ర‌ణ‌బీర్ గురించి 'రామాయ‌ణ' సీరియ‌ల్ సృష్టిక‌ర్త ఏమ‌న్నారు?

ఈ భారీ ప్రాజెక్టుపై మోతి సాగర్ ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. నితీష్ తివారీ ప్రతిభపై తనకు పూర్తి నమ్మకం ఉందని... ఈ సినిమా నుండి అత్యుత్తమ అవుట్‌పుట్ వస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.;

Update: 2026-04-09 20:30 GMT

రామాయ‌ణం, మ‌హాభార‌తం వంటి పురాణేతిహాసాల్ని ట‌చ్ చేయ‌డం అంటే ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. ఇది కోట్లాది మంది ప్ర‌జ‌ల భావోద్వేగాల‌కు సంబంధించిన విష‌యం. ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను గౌర‌విస్తూ వారి మ‌నోభీష్టానికి అనుకూలంగా సినిమాలు తీయాల్సి ఉంటుంది. తేడాగా తీస్తే తిట్ట‌డం కాదు కొడ‌తారు. రామాయ‌ణం జోలికి వెళితే, దానికి ముందే శ్రీ‌రాముడు- సీతాదేవికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నార‌న్న‌ది అస్స‌లు మ‌ర్చిపోకూడ‌దు. ఇప్పుడు నితీష్ తివారీ రామాయ‌ణ ఫ్రాంఛైజీ తీవ్రంగా చ‌ర్చ‌ల్లోకొచ్చింది. ఇటీవ‌ల విడుద‌లై `రామాయ‌ణ` టీజ‌ర్ చాలా విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంటోంది. అంతేకాదు రామాయ‌ణ సీరియ‌ల్ సృష్టిక‌ర్త రామానంద్ సాగ‌ర్, ఆయ‌న కుమారుడు మోతి సాగ‌ర్ ర‌ణ‌బీర్ గురించి ఏమ‌న్నారు? అన్న‌ది తెలియాలంటే.. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లాలి.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న `రామాయణ` చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టులో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తుండటం విశేషం. అయితే ఈ ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో భారతీయ టెలివిజన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన `రామాయణ్` సీరియల్ సృష్టికర్త రామానంద్ సాగర్ కుమారుడు, ప్రముఖ నిర్మాత మోతి సాగర్ స్పందించారు. రణబీర్ కపూర్‌ను ఒక `క్లాస్ యాక్టర్` అని అభివర్ణిస్తూ.. ఈ పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుత తరం నటులలో భావోద్వేగాలను లోతుగా పలికించడంలో రణబీర్ అత్యుత్తమ నటుడని మోతి సాగర్ ప్రశంసించారు. శ్రీరాముడి వంటి పవిత్రమైన, గంభీరమైన పాత్రకు అవసరమైన భావోద్వేగ ప‌ర‌మైన డెప్త్ రణబీర్ వద్ద పుష్కలంగా ఉందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. రాముడి పాత్ర కేవలం నటనకు సంబంధించింది మాత్రమే కాదని.. అది ఒక గొప్ప బాధ్యత అని.. రణబీర్ తన ప్రతిభతో ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పాత్ర కోసం రణబీర్ ఎంతో ఇన్ డెప్త్ తో అధ్యయనం చేసి ఉంటారని మోతి సాగ‌ర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

గతంలో తన తండ్రి రామానంద్ సాగర్ రూపొందించిన క్లాసిక్ టీవీ సిరీస్‌తో ఈ కొత్త సినిమాను పోల్చవద్దని మోతి సాగర్ కోరారు. ఆనాటి కాలమాన పరిస్థితులు, సాంకేతికత, మేకింగ్ శైలి వేరని.. నేటి కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో నితీష్ తివారీ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు. కేవలం హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన చిన్న టీజర్‌ను చూసి సినిమాను అంచనా వేయడం సరైంది కాదని.. రణబీర్ మేకోవర్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు.

ఈ భారీ ప్రాజెక్టుపై మోతి సాగర్ ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. నితీష్ తివారీ ప్రతిభపై తనకు పూర్తి నమ్మకం ఉందని... ఈ సినిమా నుండి అత్యుత్తమ అవుట్‌పుట్ వస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. నటీనటుల ఎంపిక - చిత్ర నిర్మాణ విలువలు చూస్తుంటే ఇదొక విజువల్ వండర్‌గా నిలిచిపోతుందని న‌మ్మ‌కం వ్య‌క్తం చేసారు. ఏదేమైనా పూర్తి సినిమా చూసిన తర్వాతే ఒక తుది నిర్ణయానికి రావడం మంచిదని.. అప్పటి వరకు రణబీర్ వంటి గొప్ప నటుడి నటనను ప్రోత్సహించాలని ఆయన సూచించారు.

ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో రణబీర్ కపూర్‌తో పాటు సాయి పల్లవి (సీత), యశ్ (రావణుడు), సన్నీ డియోల్ (హనుమంతుడు) వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పార్ట్ 1 - దీపావళి 2026న, పార్ట్ 2 - దీపావళి 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి. రామానంద్ సాగర్ వారసుడి నుండే ఇటువంటి సానుకూల స్పందన రావడం రణబీర్ కపూర్‌కు, చిత్ర యూనిట్‌కు పెద్ద ఊరటనిచ్చే విషయమని చెప్పవచ్చు.

Tags:    

Similar News