ఆ రోజుల్లో తిండిలేక ప్రసాదం కోసం క్యూలో నిలబడ్డాం!

1968 ప్రాంతంలో చెన్నై నగరానికి వచ్చిన కొత్తలో ఇళయరాజా ఆయన సోదరుడు భాస్కర్ ..ప్రముఖ దర్శకుడు భారతిరాజా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

Update: 2026-10-17 06:38 GMT

భారతీయ సంగీత ప్రపంచంలో లెజెండ్‌గా వెలిగిన‌ స్వరమాంత్రికుడు ఇళయరాజా చెన్నై నగరంలో ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న కష్టాలను, ఆకలి బాధలను తాజాగా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం చెన్నై టి.నగర్‌లోని తన నివాసంలో అత్యంత వైభవంగా నవరాత్రి గోలు వేడుకలను నిర్వహిస్తున్న ఆయన ఈ సంప్రదాయం వెనుక ఉన్న భావోద్వేగమైన నేపథ్యాన్ని పంచుకున్నారు.

1968 ప్రాంతంలో చెన్నై నగరానికి వచ్చిన కొత్తలో ఇళయరాజా ఆయన సోదరుడు భాస్కర్ ..ప్రముఖ దర్శకుడు భారతిరాజా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అక్టోబరు నెలలో వచ్చే నవరాత్రి ఉత్సవాల సమయంలో తిండికి కూడా డబ్బులు లేక పూట గడవడమే కష్టంగా ఉండేదని తెలిపారు. ఆ సమయంలో చెన్నైలోని వడపళని కోవెల సమీపంలో పంపిణీ చేసే ప్రసాదాల కోసం ఆశగా ఎదురుచూసేవారని గుర్తుచేసుకున్నారు.

`ఆ రోజుల్లో మేం ఆకలితో అలమటించేవాళ్లం. వడపళని గుడి దగ్గర నవరాత్రి వేళ బొరుగులు , గుగ్గిళ్ళు పంచుతుంటే మేం క్యూ లైన్లలో నిలబడి తెచ్చుకునేవాళ్లం. ఆహారం పంచే ప్రతి ప్రసాదం కేంద్రాన్ని సందర్శించి లైన్లో నిలబడి ప్రసాదం సేకరించేవాళ్లం` అని ఇళయరాజా ఆనాటి చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు.

అలా సేకరించిన ప్రసాదాలను తమ గదికి తెచ్చుకుని ఎలా పంచుకునేవారో కూడా వివరించారు. `మేం ముగ్గురం గదికి వచ్చి ఒక పెద్ద కాగితాన్ని నేలపై పరిచి తెచ్చిన ఆహారాన్ని అంతటినీ దానిపై పోసుకుని కలిసి తినేవాళ్లం. ఆ తర్వాత కడుపు నిండా నీళ్లు తాగి నిద్రపోయేవాళ్లం` అని రాజా వెల్లడించారు. ఈ కష్టాలన్నీ రాజా తన సతీమణికి చెప్పినప్పుడు ఆమె ఎంతో చలించిపోయారన్నారు.

పండుగ రోజుల్లో ఎవరూ ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో ఇళయరాజా సతీమణి ప్రతి నవరాత్రికి తమ ఇంట్లో చిన్నగా గోలు ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి ఒక్కరికీ అన్నదానం చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంగా ఈ వేడుకలు ఎంతో వైభవంగా మారాయి. తొలినాళ్లలో ఆహార ప్యాకెట్ల పంపిణీతో మొదలైన ఈ సంప్రదాయం కాలక్రమేణా సంగీత విభావరిగా రూపాంతరం చెందింది.

ప్రస్తుతం ఇళయరాజా ఇంట్లో జరిగే నవరాత్రి వేడుకలు సంగీత, ఆధ్యాత్మిక సంగమంగా మారుతున్నాయి. ఈ ఏడాది నిర్వహించిన గోలు ఉత్సవాల్లో ప్రఖ్యాత కర్ణాటక సంగీత దిగ్గజం ఎం.ఎస్. సుబ్బులక్ష్మి మునిమనుమరాళ్లు ఐశ్వర్య, సౌందర్యల చేత సంగీత కచేరీని ఏర్పాటు చేయడం విశేషం. ఒకప్పుడు ఆకలితో ప్రసాదం కోసం క్యూలో నిలబడిన ఇళయరాజా నేడు వేలాది మందికి అన్నదానంతో పాటు సంగీతామృతాన్ని పంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Tags:    

Similar News