ఆ నాలుగు తెలుగు సినిమాల దిగువ‌న‌ దురంధ‌ర్!

ధురందర్ ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ వసూళ్లలో 23వ రోజు కూడా హ‌వా సాగించింది. క్రిస్మస్ సెలవుల కారణంగా ఈ సినిమా మళ్లీ పుంజుకుంది.;

Update: 2025-12-28 18:30 GMT

ర‌ణ్ వీర్ సింగ్ దురంధ‌ర్ చాలా సినిమాల రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. కానీ ఇంకా త‌న‌కు తాత‌ల పొజిష‌న్ లో ఉన్న నాలుగు తెలుగు సినిమాల రికార్డుల‌ను మాత్రం అధిగ‌మించ‌లేక‌పోయింది. ఆ నాలుగు సినిమాలు ఏవి? అంటే.. బాహుబ‌లి 2, ఆర్.ఆర్.ఆర్, పుష్ప 2, క‌ల్కి 2898 ఏడి.. ఈ నాలుగు సినిమాల రికార్డుల‌ను ట‌చ్ చేయాలంటే ఈ చిత్రం ఇంకా ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చూపించాల్సి ఉంటుంది. క‌ల్కి సినిమా విదేశాల‌లో దురంధ‌ర్ కంటే ఒక మెట్టు పైన ఉంది.

ధురందర్ ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ వసూళ్లలో 23వ రోజు కూడా హ‌వా సాగించింది. క్రిస్మస్ సెలవుల కారణంగా ఈ సినిమా మళ్లీ పుంజుకుంది. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద నాలుగో వారంలో ఉన్న ఈ చిత్రం, విదేశాలలో రోజుకు 1 మిలియన్ డాలర్లకు పైగా వ‌సూలు చేస్తూ, దేశీయంగా సుమారు రూ.20-25 కోట్ల నిక‌ర‌ వసూళ్లను రాబడుతోంది.

తాజా స‌మాచారం మేర‌కు... రాజ్ క‌పూర్ ఆల్ టైమ్ క్లాసిక్ `ఆవారా` జీవిత‌కాల వ‌సూళ్ల‌ను ఇది అధిగ‌మించింది. 23వ రోజు ముగిసేప్ప‌టికి, ధురందర్ దేశీయ మార్కెట్‌లో రూ.668 కోట్ల నికర (రూ.801.50 కోట్ల స్థూల) వసూళ్లను రాబట్టింది. దీంతో ఇది భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన 5వ భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకి పైన పుష్ప 2, బాహుబలి 2, KGF చాప్టర్ 2 , RRR వంటి పాన్-ఇండియా చిత్రాలు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ బాలీవుడ్ చిత్రం కూడా దేశీయ వ‌సూళ్ల‌లో రూ.650 కోట్లను దాటలేకపోయింది. ధురందర్ భారతదేశంలో రూ.700 కోట్ల మార్కు వైపు దూసుకెళుతోంది. అంతర్జాతీయంగా కూడా వేగం పుంజుకుంది. విదేశాల నుంచి ఇప్ప‌టికి 26 మిలియన్ డాలర్లు ఆర్జించింది. విదేశీ వ‌సూళ్ల‌ను క‌లుపుకుంటే, ప్రపంచవ్యాప్త దురంధ‌ర్ నిక‌ర‌ వసూళ్లు ప్రస్తుతం రూ.1035 కోట్లుగా ఉన్నాయి.

ఇక విదేశీ వ‌సూళ్ల‌లో ఆవారా (25.8 మిలియన్ డాల‌ర్లు), మేరా నామ్ జోకర్ (22.1 మిలియన్ డాల‌ర్లు), మై నేమ్ ఈజ్ ఖాన్ (20.3 మిలియన్ డాల‌ర్లు), డంకీ (23.7 మిలియన్ డాల‌ర్లు), 3 ఇడియట్స్ (26 మిలియన్ డాల‌ర్లు) రికార్డుల‌ను దురంధ‌ర్ బ్రేక్ చేసింది. అయితే విదేశాల‌లోను డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన క‌ల్కి 2898 ఏడి దాదాపు 29మిలియ‌న్ డాల‌ర్ల‌తో టాప్ పొజిష‌న్ లో ఉంది. షోలే 28 మిలియ‌న్ డాల‌ర్లు, బాబీ 29 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసాయి. ఈ వ‌సూళ్ల‌ను దురంధ‌ర్ అధిగ‌మించే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా. దురంధ‌ర్ పార్ట్ 2 మార్చి 2026లో విడుదల కానుంది.

Tags:    

Similar News