సంగీత దిగ్గజం దేవా అస్తమయం!

సామాన్య ప్రజలు, యువత వేగంగా కనెక్ట్ అయ్యే జానపద .. లోకల్ శైలి పాటలను కమర్షియల్ సినిమాల్లోకి తీసుకొచ్చి సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు.

Update: 2026-10-17 07:28 GMT

దక్షిణాది చిత్ర పరిశ్రమలో మధురమైన స్వరాలతో.. మాస్ బీట్లతో మిలియన్ల మంది సంగీతాభిమానులను అలరించిన ప్రముఖ సంగీత దర్శకుడు `తేనిసై తెంద్రల్` దేవా (75) కన్నుమూశారు. ఆయన మరణవార్త తో తమిళ, తెలుగు, కన్నడ పరిశ్రమలు తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యాయి. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న దేవా అస్తమయంతో అద్భుతమైన సంగీత శకం ముగిసిందని సినీ ప్రముఖులు.. అభిమానులు కన్నీటి నివాళులర్పిస్తున్నారు.

`తేనిసై తెంద్రల్` బిరుదు వెనుక కథసంగీత ప్రియులు ఆయ‌న్ని ఆప్యాయంగా `తేనిసై తెంద్రల్` (తేనెలాంటి చల్లని గాలులు) అని పిలుచుకుంటారు. మెలోడీ పాటలను అత్యంత హృద్యంగా స్వరపరచడంలో దేవ‌ చూపిన నైపుణ్యం వల్ల ఈ బిరుదు సొంతమైంది. శాస్త్రీయ సంగీతం, జానపద బాణీలు, మాస్ రిథమ్స్ ఇలా ప్రతీ శైలిలోనూ అద్భుతమైన పాటలను అందించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. దక్షిణాది వ్యాప్తంగా అసాధారణ ప్రయాణం తమిళంలో వందలాది సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన దేవా తెలుగు, కన్నడ భాషల్లోనూ అనేక విజయవంతమైన చిత్రాలకు స్వరాలు సమకూర్చారు.

ముఖ్యంగా 90ల కాలంలో ఆయన అందించిన పాటలు దశాబ్దాల పాటు చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. రజినీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజ కథానాయకుల చిత్రాలకు ఆయన అందించిన నేపథ్య సంగీతం, మాస్ పాటలు థియేటర్లలో ప్రేక్షకులను ఊరూతలూగించాయి. `గానా` పాటల పితామహుడుసినిమా సంగీతంలో `గానా` శైలిని ప్రజాదరణ పొందేలా చేయడంలో దేవా కీలక పాత్ర పోషించారు.

సామాన్య ప్రజలు, యువత వేగంగా కనెక్ట్ అయ్యే జానపద .. లోకల్ శైలి పాటలను కమర్షియల్ సినిమాల్లోకి తీసుకొచ్చి సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. సంగీత దర్శకుడిగానే కాకుండా పలు హిట్ పాటలను స్వయంగా పాడి గాయకుడిగానూ ప్రతిభను చాటుకున్నారు. తెలుగు సినీ ప్రియులకు కూడా దేవా సంగీతం ఎంతో సుపరిచితం. ఇతర భాషల నుంచి అనువాదమైన చిత్రాల పాటలతో పాటు.. పలు నేరుగా నిర్మించిన తెలుగు చిత్రాలకు కూడా ఆయన అందించిన స్వరాలు మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఇప్పటికీ ఆయన అందించిన క్లాసిక్ మెలోడీలు, ఎనర్జెటిక్ మాస్ సాంగ్స్ ఎఫ్‌ఎమ్ రేడియోలు, మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌లలో మారుమోగుతూనే ఉంటాయి.

తెలుగులో దేవా `శ్రీమాన్ బ్ర‌హ్మ‌చారి` సినిమాతో లాంచ్ అయ్యారు. అటుపై `భ‌లే పెళ్లాం`, `మాస్ట‌ర్`, ` ఆటో డ్రైవ‌ర్`, `తొలి ప్రేమ‌`, `గ్రీకు వీరుడు`, `నాగ` ,` నాయుడ‌మ్మ‌`, `విజ‌య‌ద‌శ‌మి` లాంటి చిత్రాల‌కు సంగీతం అందించారు. చివ‌రిగా 2010లో `కారా మ‌జాకా` అనే చిత్రానికి సంగీతం అందించారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు సినిమాల‌కు దేవా ప‌ని చేయ‌లేదు.

Tags:    

Similar News