'టెస్ట్' చేసి ఉంటే.. 'రణబాలి' సీన్ వేరేలా ఉండేదేమో..
సినిమా విడుదలైన మొదటి రోజు కొన్ని థియేటర్లలో సౌండ్ తక్కువగా ఉందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై మూవీ టీమ్ రెస్పాండ్ అయింది.
విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ రణబాలి విడుదలైన తర్వాత ఇప్పుడు సౌండ్ పై జోరుగా చర్చ జరుగుతోంది. కొన్ని థియేటర్లలో సౌండ్ తక్కువగా ఉందని ప్రేక్షకులు కంప్లైంట్ చేయగా.. మరికొందరు సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై విమర్శలు చేస్తున్నారు. దీంతో అసలు సమస్య ఎక్కడ ఉందనే ప్రశ్నలు మొదలయ్యాయి. రిలీజ్ కు ముందే థియేటర్లలో సౌండ్ ఎలా వస్తుందో టెస్ట్ చేసి ఉంటే బాగుండేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మ్యారేజ్ అయ్యాక తొలిసారి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ఆ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా.. అజయ్-అతుల్ మ్యూజిక్ అందించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ మూవీ స్టోరీ అండ్ డైరెక్టర్ నేరషన్ పై డిస్కషన్ జరుగుతుండగానే.. ఇప్పుడు ఆడియో సమస్య కూడా హాట్ టాపిక్ గా మారింది.
సినిమా విడుదలైన మొదటి రోజు కొన్ని థియేటర్లలో సౌండ్ తక్కువగా ఉందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై మూవీ టీమ్ రెస్పాండ్ అయింది. సాధారణంగా థియేటర్లలో సౌండ్ ను 5.6 రేంజ్ లో ఉంచుతారని.. అయితే రణబాలిలోని యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను పూర్తిస్థాయిలో ఆస్వాదించాలంటే 6 లేదా 6.6 స్థాయిలో ప్లే చేయాలని థియేటర్ల యాజమాన్యాలకు సజ్జెస్ట్ చేసింది.
అయితే సినిమా విడుదలైన తర్వాత సౌండ్ పెంచాలని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది.. ఇంత భారీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ముందు థియేటర్లలో ఆడియోను పరీక్షించి ఉంటే ఆ సమస్యను ముందే గుర్తించే అవకాశం ఉండేది కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్, హీరో ఎలివేషన్ సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది.
అలాంటి సన్నివేశాల్లో సౌండ్ సరిగ్గా లేకపోతే ప్రేక్షకులకు కలగాల్సిన ఎక్స్పీరియన్స్ తగ్గిపోతుంది. మరోవైపు, సౌండ్ రేంజ్ పెంచితేనే సమస్య మొత్తం సాల్వ్ అవుతుందా అనే డౌట్లు కూడా ఉన్నాయి. కొన్ని సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనుకున్న రేంజ్ లో లేదని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. స్టోరీలోని ఫీలింగ్ కు, సీన్ లోని ఇంటెన్సిటీకి తగ్గట్టుగా సంగీతం ఉండాలని కోరుకుంటున్నారు.
అయితే సినిమా సౌండ్ విషయంలో రెండు ఎలిమెంట్స్ ను వేర్వేరుగా చూడాలి. థియేటర్ లో వాల్యూమ్ తక్కువగా ఉంటే దాన్ని పెంచడం ద్వారా కొంతవరకు ప్రాబ్లమ్ సాల్వ్ కావచ్చు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్, ఇతర సౌండ్స్ సరైన రేంజ్ లో కలిసివచ్చాయా లేదా అనేది కూడా అంతే ముఖ్యం. కేవలం వాల్యూమ్ పెంచడం వల్ల ప్రతి ప్రాబ్లమ్ క్లియర్ కాదనే చెప్పాలి.
పెద్ద సినిమాల విషయంలో షూటింగ్, మ్యూజిక్ తో పాటు థియేటర్లలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందన్న విషయంపై ఫోకస్ పెట్టాలి. విడుదలకు ముందు కొన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శించి, సౌండ్ ను టెస్ట్ చేసి ఉంటే ఇలాంటి కంప్లైంట్లను ముందుగానే గుర్తించే అవకాశం ఉండేది. రణబాలి విషయంలో కూజా ఆ జాగ్రత్త తీసుకుని ఉంటే.. పరిస్థితి కచ్చితంగా వేరేగా ఉండేదేమో.