ఈవీవీ సెటప్ కూడా తిరిగొస్తోందా?

అల్లరి నరేష్ చాలా రోజుల తరువాత మళ్లీ కామెడీ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.

Update: 2026-08-27 03:48 GMT

అల్లరి నరేష్ చాలా రోజుల తరువాత మళ్లీ కామెడీ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇక రంభ ఊర్వశి మేనకలో కనిపిస్తున్న మరో విషయం పెద్ద తారాగణం. కొన్ని సీన్లలో 30 నుంచి 40 మంది ఆర్టిస్టులతో షూట్ చేశామని నరేష్ చెప్పాడు. ఈ మధ్య కాలంలో ఒకే సీన్‌లో ఇంతమందిని పెట్టి కామెడీ నడిపించే సినిమాలు చాలా తగ్గిపోయాయి.

షూటింగ్ సమయంలో శ్రీనివాస్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని గుర్తించాడట. సెట్లో ఇంతమంది ఆర్టిస్టులను చూసి ఈవీవీ గారి సినిమా సెట్లో ఉన్నట్టుందని నరేష్‌తో చెప్పాడట. ఈవీవీ సినిమాల్లో హీరోతో పాటు చుట్టూ ఉండే పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యం ఉండేది. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అలీ, ఏవీఎస్, ఎంఎస్ నారాయణ లాంటి వాళ్లు ఒకే సినిమాలో కనిపిస్తూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా నవ్వించేవారు.

అయితే అప్పటి కామెడీని ఇప్పుడు అలాగే ఆశించడం కూడా కరెక్ట్ కాదు. గత పదేళ్లలో తెలుగు సినిమాల్లో కామెడీ చాలా మారింది. ఒకప్పుడు ప్రత్యేకంగా కామెడీ ట్రాక్స్, ఎక్కువ మంది కామెడీ నటులు ఉండేవారు. ఇప్పుడు కథలో నుంచే వచ్చే హాస్యం, హీరో ఫ్రెండ్ మధ్య సీన్లు, చిన్న చిన్న పాత్రలతోనే ఎక్కువగా పని చేస్తున్నారు. సోషల్ మీడియా వల్ల ప్రేక్షకుల కామెడీ మీద అభిరుచి కూడా మారుతోంది. అందుకే పాత తరహా కామెడీని అలాగే తీసుకొస్తే ప్రతి సారి పని చేస్తుందని చెప్పలేం.

రంభ ఊర్వశి మేనక దర్శకుడు చంద్రమోహన్‌కు జంధ్యాల, ఈవీవీ సినిమాలంటే ఇష్టమని చెప్పాడు. అయితే ఒక సీన్‌లో చాలా పాత్రల మధ్య జరిగే కామెడీని ఇప్పటి టైమ్‌కు తగ్గట్టు ప్రయత్నిస్తున్నారా అన్నది చూడాలి. పైగా నరేష్ కెరీర్‌లో కూడా ఈ తరహా సెటప్ కొత్తది కాదు. ఆయన మొదటి దశ సినిమాల్లో హీరోతో పాటు పక్క పాత్రలు కూడా సినిమాను బాగా నడిపించేవి.

తర్వాత నరేష్ సీరియస్ కథల వైపు వెళ్లాడు. ఇప్పుడు మళ్లీ కామెడీ చేస్తున్న సమయంలో ఇద్దరు ముగ్గురు నటులతో కాకుండా పెద్ద గ్యాంగ్‌ను తీసుకోవడం వల్ల పాత నరేష్ సినిమాల ఫీల్ కొంత రావచ్చు. అసలు లెక్క మాత్రం సినిమా వచ్చాకే తెలుస్తుంది. ఈవీవీ సినిమాల తరహా సందడి సెట్లో కనిపించిందని శ్రీనివాస్ రెడ్డి అన్నాడు. అదే తెరపై కూడా సహజంగా కుదిరితే నరేష్‌కు కామెడీ రీఎంట్రీ మాత్రమే కాదు.. ఈ మధ్య తగ్గిపోయిన పెద్ద క్యాస్ట్ కామెడీకి కూడా రంభ ఊర్వశి మేనక మరోసారి చోటు కల్పించినట్టవుతుంది.

Tags:    

Similar News