సోషల్ మీడియా శాపంపై మనసు విప్పిన శ్రీవల్లి!
సాధారణంగా స్టార్ సెలబ్రిటీల జీవితాలు పైకి ఎంతో విలాసవంతంగా, ఆనందంగా కనిపిస్తాయి. కానీ వారిపై నిరంతరం సాగే ట్రోలింగ్, వ్యక్తిగత విమర్శలు మానసికంగా ఎంతో కుంగదీస్తాయి.
పరిశ్రమలో అగ్రనటిగా.. నేషనల్ క్రష్ గా వెలిగిపోతున్న కన్నడ భామ రష్మిక మందన్న ప్రయాణం నవతరం భామలకు ఆదర్శం. మోడలింగ్ రంగం నుండి వెండితెరకు పరిచయమై అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం అందుకునే స్థాయికి చేరుకుంది. ఇటీవల వ్యక్తిగత జీవితంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రష్మిక, పెళ్లి హడావుడి ముగియడంతో మళ్లీ తదుపరి ప్రాజెక్టులపై పూర్తి దృష్టి సారించింది. కెరీర్ పరంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ గ్లామర్ ప్రపంచం వెనుక ఉండే చీకటి కోణాన్ని సోషల్ మీడియా ఒత్తిడిని ఆమె కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది.
సాధారణంగా స్టార్ సెలబ్రిటీల జీవితాలు పైకి ఎంతో విలాసవంతంగా, ఆనందంగా కనిపిస్తాయి. కానీ వారిపై నిరంతరం సాగే ట్రోలింగ్, వ్యక్తిగత విమర్శలు మానసికంగా ఎంతో కుంగదీస్తాయి. గతంలో వీటిని పెద్దగా పట్టించుకోని రష్మిక, ఒకానొక సందర్భంలో తనపై జరుగుతున్న నిరంతర సోషల్ మీడియా ద్వేషంపై తీవ్రంగా మండిపడ్డారు. చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరూ అందరికీ నచ్చాలని లేదు కానీ నచ్చకపోతే ఆ విషయాన్ని గౌరవప్రదంగా చెప్పాలే తప్ప ఇలా దారుణంగా ట్రోల్ చేయడం సరికాదని ఘాటుగానే స్పందించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూ రష్మిక తనపై వచ్చే నెగటివిటీ గురించి మనసు విప్పి మాట్లాడారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఉండే నటీనటులకు.. సాంకేతిక నిపుణులకు సోషల్ మీడియా అనేది ఒక వ్యసనంగా.. అదే సమయంలో ఒక శాపంగా ఎలా మారుతుందో చర్చించారు. వందలాది పాజిటివ్ కామెంట్స్ ఉన్నప్పటికీ ఎక్కడో ఒక మూల ఉండే ఒక్క నెగిటివ్ కామెంట్ మనశ్శాంతిని పూర్తిగా దెబ్బతీస్తుందని ఆ ఒక్క ట్వీట్ రోజంతా పడ్డ కష్టాన్ని, ఆనందాన్ని క్షణాల్లో దూరం చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే రష్మిక ఒక సక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటానని, అయితే సినిమాలు విడుదలైన సమయంలో ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటానని చెప్పారు. సినిమా రిలీజ్ రోజున పగలంతా వాతావరణం ఎంతో బాగుంటుందని, ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన వస్తుందని పేర్కొన్నారు. కానీ రాత్రి 9 గంటలు దాటిన తర్వాత సోషల్ మీడియా వేదికలపై నెగటివిటీ, ట్రోలింగ్ ఒక్కసారిగా పెరిగిపోతుందని, రోజంతా ఎంతో సంతోషంగా ఉన్న నెటిజన్లు రాత్రి కాగానే ఎందుకు అంతలా మారిపోతారో అర్థం కాదంటూ ఆమె ఆశ్చర్యం ..ఆవేదన వ్యక్తం చేశారు.
డిజిటల్ ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేయాలో ? తెలియక ఎంతోమంది సెలబ్రిటీలు ఇబ్బంది పడుతుంటారు. అందుకే పరిశ్రమలోని సీనియర్లు ..అనుభవజ్ఞులు యాక్టర్లకు ముఖ్యమైన నియమాన్ని సూచిస్తున్నారు. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కామెంట్ సెక్షన్‌ను కానీ.. సోషల్ మీడియా ఖాతాలను కానీ ఓపెన్ చేయకూడదనేది ఇండస్ట్రీలో గోల్డెన్ రూల్‌గా మారిపోతోంది. కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్లే కొద్దీ ఏదో ఒక నెగిటివ్ కామెంట్ తారసపడి అది మన మూడ్‌ను నిద్రను పాడు చేస్తుందని అందుకే ఆ సమయాల్లో డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉండటమే ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు.
నెగటివిటీని వ్యాప్తి చేసే బ్యాడ్ కామెంట్స్ .. వీడియోలను చూసినప్పుడు వాటిని మరింత మందికి షేర్ చేసి వైరల్ చేయకుండా వదిలేయడమే ఇలాంటి ట్రోల్స్‌కు అడ్డుకట్ట వేసే మార్గమని తెలుస్తోంది. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సోషల్ మీడియా వేధింపులు సెలబ్రిటీల మానసిక ఆరోగ్యం పై సరికొత్త చర్చకు దారితీశాయి. కెరీర్‌లో ఎన్ని కోట్లు సంపాదించినా? ఎన్ని విజయాలు అందుకున్నా? మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం ఎంత కష్టంగా మారిందో రష్మిక మాటలు స్పష్టం చేస్తున్నాయి.