అతని వల్లే పేరు మార్చుకున్నా!
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా అందులో రవి బస్రూర్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.;
పొందిన సాయాన్ని మర్చిపోయే వారు మనుషులే కాదని పెద్దలు అంటుంటారు. కొంతమంది తమ జీవితంలో ఏం లేనప్పుడు ఎవరి సాయం పొందైతే దాన్నుంచి బయటపడతారో వారిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ కూడా తాను సాయం పొందిన వ్యక్తిని అలానే గుర్తు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.
మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్న రవి బస్రూర్ ఓ వైపు సంగీత దర్శకుడిగా పని చేస్తూనే మరో వైపు డైరెక్టర్ గా కూడా మారి సక్సెస్ ను అందుకున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన వీర చంద్రహాస సినిమా ఇప్పటికే కన్నడలో రిలీజై మంచి సక్సెస్ ను అందుకుంది. ఇప్పుడదే సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 19న వీర చంద్రహాస తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఏ పని చేసినా మధ్యలోనే ఆగిపోయేది
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా అందులో రవి బస్రూర్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాను 8వ క్లాస్ ఫెయిలయ్యానని, ఏ పని స్టార్ట్ చేసినా అది మధ్యలోనే ఆగిపోయేదని, అలాంటి తనలోని మ్యూజిక్ డైరెక్టర్ ను గుర్తించి, తానేదో చేస్తాననే నమ్మకంతో ఉగ్రం సినిమా ఛాన్స్ ఇచ్చి ప్రశాంత్ నీల్, డిజాస్టర్ గా ఉన్న తన లైఫ్ ను సక్సెస్‌ఫుల్ గా మార్చారని చెప్పారు.
ప్రశాంత్ నీల్ దైవంతో సమానం
తాను కష్టాల్లో ఉన్నప్పుడు రవి అనే వ్యక్తి తనకు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసి ఆదుకున్నారని, ఆయన లేనిదే తానిప్పుడు ఈ పొజిషన్ లో ఉండేవాడిని కాదని, ఆయన పట్ల కృతజ్ఞతతోనే తన పేరు ముందు రవిని చేర్చుకున్నానని చెప్పిన రవి బస్రూర్, తన లైఫ్ లో మార్పుని, సక్సెస్‌ను తీసుకొచ్చింది మాత్రం ప్రశాంత్ నీలే అని, ఆయన తనకు దైవంతో సమానమని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చిన డబ్బుతో సంవత్సరానికి ఓ సినిమా తీసి, కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నానని, మనమెంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మాత్రం మర్చిపోకూడదని రవి బస్రూర్ చెప్పారు.