పేరెంట్స్, భర్త.. రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్..
సాధారణంగా కూల్ గా, నవ్వుతూ మాట్లాడే రేణు ఈసారి మాత్రం తీవ్ర ఆవేశంతో స్పందించారు. వీధి కుక్కలను చంపడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో, కొందరు నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శించారు.;
సీనియర్ నటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ వర్కర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒత్తిడిని అధిగమించేందుకు సామాజిక సేవను తన జీవితంలో భాగంగా మార్చుకున్నారు. ఓ ఎన్జీవో స్థాపించి మూగజీవాల సంరక్షణకు తన వంతు కృషి చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. వివిధ సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు.
ఎక్కడైనా జంతువులు ఇబ్బందుల్లో ఉన్నాయంటే, వెంటనే స్పందించి సహాయం అందించేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు, వాటి నియంత్రణ, నిర్మూలన అంశం తీవ్ర చర్చకు దారి తీయగా.. ఆ వ్యవహారం ఏకంగా సుప్రీంకోర్టు వరకు చేరింది. వీధి కుక్కల నియంత్రణపై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు, పెట్టిన పోస్టులు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.
సాధారణంగా కూల్ గా, నవ్వుతూ మాట్లాడే రేణు ఈసారి మాత్రం తీవ్ర ఆవేశంతో స్పందించారు. వీధి కుక్కలను చంపడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో, కొందరు నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శించారు. దీనిపై స్పందిస్తూ రేణు దేశాయ్ తాజాగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాశీలో గంగా నదిలో బోటింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేసిన రేణు, తన మనోవేదనను ఆ పోస్టులో వెల్లడించారు.
"నన్ను కాపాడటానికి అమ్మానాన్న, అన్నయ్య, భర్త ఎవరూ లేరు. తాజా అంశంలో నా తప్పు లేకున్నా కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు. మీరు చేసే వ్యాఖ్యలపై తిరిగి స్పందించను. నేను నమ్మే భగవంతుడు దగ్గర మాత్రమే నా బాధను చెబుతాను. ఆయన నా ప్రార్థన వింటాడన్న నమ్మకం నాకు ఉంది. నేను తరచూ కాశీకి ఎందుకు వెళ్తానో మీకు అర్థమై ఉంటుంది" అని ఆమె రాసుకొచ్చారు.
అంతేకాదు, వీధి కుక్కల విషయంలో తన పోరాటం కొనసాగుతుందన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. "నేనెప్పుడూ నా వ్యక్తిగత హక్కుల కోసం పోరాడలేదు. కానీ వీధి కుక్కల విషయంలో పోరాటం ఆపను. కొన్ని కుక్కలు చేసిన తప్పు వల్ల వందల సంఖ్యలో వాటిని చంపాలనే నిర్ణయం సరైనది కాదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకునే వరకూ పోరాడుతూనే ఉంటాను" అని రేణు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై ఆమె ప్రెస్ మీట్ అనంతరం రాజకీయ పార్టీలో చేరనున్నారన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఆ ప్రచారాన్ని రేణు ఖండించారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, ఇది పూర్తిగా మూగజీవాల సంరక్షణ కోసం చేస్తున్న పోరాటమేనని స్పష్టతనిచ్చారు. సామాజిక సేవే తన లక్ష్యమని, ఎన్ని విమర్శలు వచ్చినా జంతువుల కోసం పోరాటం కొనసాగిస్తానని రేణు దేశాయ్ మరోసారి తేల్చిచెప్పారు.