జాంబీ కథలో రణ్‌వీర్.. ముందుంది ముసళ్ల పండగ!
దాదాపు అరడజను పైగా ఫ్లాపులు ఎదుర్కొన్న తర్వాత రణ్ వీర్ సింగ్ తన కెరీర్ బెస్ట్ హిట్ చిత్రంలో నటించాడు.;
దాదాపు అరడజను పైగా ఫ్లాపులు ఎదుర్కొన్న తర్వాత రణ్ వీర్ సింగ్ తన కెరీర్ బెస్ట్ హిట్ చిత్రంలో నటించాడు. `దురంధర్` అతడి ఫేట్‌ని మార్చేసింది. ఈ సినిమా పాన్ ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ కొట్టి చిత్రబృందంలో గొప్ప ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా రణ్ వీర్ కి కెరీర్ పరంగా బిగ్ బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. అందుకే ఇప్పుడు రణ్ వీర్ సింగ్ కొత్త జానర్లతో ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
అతడు ఈసారి రొటీన్ సినిమాలో నటించడు. సాహసోపేతమైన ఒక విభిన్నమైన జానర్ ని ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమా కథాంశం చాలా ఎగ్జయిట్ చేస్తుందని చెబుతున్నారు. కథాంశం ప్రకారం.. ఇది పోస్ట్-అపోకలిప్టిక్ జోంబీ థ్రిల్లర్. ప్రస్తుతం `డాన్ 3` చిత్రీకరణలో బిజీగా ఉన్న రణ్ వీర్ తదుపరి జోంబీ మూవీ కోసం కాల్షీట్లు కేటాయిస్తారు. 2026 ఆగస్టుకు ముందు ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది.
నిజానికి భారతదేశంలో జోంబి కథలకు ఆదరణ దక్కుతుందా? అంటే.. ఇది కచ్ఛితంగా పెద్ద దుస్సాహసమనే అంగీకరించాలి. ఇప్పటి వరకూ జాంబి కథలతో రూపొందించిన ఏ భారతీయ సినిమా ఆశించిన విజయాలను అందుకోలేదు. విమర్శకులు కంటెంట్ బావుంది అని చెప్పినా కానీ, ఇలాంటి సినిమాలకు జనం థియేటర్లకు క్యూ కట్టలేదు. అయితే ఏ నటుడు అయినా ప్రయోగాలు చేసినప్పుడే అతడిలోని అసలైన ఎనర్జీ, ప్రతిభ బయటపడుతుంది. ప్రస్తుతం రణ్ వీర్ రొటీన్ కి భిన్నంగా ఆలోచిస్తున్నాడు. తీవ్రవాదం, దేశభక్తి, రాజకీయాల నేపథ్యంలో రూపొందించిన దురంధర్ విజయం అతడికి బిగ్ బూస్ట్ ఇచ్చింది. ఇకపై మరిన్నిప్రయోగాలకు శ్రీకారం చుట్టేందుకు ఇది ఆరంభం మాత్రమే. దురంధర్‌లో డార్క్ షేడ్ ఉన్న స్పై పాత్రలో నటించిన రణ్ వీర్ తదుపరి సినిమాలో అందుకు పూర్తి భిన్నంగా కనిపించనున్నాడు.
ఎంపిక చేసుకున్న జాంబీ కథాంశం ప్రకారం..ముంబై నేపథ్యంలో పోస్ట్ అపోకలిప్టిక్ ఎరాను క్రియేట్ చేయబోతున్నారని, దీనికోసం భారీ సెట్లు నిర్మిస్తున్నారని కూడా కథనాలొస్తున్నాయి. కృత్రిమ మేథస్సు (ఏఐ)ను ఉపయోగించి కూడా విజువల్స్ ని సృష్టిస్తారు. నిర్జనంగా ఎప్పుడో దశాబ్ధాల క్రిత ఖాళీ చేసి వెళ్లిపోయిన పాత కాలపు ముంబైని సెట్లలో నిర్మించాల్సి ఉంది. ఈ నగరంలో జోంబీలతో ఒంటరి పోరాటం సాగించేవాడిగా రణ్ వీర్ సింగ్ కనిపిస్తాడు. జాంబీలు గుంపులుగా వెంటాడుతుంటే వాటిని తప్పించుకుని తిరిగే శక్తివంతమైన యువకుడిగా అతడు కనిపిస్తాడు. అయితే ఇలాంటి సినిమాల్లో కథానాయకుడిగా నటించేందుకు స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అలాగే భిన్నమైన భావోద్వేగాలను పలికించవచ్చు. అయితే నిర్జన ప్రదేశంలో జాంబీలతో పోరాడే యువకుడి కథతో దశాబ్ధాల క్రితమే `ఐ యామ్ లెజెండ్` విడుదలైంది. విల్ స్మిత్ నటించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ సినిమా ఇప్పటికీ ఒక అద్భుతం. కానీ ఇప్పుడు రణ్ వీర్ అంతకుమించి చేసి చూపించాల్సి ఉంటుంది.