'బెంజ్' నుంచి స్టార్ హీరో ఔట్!

లోకేష్ కనగరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమాటిక్ యూనివర్స్ (LCU) ప్రాజెక్ట్ `బెంజ్` నుంచి నివిన్ తప్పుకున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2026-08-27 00:44 GMT

మాలీవుడ్ టాలెంటెడ్ హీరో నివిన్ పౌలీ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. లోకేష్ కనగరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమాటిక్ యూనివర్స్ (LCU) ప్రాజెక్ట్ `బెంజ్` నుంచి నివిన్ తప్పుకున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో నివిన్ పౌలీ ఓ కీలక పాత్రలో నటించాల్సి ఉండగా.. షూటింగ్ ప‌దే ప‌దే వాయిదా పడటమే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.ఈ చిత్రంలో పాత్ర కోసం నివిన్ పౌలీ ప్రత్యేకంగా గడ్డం లుక్‌ను మెంటైన్ చేస్తున్నారు.

అయితే సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పట్టాలెక్కకపోవడం, షెడ్యూల్స్ నిరంతరం మారుతుండటంతో తీవ్ర అసహనానికి గురయ్యారుట‌. ఒకే లుక్‌తో సుదీర్ఘకాలం పాటు వేచి ఉండాల్సి రావడం వల్ల ఇతర ప్రాజెక్ట్‌ల డేట్స్‌ను సర్దుబాటు చేసుకోలేకపోతున్నారుట‌. దీంతో డేట్స్ క్లాష్ సమస్య త‌లెత్త‌డంలో ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. లోకేష్ కనగరాజ్ యూనివర్స్ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయి. ప్రతిష్టాత్మక ఫ్రాంచైజీ నుంచి వస్తున్న `బెంజ్` నుంచి నివిన్ పౌలీ లాంటి స్టార్ నటుడు తప్పుకోవడం చిత్ర యూనిట్‌కు కూడా ఇబ్బందికరమైన పరిణామమే. దీనిపై నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

నటుడిగా కెరీర్‌ను పకడ్బందీగా ప్లాన్ చేసుకునే నివిన్ పౌలీకి ఈ రకమైన అనిశ్చితి తీవ్ర అసంతృప్తిని కలిగించిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో.. నివిన్ తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యను మేకర్స్ త్వరలోనే పరిష్కరించుకోకపోతే ప్రాజెక్ట్‌కు మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. `బెంజ్` కోసం హోల్డ్ అయిన న‌టులంతా ఒక్కొక్క‌రుగా చేజారే అవ‌కాశం ఉంది. ఈ ర‌క‌మైన స‌మ‌స్య‌ను నివిన్ ఒక్క‌డే కాదు అందులో న‌టిస్తున్న మిగ‌తా న‌టులు కూడా ఎదుర్కుంటున్న‌ట్లు స‌మాచారం.

లోకేష్ క‌న‌గ‌రాజ్ తాత్కాలికంగా కెప్టెన్ కుర్చీకి దూరంగా జ‌రిగి ఇటీవ‌లే `డీసీ`తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే `బెంజ్` ప్రాజెక్ట్ ను ప‌క్క‌న‌బెట్టారు. ఎల్ సీయూ నుంచి ఇంకా మ‌రో రెండు ..మూడు ప్రాజెక్ట లు ప్ర‌క‌టించారు. కానీ లోకేష్ న‌టుడిగా తెరంగేట్రం చేయ‌డంతో అవ‌న్నీ ఎక్కడి కక్క‌డ నిలిచిపోయాయి. ఇటీవ‌లే `డీసీ` రిలీజ్ అయింది. ఈ నేప‌థ్యంలో తిరిగి కెప్టెన్ కుర్చీ ఎక్కే అవ‌కాశం ఉంది. మ‌రి `డీసీ` 100 కోట్లు సాధించిన నేప‌థ్యంలో లోకేష్ ఆలోచ‌న‌ల్లో కొత్త‌గా మార్పులేవైనా చోటు చేసుకుంటున్నాయా? అన్న‌ది కూడా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News