హీరోగా కంటే ఈ ఆదాయమే బాగుందా రానా?
సినీ పరిశ్రమలో హీరో అంటే నిత్యం సెట్స్ మీద ఉండాలి, వరసగా సినిమాలు చేయాలి. కానీ రానా దగ్గుబాటి కెరీర్ గ్రాఫ్ చూస్తే మాత్రం ఈ లెక్కలన్నీ తప్పు అనిపిస్తాయి.;
సినీ పరిశ్రమలో హీరో అంటే నిత్యం సెట్స్ మీద ఉండాలి, వరసగా సినిమాలు చేయాలి. కానీ రానా దగ్గుబాటి కెరీర్ గ్రాఫ్ చూస్తే మాత్రం ఈ లెక్కలన్నీ తప్పు అనిపిస్తాయి. ఆయన హీరోగా స్ట్రైట్ తెలుగు సినిమా చేసి ఏళ్ళు గడుస్తోంది. 'నేనే రాజు నేనే మంత్రి' తర్వాత సోలో హీరోగా రానా తనదైన మార్క్ చూపించిన సినిమా ఏది అంటే ఠక్కున సమాధానం రాదు. మధ్యలో 'విరాటపర్వం' వచ్చినా, అందులో సాయి పల్లవి డామినేషన్ ఎక్కువ. బాక్సాఫీస్ దగ్గర కూడా ఆ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు.
గత ఐదేళ్లలో రానా ఫిల్మోగ్రఫీని గమనిస్తే.. ఎక్కువగా గెస్ట్ రోల్స్, క్యామియో అప్పీయరెన్సులే కనిపిస్తాయి. 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'వెల్కమ్ టు న్యూయార్క్', 'స్పై', 'వేట్టయాన్'.. ఇలా అన్నీ అతిథి పాత్రలే. హీరోగా కెరీర్ స్లో అయినా, రానా ఆదాయం మాత్రం జెట్ స్పీడ్ లో ఉంది. దీనికి కారణం ఆయన ఎంచుకున్న ప్రత్యామ్నాయ మార్గం. "యాక్టింగ్ కంటే, ప్రొడ్యూసింగ్ బెటర్" అని ఆయన డిసైడ్ అయినట్లున్నారు.
రానా ఇప్పుడు ఒక ఫుల్ టైమ్ ప్రొడ్యూసర్, అలాగే ప్రెజెంటర్ అవతారం ఎత్తారు. 'కేరాఫ్ కంచరపాలెం' నుంచి మొదలుకొని రీసెంట్ గా వచ్చిన 'కీడా కోలా', 'జిగ్రా', 'ప్రేమంటే' వరకు.. కంటెంట్ బేస్డ్ సినిమాలను తన భుజాలపై వేసుకుని రిలీజ్ చేస్తున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా, '777 చార్లీ', 'గార్గి' వంటి డబ్బింగ్ సినిమాలకు కూడా ఆయనే సమర్పకుడు. ఈ సినిమాల్లో ఆయన నటించకపోయినా, లాభాల్లో మాత్రం వాటా ఉంటుంది.
హీరోగా సినిమా చేస్తే వచ్చే రెమ్యునరేషన్ కంటే, ఇలా ప్రెజెంటర్ గా మారి 'స్మార్ట్ మనీ' సంపాదించడమే సేఫ్ అని రానా భావిస్తున్నట్లున్నారు. ఒక సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడం, దాన్ని మార్కెట్ చేయడం, డిజిటల్ డీల్స్ క్లోజ్ చేయడం.. ఈ ప్రాసెస్ లో రానా ఇప్పుడు ఎక్స్ పర్ట్ అయిపోయారు. 'కాంత' లాంటి సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా ఉంటూ, బిజినెస్ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకున్నారు.
నిజానికి రానా లాంటి కటౌట్ కు మాస్ సినిమాలు పడితే బాక్సాఫీస్ షేక్ అవుతుంది. 'బాహుబలి'లో భల్లాలదేవుడిగా ఆయన చూపించిన విలనిజం, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకా ఎవరూ మర్చిపోలేదు. కానీ రానా మాత్రం ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడం మానేసి, బిజినెస్ వైపు అడుగులు వేయడం ఫ్యాన్స్ కు కాస్త నిరాశ కలిగించే విషయమే. హీరోగా ఆయన పొటెన్షియల్ ఇంకా పూర్తిగా బయటకు రాలేదని వారి అభిప్రాయం. అలగాని రెగ్యులర్ సినిమాలు చేయాలని అనుకోవడం లేదు. మంచి కంటెంట్, నమ్మకంగా అనిపిస్తేనే చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని కొత్త కథలపై చర్చలు జరుపుతున్నట్లు టాక్.