'గరివిడి లక్ష్మి' మూవీ రివ్యూ

కొన్ని దశాబ్దాల ముందు బుర్రకథ.. పాటలతో ఉత్తరాంధ్రని ఉర్రూతలూగించిన గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా.. గరివిడి లక్ష్మి.

Update: 2026-10-17 04:19 GMT

'గరివిడి లక్ష్మి' మూవీ రివ్యూ

నటీనటులు: ఆనంది - రాగ్ మయూర్ - నరేష్ - శరణ్య ప్రదీప్- రాశి - అంకిత్ కొయ్య - కంచరపాలెం కిషోర్ - నితిన్ ప్రసన్న తదితరులు

సంగీతం: చరణ్ అర్జున్

ఛాయాగ్రహణం: ఆదిత్య జవ్వాది

నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్

రచన - దర్శకత్వం: గౌరీ నాయుడు జమ్ము

కొన్ని దశాబ్దాల ముందు బుర్రకథ.. పాటలతో ఉత్తరాంధ్రని ఉర్రూతలూగించిన గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా.. గరివిడి లక్ష్మి. దసరా కానుకగా ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ బయోపిక్ ఏమేర ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండి.

కథ:

విజయనగరం దగ్గర గరివిడి గ్రామానికి చెందిన లక్ష్మి (ఆనంది).. చిన్నతనంలోనే తండ్రికి దూరమవుతుంది. ఆమెకు కూడా చిన్నతనంలోనే పెళ్లి కాగా.. భర్త కూడా ఆమెను విడిచివెళ్లిపోతాడు. దీంతో తల్లి దేవుడమ్మ (రాశి) తో కలిసి జీవిస్తుంటుంది లక్ష్మి. ఆమెకు చిన్నప్పట్నుంచి పాటలంటే ఇష్టం. చదువు రాకపోయినా ఒకసారి పాట వినగానే పాడేసే నైపుణ్యం లక్ష్మి.. సుబ్బారావు (షకలక శంకర్)కు చెందిన బుర్రకథ ట్రూప్ లో చేతుతుంది. ఐతే అక్కడ చేదు అనుభవం ఎదురవడంతో బయటికి వచ్చేస్తుంది. ఆ సమయంలోనే గరివిడికి సత్తిబాబు (రాగ్ మయూర్) బుర్రకథ చెప్పడానికి వస్తాడు. తన ట్రూప్ లో చేరి తన ప్రతిభను చాటుకున్న లక్ష్మి ఊహించని స్థాయికి వెళ్లిపోతుంది. ఈ క్రమంలోనే సత్తిబాబుతో లక్ష్మికి ప్రేమ మొదలవుతుంది. ఈ క్రమంలో లక్ష్మి కెరీర్ ఎలాంటి మలుపులు తిరిగింది.. జీవితంలో ఆమెకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.. ఈ విషయాలు సినిమా చూసే తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

సినిమాలందు బయోపిక్స్ ప్రత్యేకత వేరు. ఒక మనిషి వాస్తవ జీవితాన్ని ప్రభావవంతంగా తెరపైకి తీసుకొస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందో మహానటి లాంటి సినిమాలు రుజువు. అలా అని ప్రతి బయోపిక్ ‘మహానటి’ అయిపోదు. ప్రేక్షకులను ఆకట్టుకోదు. ఐతే సావిత్రి స్థాయిలో కాకపోయినా.. బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితంలో సినిమాకు అవసరమైన నాటకీయత ఉంది. చాలామంది కళాకారులు జీవితంలో ఎంత ఎత్తు చూస్తారో.. అంత లోతుకు పడిపోతారు. దానికి గల సంఘటనలు ఏంటి? చుట్టూ ఉన్న జనాలు ఎలా మోసం చేస్తారు అని.. గరివిడి లక్ష్మి జీవితంలో జరిగిన అనేక ఉదంతాల ఆధారంగా పాటలతో, ఎమోషన్లతో ఈ సినిమాని బాగానే తెరకెక్కించారు. కథ పరంగా ‘మహానటి’ని తలపించే ‘గరివిడి లక్ష్మి’లో విషయానికేమీ లోటు లేదు. కాకపోతే కొంచెం ఓపిక చేసుకుని చూడాల్సిన సినిమా ఇది.

సినిమా వాళ్ళు గరివిడి లక్ష్మి మీద మూవీ తీద్దామని ఆమెని వెతుకుంటూ వెళ్లి.. ఆ ప్రయాణంలో తన గురించి తెలుసుకునే స్క్రీన్ ప్లేతో ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రథమార్ధంలో లక్ష్మి చిన్నతనం.. టీనేజిలో సరదాగా పాటలు పాడటం.. బుర్రకథలోకి ఎంటర్ అవ్వడం.. సత్తిబాబు పరిచయం.. బుర్రకథల్లో మొదట అవమానాలు.. తర్వాత పేరు తెచ్చుకోవడం.. ఇలా సింపుల్ గా.. సరదాగా బోర్ కొట్టకుండా.. సినిమాను నడిపించారు. లక్ష్మి చిన్నప్పటి విషయాలు కొంచెం సాగతీతగా అనిపిస్తాయి కానీ.. మిగతా వ్యవహారమంతా మంచి స్పీడులోనే నడుస్తుంది. ఇంటర్వెల్ ముందు మంచి ఊపు ఉన్న పాటతో ఒక హై ఫీలింగ్ ఇస్తుంది ‘గరివిడి లక్ష్మి’.

ఇక ద్వితీయార్ధంలో గరివిడి లక్ష్మి ఎంత పేరుతెచ్చుకుందో, ఎంతగా ఎదిగిపోయిందో చూపించారు. ఆమె జీవితంలో పలువురు చేసిన మోసాలు.. వాటి వాళ్ళ లక్ష్మి పడ్డ క్షోభ.. చివరకు లక్ష్మి ప్రస్తుత జీవితాన్ని చూపించారు. మూణ్నాలుగు దశాబ్దాల కింద అంటే ఓకే కానీ.. ఇప్పుడు బుర్రకథ పాటలను తెరమీద చూపిస్తే ప్రేక్షకులు ఏం కనెక్ట్ అవుతారు అనుకుంటాం కానీ.. ఈ సినిమాలో అవి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. లక్ష్మికి జనం నీరాజనం పలికే సన్నివేశాలు బాగా పండాయి. అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా మెప్పిస్తాయి. సినిమా వాళ్ళు.. ఆడియో క్యాసెట్ల వాళ్ళు, సొంత మనుషులు.. ఇలా అందరి చేతిలో లక్ష్మి మోసపోయి కష్టాలుపడ్డ తీరును హృద్యంగా చూపించారు. రాజభోగాలు చూసిన వ్యక్తి ఇప్పుడు ఇలా బతుకుతోందా అని ఫీలయ్యేలా సినిమాను ముగించారు. క్లైమాక్సులో ‘గరివిడి లక్ష్మి’ మీద సినిమా తీసినట్లు.. రియల్ గరివిడి లక్ష్మి కూడా ఆ సినిమా చూసినట్లు చూపించి.. ఈ సినిమాతో ప్రేక్షకులు రిలీటయ్యేలా చేయడం బాగుంది. ‘చిత్రం’ సినిమాలో ఆర్పీ పట్నాయక్.. గరివిడి లక్ష్మి పాటను వాడడానికి సంబంధించిన వివాదం మీద ఆయన బైట్ కూడా వేయడం ఈ కథకు అథెంటిసిటీ తీసుకొస్తుంది.

ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా వరకు ‘మహానటి’లాగే రాసుకున్నారు. గరివిడి లక్ష్మి కథ కూడా ఆల్మోస్ట్ సావిత్రి స్టోరీలాగే అనిపిస్తుంది. లక్ష్మి బాల్యం.. కళాకారిణిగా ఎదగడం.. తన ప్రేమ.. జీవితంలో మోసాలు.. ఇవన్నీ ‘మహానటి’ని గుర్తుకు తెస్తాయి. గరివిడి లక్ష్మి’కి ఎమోషనల్ సీన్లే ఆయువుపట్టు. పాటలు, బుర్రకథలు సింగిల్ స్క్రీన్లలో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రేక్షకులు ఈ సినిమాతో బాగా రిలేటయ్యే అవకాశముంది. ఈ కథతో అందరూ కనెక్టవుతారని చెప్పలేం కానీ.. నచ్చేవాళ్లకు మాత్రం ఇది బాగా ఎమోషనల్ గా అనిపిస్తుంది.

నటీనటులు:

గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది జీవించేసిందని చెప్పొచ్చు. నాలుగు దశల్లో గెటప్ తో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది. నిజంగా గరివిడి లక్ష్మి ఇలాగే బుర్రకథలు చెప్పేదేమో అనిపించేలా తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. నటన పరంగా ఆనందికి ఇది కెరీర్ బెస్ట్ అని చెప్పొచ్చు. రాగ్ మయూర్.. సత్తిబాబు పాత్రలో వేరియేషన్స్ చూపిస్తూ.. బుర్రకథలు చెప్పే సీన్లలో తన టాలెంట్ మెప్పించాడు. సీనియర్ నటుడు నరేష్ తన అనుభవాన్ని చూపిస్తూ బలమైన ముద్ర వేశారు. తల్లి పాత్రలో రాశి సీరియస్ నటనతో మెప్పించారు. సీనియర్ నటుడు ఎల్బీ శ్రీరామ్.. అవసరాల శ్రీనివాస్ అతిథి పాత్రల్లో మెప్పించారు. శరణ్య ప్రదీప్ లక్ష్మి ఫ్రెండ్ పాత్రలో ఏజ్ వేరియేషన్స్ తో బాగా నటించింది. అంకిత్ కొయ్య.. షకలక శంకర్.. కంచరపాలెం కిషోర్.. నితిన్ ప్రసన్న.. వైవా రాఘవ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

సంగీత ప్రధానంగా సాగే ‘గరివిడి లక్ష్మి’కి చరణ్ అర్జున్ మ్యూజిక్ పెద్ద అసెట్ గా నిలిచింది. తన బీజీఎం సన్నివేశాలకు పెద్ద బలంగా నిలిచింది. ఇక పాటలు అయితే అదరగొట్టేశాడు చరణ్ అర్జున్. ఆదిత్య జవ్వాది విజువల్స్ ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఐతే 90వ దశకం.. అంతకుముందు వాతావరణాన్ని ఇంకా అథెంటిగ్గా చూపించాల్సింది. దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము గరివిడి లక్ష్మి జీవితం మీద ఎంతో పరిశోధన చేసి ఈ సినిమాను తెరకెక్కించాడని అర్థమవుతుంది. బుర్రకథల తాలూకు సెటప్.. ఆ సన్నివేశాలను నడిపించిన తీరు చాలా బాగుంది. ఇదంత తేలికైన విషయం కాదు. సినిమాలో ఎమోషనల్ సీన్లను దర్శకుడు బాగా డీల్ చేశాడు. కథనంలో ఇంకొంత వేగం.. వైవిధ్యం ఉండేలా చూసుకోవాల్సింది.

చివరగా: గరివిడి లక్ష్మి.. చూడదగ్గ బయోపిక్

రేటింగ్ - 2.75/5

Tags:    

Similar News