6 కోట్లతో తెరకెక్కి 1000కోట్లు.. హారర్ సినిమాపై ఆర్జీవీ ప్రశంస.. నెటిజనుల కౌంటర్లు!
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిరంతరం చిత్ర పరిశ్రమలోని తాజా పరిణామాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిరంతరం చిత్ర పరిశ్రమలోని తాజా పరిణామాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తున్న ఇండిపెండెంట్ హారర్ చిత్రం `అబ్సెషన్` పై ప్రశంసల వర్షం కురిపించారు. దర్శకుడు కర్రీ బార్కర్, నటి ఇండే నవరెట్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ లో-బడ్జెట్ చిత్రం సాధించిన అసాధారణ విజయాన్ని వర్మ విశ్లేషించారు. ఎలాంటి భారీ స్టార్ కాస్టింగ్, అంచనాలు లేకుండా కేవలం బలమైన కంటెంట్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోందని.. నేటి తరం మేకర్స్‌కు ఇది ఒక పాఠమని ఆర్జీవీ కొనియాడారు. అయితే ఎప్పుడూ ఇతరుల సినిమాలపై సమీక్షలు ఇచ్చే ఆర్జీవీ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో పంచ్‌లతో విరుచుకుపడుతున్నారు.
సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రామ్ గోపాల్ వర్మను టార్గెట్ చేస్తూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ``ఇతరుల సినిమాలను మెచ్చుకోవడం పక్కన పెట్టి మీరు ఎప్పుడు మళ్లీ శివ, సత్య, రక్తచరిత్ర లాంటి మంచి సినిమాలు తీస్తారో చెప్పండి సార్! అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఒకప్పుడు హారర్ చిత్రాలకు (దెయ్యం, రాత్ వంటి చిత్రాలతో) ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఆర్జీవీ ప్రస్తుతం కేవలం వివాదాస్పద చిత్రాలకే పరిమితం కావడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ చిన్న చిత్రాల సక్సెస్ ఫార్ములాను విశ్లేషించే బదులు టాలీవుడ్‌లో మళ్లీ తన పాత మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయాలని పలువురు నెటిజన్లు ఆయనకు ఉచిత సలహాలు పడేస్తున్నారు.
గ్లోబల్ హారర్ సెన్సేషన్ `అబ్సెషన్` భారతీయ బాక్సాఫీస్ వద్ద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ల్యాండ్ అయింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం... ఈ హాలీవుడ్ ఇండిపెండెంట్ చిత్రం భారతదేశంలో మొదటి రోజు సుమారు రూ. 80 లక్షల నుండి రూ. 1 కోటి వరకు వసూళ్లను సాధించింది. ఒక చిన్న సినిమా... ఎలాంటి భారీ ప్రమోషన్లు లేని విదేశీ చిత్రానికి మన దేశంలో ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం విశేషమనే చెప్పాలి. ముఖ్యంగా హారర్ జానర్ చిత్రాలకు భారతదేశంలో ఉండే మల్టీప్లెక్స్ ఆడియన్స్ మద్దతు ఈ చిత్రానికి తొలిరోజే ప్లస్ పాయింట్‌గా మారింది.
ఇక దేశంలోని మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలోని మల్టీప్లెక్సుల్లో `అబ్సెషన్` చిత్రానికి క్రేజ్ చాలా అద్భుతంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో -అంతర్జాతీయ వేదికలపై ఈ చిత్రానికి వచ్చిన పాజిటివ్ టాక్ -రేటింగ్స్ చూసి మల్టీప్లెక్స్ ప్రేక్షకులు థియేటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా యువత- హారర్ చిత్రాల ప్రేమికులు మల్టీప్లెక్సుల్లో సాయంత్రం, రాత్రి షోలకు భారీగా తరలివస్తుండటంతో వీకెండ్‌లో బుకింగ్స్ ఊపందుకున్నాయి. మల్టీప్లెక్స్ వర్గాల సమాచారం ప్రకారం.. మునుముందు ఈ చిత్రానికి మౌత్ టాక్ ద్వారా థియేటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి 1000కోట్లు పైగా వసూలు చేసిన గ్రేట్ హారర్ మూవీ అబ్సెషన్. కేవలం టెక్నిక్ తోనే ప్రపంచ బాక్సాఫీస్ ని జయించవచ్చని నిరూపించిన సినిమా ఇది. హాలీవుడ్ నుంచి వచ్చిన `అబ్సెషన్` చిత్రం భారీ బడ్జెట్ - స్టార్ కల్చర్‌పైనే ఆధారపడే పరిశ్రమలకు ఒక కనువిప్పుగా నిలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ వంటి సీనియర్ దర్శకుడు దీనిని ప్రశంసించడం ద్వారా సినిమాకు మరింత పబ్లిసిటీ లభించింది. నెటిజన్లు వర్మపై ఎన్ని పంచ్‌లు వేసినా కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలను గుర్తించి ప్రోత్సహించడంలో ఆర్జీవీ ఎప్పుడూ ముందే ఉంటారనేది వాస్తవం. మరి భవిష్యత్ లో ఈ హారర్ థ్రిల్లర్ భారతీయ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.