దర్శన్, పవిత్ర గౌడ్‌ల చుట్టూ బిగుస్తున్న చట్టం ఉచ్చు!
సోషల్ మీడియాలో పవిత్ర గౌడ్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపారన్న కక్షతో రేణుకాస్వామిని నిర్బంధించి తీవ్రంగా హింసించినట్లు ఆయన పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా సంలచనం అయిన అభిమాని రేణుకాస్వామి హత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఈ సంచలన కేసులో ఇప్పటికే కన్నడ నటుడు దర్శన్, పవిత్ర గౌడ్ తదితరులు అరెస్టయి కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా న్యాయస్థానంలో నడుస్తోన్న కేసు విచారణలో తాజాగా ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రదోష్ అప్రూవర్‌గా మారడం ఇండస్ట్రీలోనూ, రాష్ట్రవ్యాప్తంగానూ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కోర్టులో ప్రదోష్ వెల్లడించిన వివరాల ప్రకారం హత్య జరిగిన రాత్రి అక్కడ ఏం జరిగిందనే దానిపై భయానకమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
సోషల్ మీడియాలో పవిత్ర గౌడ్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపారన్న కక్షతో రేణుకాస్వామిని నిర్బంధించి తీవ్రంగా హింసించినట్లు ఆయన పేర్కొన్నారు. మొదటగా నటుడు దర్శన్ స్వయంగా రేణుకాస్వామిపై విచక్షణారహితంగా దాడి చేశారని, ఆ తర్వాత పవిత్ర గౌడ్ తన చేతిలోని చెప్పుతో అతడిని కొట్టిందని ప్రదోష్ వాంగ్మూలం ఇచ్చినట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడి అంతటితో ఆగకుండా మరింత అరాచకమైన రీతిలో సాగినట్లు ప్రదోష్ బయటపెట్టారు. బాధితుడిపై దాడి చేసిన అనంతరం అతడి శరీరంపై ఉన్న దుస్తులను తొలగించి కేవలం లోదుస్తులు మాత్రమే ఉంచినట్లు తెలిపారు.
ఆ తర్వాత అత్యంత కిరాతకంగా నైలాన్ తాడుతో కాళ్లు, చేతులు కట్టేసి, టాటా ఏస్ వాహనానికి వేలాడదీసి మళ్లీ దారుణంగా కొట్టారని వెల్లడించారు. ఈ పాశవిక దాడి ..తీవ్రమైన గాయాల కారణంగానే రేణుకాస్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అంగీకరించారు. ఈ తాజా పరిణామంతో హత్య కేసుకు సంబంధించిన విచారణ వేగం పుంజుకుంది. ఇప్పటి వరకు పోలీసుల అదుపులో ఉన్న నిందితులపై ఉన్న ఆరోపణలకు సంబంధించి సహ నిందితుడే స్వయంగా సాక్ష్యం చెప్పడంతో చట్టపరమైన ఉచ్చు దర్శన్, పవిత్ర గౌడ్‌ల చుట్టూ మరింత బిగుసుకుంటోంది.
హత్య జరిగిన తీరు, అందులో ప్రతి నిందితుడి పాత్ర ఎంతమేర ఉందనే విషయాలపై ప్రదోష్ పూసగుచ్చినట్లు వెల్లడించడం దర్యాప్తు అధికారులకు పెద్ద సాక్ష్యంగా మారింది. ఈ సంచలన నిజాలు వెలుగులోకి రావడంతో కన్నడ చిత్రసీమతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఒక స్టార్ హీరోగా సమాజంలో ఎంతో గుర్తింపు ఉన్న వ్యక్తి ఇలాంటి హేయమైన నేరానికి పాల్పడటం ఇండస్ట్రీకి తీరని మచ్చగా మారిందని మండి పడుతున్నారు. రేణుకాస్వామి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ప్రజల నుంచి, వివిధ ప్రజా సంఘాల నుంచి వస్తున్న ఒత్తిడి కేసు విచారణను మరింత కీలకమైన దశకు చేర్చింది.
రాబోయే రోజుల్లో ఈ కేసు విచారణ మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉంది. అప్రూవర్‌గా మారిన ప్రదోష్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా న్యాయస్థానం ఎలాంటి సంచలన తీర్పుని ఇస్తుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. చట్టం ముందు అందరూ సమానులేనని నిరూపించేలా ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేలి, బాధితుడి కుటుంబానికి త్వరలోనే సముచితమైన న్యాయం జరుగుతుందని రేణుకాస్వామి కుటంబ సభ్యులు ఆశిస్తున్నారు.