కాంతార.. ఆస్కార్ లెవల్ కి వెళుతుందా?

లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న క్రేజీ బజ్ ప్రకారం, 'కాంతార చాప్టర్ 1' చిత్రాన్ని ఆస్కార్ బరిలో నిలపాలని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఆలోచిస్తోందట.;

Update: 2025-10-17 04:54 GMT

బాక్సాఫీస్ వద్ద మరో సాలీడ్ రికార్డ్ అందుకున్న 'కాంతార చాప్టర్ 1' కమ్మడ ఇండస్ట్రీ స్థాయిని మరో లెవెల్ కు పెంచింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై, ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఇంకా థియేటర్లలో తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించి, జీవించిన ఈ మైథికల్ థ్రిల్లర్, ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారుతోంది. ఈసారి టార్గెట్ ఆస్కార్ అని తెలుస్తోంది.

గత కొన్నేళ్లుగా భారతీయ సినిమాలు అంతర్జాతీయ వేదికలపై తమ సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా 'RRR' ఆస్కార్ గెలిచిన తర్వాత, మన దర్శక, నిర్మాతల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. తమ కథలు కూడా గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించగలవని బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో, ఇప్పుడు మరో కన్నడ అద్భుతం అదే బాటలో పయనించడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న క్రేజీ బజ్ ప్రకారం, 'కాంతార చాప్టర్ 1' చిత్రాన్ని ఆస్కార్ బరిలో నిలపాలని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఆలోచిస్తోందట. ఈ సినిమాలో అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయని వారు భావిస్తున్నట్లు సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో ఆసక్తి మొదలైంది.

ఈ నమ్మకం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. సినిమాలోని జానపద కథాంశం, దైవిక అనుభూతిని కలిగించే సన్నివేశాలు, ముఖ్యంగా క్లైమాక్స్‌లో రిషబ్ శెట్టి నటన ఈ సినిమాకు అతిపెద్ద బలం. ఆ నటనకు భాషతో సంబంధం లేదని, అది ఏ దేశపు ప్రేక్షకుడినైనా కట్టిపడేస్తుందని చిత్రయూనిట్ బలంగా నమ్ముతోంది. ఈ ఒక్క అంశమే సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లగలదని వారి ఆలోచన.

నిజానికి, ఈ ఆలోచన మేకర్స్‌ది మాత్రమే కాదు, అభిమానులది కూడా. 'కాంతార' విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ సినిమాకు, రిషబ్ నటనకు కచ్చితంగా అంతర్జాతీయ గుర్తింపు రావాలని, ఆస్కార్‌కు పంపడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇది కేవలం ఒక ఆలోచన దశలోనే ఉన్నప్పటికీ, హోంబలే ఫిల్మ్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ దిశగా అడుగులు వేస్తే, అది అసాధ్యమేమీ కాదు. మరి, ఈ కన్నడ అద్భుతం నిజంగానే ప్రపంచ వేదికపై పోటీ పడుతుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News