శ్రీ‌రాముడి పాత్ర‌ధారి చెప్పిన ఇంట్రెస్టింగ్ సౌత్ స్టోరీ!

తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న అరుణ్ గోవిల్ సౌత్‌లో జ‌రిగిన ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని బ‌య‌ట‌పెట్టి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. దాని త‌రువాత త‌న‌కు ఇష్ట‌మైన దాన్ని వ‌దులుకున్నార‌ట‌.;

Update: 2026-04-03 18:52 GMT

ర‌ణ్‌బీర్ క‌పూర్, సాయి ప‌ల్లవి సీతారాములుగా న‌టిస్తున్న బాలీవుడ్ మూవీ `రామాయ‌ణ‌`. ఇండియాలోనే మొట్ట‌మొద‌టి సారిగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో, హాలీవుడ్ సాంకేతిక‌త‌తో దీన్ని ద‌ర్శ‌కుడు నితేష్ తివారీ రూపొందిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ కోసం న‌మిత్ మ‌ల్హోత్రా, హీరో య‌ష్ దాదాపు రూ.4000 కోట్లు ఖర్చు చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో హాలీవుడ్ సినిమాల‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో రామాయ‌ణ ఇతిహాసాన్ని వెండితెర‌పై ఓ సుంద‌ర కావ్యంగా ఆవిష్క‌రిస్తున్నారు.

రీసెంట్‌గా ఈ మూవీ టీజ‌ర్‌ని భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. టీజ‌ర్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉంద‌ని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఇందులో ద‌శ‌ర‌ధుడిగా న‌టించిన ఆ నాటి రాముడు అరుణ్ గోవిల్ ఓ టీవీ షోలో చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. దీనిపై ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది. `రామ‌చ‌రిత మాన‌స్‌` ఆధారంగా రామానంద్‌ సాగ‌ర్ రూపొందించిన `రామాయ‌ణ్‌` టెలివిజ‌న్ చ‌రిత్ర‌లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించి గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో స్థానాన్ని ద‌క్కించుకుంది. అందులో శ్రీ‌రాముడిగా అరుణ్ గోవిల్, సీత‌గా దీపిక చికిలియా న‌టించారు.

ఈ పౌరాణిక ధారావాహిక వ‌చ్చి ద‌శాబ్దాలు కావ‌స్తున్నా దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో ఏ మాత్రం క్రేజ్ త‌గ్గ‌లేదు. అంతే కాకుండా వీరిద్ద‌రిని ఇప్ప‌టికీ సీతారామ‌చంద్రుల‌కు ప్ర‌తిరూపాలుగానే భావిస్తుంటారు. క‌నిపిస్తే చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తుంటారు. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న అరుణ్ గోవిల్ సౌత్‌లో జ‌రిగిన ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని బ‌య‌ట‌పెట్టి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. దాని త‌రువాత త‌న‌కు ఇష్ట‌మైన దాన్ని వ‌దులుకున్నార‌ట‌. అరుణ్ గోవిల్ మాట్లాడుతూ రామాయ‌ణ్ సీరియ‌ల్ షూటింగ్ జ‌రిగిన‌న్ని నాళ్లు..సీరియ‌ల్ టెలికాస్ట్ అయిన‌న్ని నాళ్లు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించార‌ట‌.

`రామాయ‌ణ్ త‌రువాత పెరిగిన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ కోసం ఫొటోలు అడిగే వాళ్లు. అయితే నా ఫొటోగ్రాఫ్ కోసం వ‌చ్చే ఫొటోగ్రాఫ‌ర్స్‌కి మ్యాగ‌జైన్ యాజ‌మాన్యం అరుణ్ జీకి సంబంధించిన ఒక ఫోటోని ఎంత ఖ‌ర్చు అయినా ఫ‌ర‌వాలేదు తీసుకురా అయితే ఆయ‌న చేతిలో గ్లాస్ ఉండాలి..లేదా విస్కీ గ్లాస్ ఉండాలి అని చెప్పేవార‌ట‌. అది గ‌మ‌నించిన నేను ఏ ఒక్క‌రికీ ఫోటో ఇవ్వ‌లేదు` అన్నారు. ఇదే సంద‌ర్భంగా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆడియ‌న్స్‌తో పంచుకున్నారు.

సౌత్‌లో ఓ బైలింగ్వ‌ల్ మూవీలో న‌టించాను. అందులో భానుప్రియ మెయిన్ లీడ్‌లో న‌టించింది. నాతో పాటు చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ న‌టించారు. దీన్ని తెలుగు, తమిళ భాష‌ల్లో నిర్మించారు. భానుప్రియ ల‌క్ష్మిగా న‌టిస్తే నేను బాలాజీగా ఏడుకొండ‌స్వామిగా న‌టించాను. మ‌ద్రాస్‌లో షూటింగ్ చేస్తున్నాం. ఆ రోజుల్లో నేను సిగ‌రేట్ తాగేవాడిని. లంచ్ టైమ్ త‌రువాత నాకు సిగ‌రేట్ తాగే అల‌వాటు ఉండేది. స్టూడియోలో ఓ భారీ ప‌ర‌దా క‌ట్టి ఉండేది. దాని చాటుకు ఓ మూల కూర్చుని నేను సిగ‌రేట్ తాగేవాడిని.

అదే స‌మ‌యంలో ఓ పెద్దాయ‌న అక్క‌డి వ‌చ్చాడు. న‌న్ను సీరియ‌స్‌గా చూస్తూ ఏవెవో మాట‌లు అంటున్నాడు. అవి నాకు అర్థం కావ‌డం లేదు. త‌ను మాట్లాడే భాష నాకు అర్థం కాలేదు కానీ ఆయ‌న న‌న్ను తిట్టాడ‌ని అర్థ‌మైంది. దాంతో కొంచెం శాంతించండి అని నేను ఆయ‌న‌తో ఇంగ్లీష్‌లో చెబుతూ అక్క‌డున్న ఒక‌త‌న్ని పిలిచాను. అన్నా ఇత‌ను ఏం అంటున్నాడు? నాకైతే ఇత‌ను న‌న్ను తిడుతున్నాడ‌ని అర్థ‌మైంది అన్నాను. అక్క‌డికి వ‌చ్చిన వ్య‌క్తి ఏమ‌న్నాడంటే..`మిమ్మ‌ల్ని మేం దేవుడిలా చూస్తాం. మీరు ఇలా చేస్తున్నారేంటీ మీకు క‌నీసం సిగ్గులేదా? అన్నాడు. ఆ ఒక్క సంఘ‌ట‌న త‌రువాత జీవితంలో మ‌ళ్లీ నేను సిగ‌రేట్ ముట్ట‌లేదు` అన్నారు. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. దీన్ని షేర్ చేస్తూ `రామాయ‌ణ‌`లో న‌టిస్తున్న ర‌ణ్‌బీర్ క‌పూర్ ఇవ‌న్నీ పాటిస్తున్నాడా? అని నెటిజ‌న్‌లు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.

Tags:    

Similar News