నేను ఆయన అభిమానిని.. ఇండస్ట్రీ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్!
హైదరాబాద్ కోకాపేటలో 'అల్లు సినిమాస్' మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.;
హైదరాబాద్ కోకాపేటలో 'అల్లు సినిమాస్' మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సూపర్ స్టార్ కృష్ణ గారికి వీరాభిమానినని చెప్తూ, తన చిన్ననాటి సినిమా జ్ఞాపకాలను పంచుకున్నారు. టాలీవుడ్ రేంజ్ కేవలం పక్క రాష్ట్రాలకే పరిమితం కాకూడదని, హాలీవుడ్‌తో పోటీ పడాలని ఆయన ఆకాంక్షించారు. సినీ పరిశ్రమ ఎదుగుదలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ విశేషాలు చూద్దాం ..
సూపర్ స్టార్ అభిమానిగా.. ఆనాటి జ్ఞాపకాల ప్రయాణం:
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో ఒక సామాన్య సినిమా ప్రేక్షకుడిలా మారిపోయారు. తాను చిన్నప్పటి నుండి సినిమా పిచ్చోడినని, ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ గారికి పెద్ద అభిమానినని వెల్లడించారు. వనపర్తిలో చదువుకునే రోజుల్లో సినిమా చూడాలంటే పడ్డ కష్టాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక అప్పట్లో సినిమాలు కేవలం హైదరాబాద్ లేదా కర్నూలులో మాత్రమే విడుదలయ్యేవి. మొదటి రోజే సినిమా చూడాలనే తపనతో,అప్పట్లో బస్సు కూడా తక్కువ నడిచేవి,ఇక దాదాపు 100 కిలోమీటర్ల దూరం లారీలో ప్రయాణించి కర్నూలు వెళ్లేవాడినని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
15 సినిమాలు ఎక్కడ? 5 ఏళ్లకు ఒకటి ఎక్కడ?:
సినిమా నిర్మాణంలో వస్తున్న మార్పులపై రేవంత్ రెడ్డి చిన్న పాటి విమర్శలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఏడాదికి 15 నుండి 16 సినిమాలు చేసేవారని, కానీ ఇప్పుడున్న హీరోలు ఒక్క సినిమా తీయడానికే 5 ఏళ్లు తీసుకుంటున్నారని ఆయన కామెంట్ చేశారు. సాంకేతికత పెరిగినప్పటికీ, ప్రదర్శన కోసం సరైన థియేటర్లు లేకపోతే ఆ కష్టం వృథా అవుతుందని అభిప్రాయపడ్డారు. అల్లు అరవింద్ గారు అధునాతన హంగులతో ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మించడం అభినందనీయమని, ఇలాంటి సౌకర్యాలు పెరిగినప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ సహకారం ఖాయం:
మన తెలుగు సినిమా స్థాయిని కేవలం పక్కనున్న కోలీవుడ్, బాలీవుడ్ తో పోల్చుకోవద్దని, మన పోటీ నేరుగా హాలీవుడ్‌తో ఉండాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హాలీవుడ్ సినిమాలు కేవలం ఇక్కడ చూడటమే కాదు, ఇక్కడే షూటింగ్స్ జరుపుకునేలా మన ఇండస్ట్రీ ఎదగాలన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, ఫార్మా రంగాలకు ఇచ్చే ప్రాధాన్యతనే సినీ రంగానికి కూడా తప్పక ఇస్తుందని స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల రాయితీలు, అనుమతులు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అది సామాన్యుల జీవితాలను ప్రభావితం చేసే ఒక శక్తివంతమైన సాధనం.