ధురంధర్ పై ఈ సస్పెన్స్ ఏంటో?
థియేటర్లలో ఈ సినిమాను దేశవ్యాప్తంగా విరగబడి చూశారు ప్రేక్షకులు. ఐతే థియేటర్లలో చూడని వాళ్లు ఓటీటీలో ఈ మూవీని వీక్షించేందుకు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.;
గత కొన్నేళ్లలో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమా ‘ధురంధర్’. రిలీజ్ ముంగిట ఈ సినిమాపై మరీ అంచనాలేమీ లేవు. రణ్వీర్ సింగ్ మార్కెట్ స్థాయికి మించి ఖర్చు పెట్టిన ఈ సినిమా అసలు బడ్జెట్ రికవరీ చేయగలదా అన్న సందేహాలు కలిగాయి. ఒకవేళ హిట్ టాక్ వచ్చినా.. రణ్వీర్ రేంజికి తగ్గట్లు 200-300 కోట్ల వసూళ్లే వస్తాయనుకున్నారు. కానీ ఈ చిత్రం ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి ట్రేడ్ పండిట్లను కూడా విస్మయానికి గురి చేసింది.
థియేటర్లలో ఈ సినిమాను దేశవ్యాప్తంగా విరగబడి చూశారు ప్రేక్షకులు. ఐతే థియేటర్లలో చూడని వాళ్లు ఓటీటీలో ఈ మూవీని వీక్షించేందుకు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో చూసిన వాళ్లు కూడా ఇంకో రౌండు వేయడానికి రెడీగా ఉన్నారు. ముందు వచ్చిన వార్తల ప్రకారం థియేట్రికల్ రిలీజ్ అయిన 8 వారాలకు, అంటే ఈ రోజు అర్ధరాత్రి ‘ధురంధర్’ డిజిటల్‌గా రిలీజ్ కావాలి.
ఐతే మరి కొన్ని గంటల్లో స్ట్రీమింగ్ మొదలు కావాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటిదాకా ‘ధురంధర్’ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ నెట్‌ఫ్లిక్స్ ఏమాత్రం సౌండ్ చేయట్లేదు. ఇలాంటి క్రేజీ మూవీ డిజిటల్‌గా రిలీజవుతుంటే.. కొన్ని రోజుల ముందు నుంచే అప్‌డేట్ ఇచ్చి ప్రేక్షకులను ఊరిస్తాయి స్ట్రీమింగ్ సంస్థలు. కానీ నెట్‌ఫ్లిక్స్ మాత్రం ‘దురంధర్’ గురించి అఫీషియల్ అప్‌డేట్ ఇవ్వలేదు. ఈ వారం తమ ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాల లిస్టులో కూడా ‘ధురంధర్’ పేరు చేర్చలేదు.
దీంతో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ‘ధురంధర్’ ఇప్పటికీ థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడుతున్న నేపథ్యంలో డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ విషయంలో ఏమైనా మార్పు చోటు చేసుకుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మరి ఈ అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్ సడెన్ సర్ప్రైజ్ ఏమైనా ఇస్తుందా.. లేక స్ట్రీమింగ్ కోసం ఇంకొన్ని రోజులు ఎదురు చూడక తప్పదా అన్నది చూడాలి.