సమంత చూపిన బాటలో రష్మిక కెరీర్ పయనం
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రష్మిక మందన్న కెరీర్ ప్రయాణం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రష్మిక మందన్న కెరీర్ ప్రయాణం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటివరకు కేవలం కమర్షియల్ సినిమాల్లో గ్లామరస్ పాత్రలతోనే కాకుండా, నాయికా ప్రాధాన్యత ఉన్న పాత్రలపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆలోచిస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్న ఈ బ్యూటీ తన కెరీర్‌ను మరింత అర్థవంతంగా మలచుకోవడానికి సీనియర్ హీరోయిన్ల బాటను ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే పరిశ్రమలో నయనతార, సమంత, తాప్సీ వంటి నాయికలు గ్లామర్ పాత్రల నుంచి పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ కథల వైపు అడుగులు వేసి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సమంత ఎంతో తెలివిగా స్టార్ హీరోల సరసన గ్లామరస్ రోల్స్ చేస్తూనే.. మరోవైపు `మా ఇంటి బంగారం` లాంటి వైవిధ్యమైన నాయికా ప్రధాన పాత్రలతో నటిగా తన పరిధిని విస్తరించుకున్నారు. ఇక తాప్సీ విషయానికి వస్తే తనతో కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే చేయించిన దర్శకుల తీరుపై బహిరంగంగానే స్పందించి.. ఆ తర్వాత పూర్తిగా కంటెంట్ ఓరియెంటెడ్ -నాయికా ప్రధాన చిత్రాలకే పరిమితమయ్యారు.
రష్మిక మందన్న కూడా ఇదే కోవలో తన ప్రయాణాన్ని కొనసాగించాలని చూస్తున్నట్లు సమాచారం. కేవలం రెగ్యులర్ కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా.. తన అభినయానికి పూర్తి స్థాయి అవకాశం ఉన్న బలమైన పాత్రలను ఎంచుకోవడంపై ఫోకస్ పెడుతున్నారు. ఒకవైపు స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూనే... మరోవైపు తనలోని నటిని పూర్తిగా ఆవిష్కరించే ప్రయోగాత్మక చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని రష్మిక యోచిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే నయనతార అనుసరించిన స్ట్రాటజీని రష్మిక ఫాలో కావాలంటే మరింత ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. నయనతార పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం జోరు తగ్గించకుండా.. ఒకవైపు స్టార్ హీరోల సినిమాలలో గ్లామర్ ఎలివేషన్ ఉన్న పాత్రలతో మెప్పిస్తూనే.. మరోవైపు పూర్తిగా తన భుజాలపైనే మోయగల లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. రష్మిక కూడా గ్లామర్‌కు, నటనకు సమాన ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి సమతుల్యతను సాధించాల్సి ఉంటుంది.
మొత్తంగా చూస్తే.. రష్మిక మందన్న తన కెరీర్‌లో ఒక పరిణతి చెందిన దశకు చేరుకున్నారు. కేవలం అందం, అభినయంతోనే కాకుండా నటిగా తనకంటూ ఒక బలమైన ముద్ర వేయడానికి తను కూడా సమంత, నయనతారల బాటలో పయనించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మైసమ్మ చిత్రంతో రష్మిక అభిమానుల ముందుకు రానుంది. ఇది లేడీ ఓరియెంటెడ్ కథతో ఆకట్టుకుంటోంది. రానున్న రోజుల్లో రష్మిక నుంచి మరిన్ని వైవిధ్యమైన... నాయికా ప్రధాన చిత్రాలు వస్తాయని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.