేక ఆయన మార్కెట్‌ ను దృష్టిలో పెట్టుకుని అంగీకరిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News