చిత్ర పరిశ్రమలో ప్రాజెక్ట్‌ల రద్దు!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలు.. స్టార్ హీరోల ప్రాజెక్టుల చుట్టూ ఎప్పుడూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటుంది.

Update: 2026-06-04 06:32 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలు.. స్టార్ హీరోల ప్రాజెక్టుల చుట్టూ ఎప్పుడూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటుంది. ఇటీవల ఫర్హాన్ అఖ్తర్ - రణ్‌వీర్ సింగ్ క‌లిసి ప‌నిచేయాల్సిన `డాన్ 3` సినిమాకు సంబంధించిన వివాదాలు.. మార్పులు బాలీవుడ్‌లో ఎంత హాట్ టాపిక్‌గా మారాయో తెలిసిందే. ఇలాంటి పెద్ద చిత్రాల హడావుడి మధ్య పరిశ్రమలో నిశ్శబ్దంగా జరుగుతున్న మరో తీవ్రమైన సమస్యను నటుడు రణ్‌వీర్ షోరే తెరపైకి తెచ్చారు. అర్ధాంతరంగా నిలిచ‌పోతున్న‌ సినిమాల వల్ల నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎదుర్కొనే ఇబ్బందులపై షోలే గళమెత్తారు.

సినిమా పరిశ్రమలో ఒక ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఎంత కష్టమో? అది పూర్తయి థియేటర్లలోకి రావడం అంతకంటే సంక్లిష్టమైన ప్రక్రియ. అనేక సందర్భాల్లో నిర్మాతలు రకరకాల ఇబ్బందుల వల్ల సినిమాలను మధ్యలోనే నిలిపి వేస్తుంటారు లేదా పూర్తిగా రద్దు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రణ్‌వీర్ షోరే మాట్లాడుతూ..`ఇలా ప్రాజెక్ట్‌లను రద్దు చేసేటప్పుడు నిర్మాతలు చూపే వైఖరిని.. వారి జవాబుదారీతనాన్ని ప్రశ్నించారు.పెద్ద స్టార్ల ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తూ మధ్యస్థ- చిన్న బడ్జెట్ చిత్రాలను విస్మరించడం ఎంత వరకు? న్యాయమని నిలదీశారు.

ఒక నటుడిగా లేదా సాంకేతిక నిపుణుడిగా ఒక సినిమా కోసం నెలల తరబడి సమయాన్ని శ్రమను కేటాయిం చిన ప్పుడు ఆ ప్రాజెక్ట్ అకస్మాత్తుగా రద్దయితే వారి కెరీర్‌పై అది తీవ్ర ప్ర‌భావం చూపుతుందని రణ్‌వీర్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద స్టార్ హీరోల చిత్రాలు ఆలస్యమైనా? నిలిచిపోయినా? వారికి ఆర్థికంగా పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. కానీ ప్రతిభావంతులైన క్యారెక్టర్ ఆర్టిస్టులు, చిన్న చిత్రాలపై ఆధారపడేవారి పరిస్థితి దారుణంగా మారుతుంది. తాము కష్టపడి చేసిన పనికి సరైన గుర్తింపు, ఫలితం దక్కకపోవడం వారి ఉపాధిని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.

నిర్మాణ రంగంలో కార్పొరేట్ సంస్థల ప్రవేశం పెరిగిన తర్వాత ఇలాంటి ధోరణి మరింత ఎక్కువైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లాభనష్టాల లెక్కలు, మార్కెట్ సమీకరణాల పేరుతో కొన్ని ప్రాజెక్టులను షూటింగ్ సగం పూర్తయ్యాక కూడా పక్కన పెట్టేయడం పరిశ్రమలో సాధారణమైపోయింది. నైతికంగా ఇది సరైన పద్ధతి కాదని, ఒక సినిమాను ప్రారంభించేటప్పుడు ఉన్న నిబద్ధత, దానిని ముగించే వరకు కూడా నిర్మాతలు ప్రదర్శించాలని రణ్‌వీర్ షోరే డిమాండ్ చేశారు. సాధారణంగా బాలీవుడ్ లాంటి పెద్ద పరిశ్రమలలో నెపోటిజం, పక్షపాతం వంటి అంశాలపై ఎక్కువగా చర్చ జరుగుతుంటుంది.

కానీ అంతర్గతంగా నటీనటుల వృత్తిపరమైన భద్రత, ఒప్పందాల అమలు వంటి క్షేత్రస్థాయి సమస్యలను చాలామంది విస్మరిస్తారు. `డాన్ 3` వంటి భారీ చిత్రాల చుట్టూ తిరిగే దృష్టి ఇలాంటి మౌలిక సమ స్యలపై పడకపోవడం దురదృష్టకరమని పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. రణ్‌వీర్ షోరే చేసిన వ్యాఖ్యలు ఈ సంక్షోభాన్ని అందరి ముందుకు తీసుకొచ్చాయి. సినిమా అనేది వ్యాపారం మాత్రమే కాదు. వందలాది మంది సృజనాత్మక శ్రమతో కూడిన కళారూపం. పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే స్టార్ పవర్ మాత్రమే సరిపోదు. ప్రతి చిన్న ప్రాజెక్టుకు, నటుడికి రక్షణ , గౌరవం దక్కాలి. అప్పుడే సినిమా రంగంలో మరింత మంది ప్రతిభావంతులకు సురక్షితమైన వాతావరణం ఏర్పడుతుంది. నిర్మాతలు కేవలం లాభాల వైపే కాకుండా.. తమ నమ్మకమైన నటీనటుల భవిష్యత్తును కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

Tags:    

Similar News