ఒక్క సినిమా.. నెక్స్ట్ ప్రాజెక్ట్ రేంజే మారిపోయింది!
ఒకప్పుడు కొత్త దర్శకుడు తొలి సినిమా హిట్ కొట్టినా నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు మరో మిడ్ రేంజ్ హీరో దొరికేవాడు.
ఒకప్పుడు కొత్త దర్శకుడు తొలి సినిమా హిట్ కొట్టినా నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు మరో మిడ్ రేంజ్ హీరో దొరికేవాడు. రెండు మూడు విజయాల తర్వాతే పెద్ద స్టార్ దగ్గరకు వెళ్లే ఛాన్స్ వచ్చేది. ఇప్పుడు ఆ లెక్క చాలా స్పీడ్ గా మారుతోంది. ఒక్క సినిమా బాగా పడితే చాలు.. తర్వాతి ప్రాజెక్ట్ స్కేల్ ఒక్కసారిగా పెరిగిపోతోంది.
సందీప్ రెడ్డి వంగా దగ్గర ఇదే జరిగింది. అర్జున్ రెడ్డితో దర్శకుడిగా తన స్టైల్ ఏంటో చూపించాడు. ఆ తర్వాత అదే కథను హిందీలో కబీర్ సింగ్‌గా షాహిద్ కపూర్‌తో తీశాడు. అక్కడి నుంచి రణ్‌బీర్ కపూర్‌తో యానిమల్ వరకు వెళ్లాడు. ఇప్పుడు ప్రభాస్‌తో స్పిరిట్ చేస్తున్నాడు. అంటే ఒక్క అర్జున్ రెడ్డి మొదలు పెట్టి ఆ సక్సెస్ చివరకు దేశంలోని పెద్ద స్టార్ల దగ్గరకు తీసుకెళ్లింది.
బుచ్చిబాబు సానాకు కూడా ఉప్పెన తర్వాత రెండో సినిమా దగ్గరే పెద్ద జంప్ వచ్చింది. తొలి సినిమాతోనే మంచి పేరు రావడంతో రామ్ చరణ్‌తో పెద్ది చేసే అవకాశం దక్కింది. కొత్త దర్శకుడు రెండో సినిమాకే ఇంత పెద్ద స్టార్‌ను హ్యాండిల్ చేయడం కొన్నేళ్ల క్రితం వరకు అరుదే. పెద్ది తర్వాత ఆ పేరు మరింత పెద్ద హీరోల సినిమాలతో కూడా వినిపిస్తోంది. కానీ పెద్ది ఇంకా భారీ స్థాయిలో సక్సెస్ అయితే ఆ కాన్ఫిడెన్స్ మరో లెవెల్ కి వెళ్లేది.
శ్రీకాంత్ ఓదెల లెక్క కొంచెం వేరు. దసరా తర్వాత హీరో మారలేదు.. నానితోనే ది ప్యారడైజ్ చేస్తున్నాడు. కానీ సినిమా స్థాయి మాత్రం పూర్తిగా పెరిగింది. పెద్ద తారాగణం, అనిరుధ్ సంగీతం, భారీ నిర్మాణం అంటూ కాన్వాస్ ను పెంచేశాడు. ఇక ఇతర భాషల్లో కూడా తీసుకెళ్లే ప్లాన్‌తో రెండో సినిమానే పెద్ద ప్రాజెక్ట్‌గా మార్చేశాడు. మెగాస్టార్ చిరంజీవితో కూడా ఒక సినిమాను ముందే లాక్ చేసుకున్నాడు.
ఇదే ట్రాక్ గతంలో సుజీత్ దగ్గర కూడా కనిపించింది. రన్ రాజా రన్ తర్వాత రెండో సినిమాకే ప్రభాస్‌తో సాహో చేశాడు. అది కూడా బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమా. ఒక్క ఫీచర్ ఫిల్మ్ అనుభవం ఉన్న దర్శకుడిని అంత పెద్ద ప్రాజెక్ట్‌కు తీసుకోవడం అప్పట్లోనే పెద్ద విషయం. కానీ ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో క్లిక్ కాలేదు. ఇక ఇటీవల OG తో సుజిత్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు.
ఇప్పుడు కొత్త దర్శకుడికి ఐదు సినిమాల అనుభవం ఉందా అన్నదానికంటే.. తొలి సినిమాలో తనకు ఏం కావాలో ఎంత క్లియర్‌గా చూపించాడన్నదే ఎక్కువ పని చేస్తోంది. ఒక సినిమా బాగా కుదిరితే తర్వాతి మెట్టు చిన్నగా ఉండటం లేదు. హీరో మారకపోయినా బడ్జెట్, మార్కెట్, సినిమా స్థాయి మాత్రం ఒక్కసారిగా పైకి వెళ్లిపోతోంది. అందుకే ఇప్పుడు డెబ్యూ హిట్ ఇంపాక్ట్ ఇండస్ట్రీలో బాగానే కలిసొస్తుంది.