పెళ్లి ప్రశ్నపై సుస్మితా సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ అందంతోనే కాదు బోల్డ్ స్టేట్‌మెంట్లు .. వ్యక్తిగత జీవితాన్ని జీవించే తీరుతో ప్రత్యేకంగా నిలుస్తుంటారు.
మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ అందంతోనే కాదు బోల్డ్ స్టేట్‌మెంట్లు .. వ్యక్తిగత జీవితాన్ని జీవించే తీరుతో ప్రత్యేకంగా నిలుస్తుంటారు. సమాజంలోని సంప్రదాయాలకు భిన్నంగా తనకంటూ కొన్ని రూల్స్ తో ముందుకు సాగుతుంటారు. తాజాగా పెళ్లి గురించి ఇటీవల మీడియా నుంచి ఎదురైన ఓ ప్రశ్నకు చమత్కారంగా సమాధానం ఇచ్చారు. సుస్మితా సేన్ ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సమయంలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఏమాత్రం తడబడకుండా ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ ఇచ్చిన రిప్లై అందరినీ ఆకట్టుకుంది.
`ఈ సవాల్‌కు జవాబు మీరూ హుమ్ (మేమూ) ఇద్దరం కలిపి వెతుకుతూనే ఉంటాం` అంటూ సరదాగా సమాధానమిచ్చారు. వ్యక్తిగత జీవితం గురించిన ప్రశ్నలను సుస్మిత సేన్ ఎప్పుడూ సానుకూల ధోరణితో హ్యాండిల్ చేస్తుంటారు. జీవితంలో పెళ్లి అనేది అనివార్యమైన బంధం కాదని, వ్యక్తిగత ఆనందం, మనశ్శాంతి ముఖ్యం అని సుస్మితా సేన్ చాలా సార్లు నిరూపించారు. వివాహం చేసుకోకుండానే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుని అద్భుతంగా పెంచడం ద్వారా ఆదర్శవంతమైన తల్లిగా సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
జీవిత నిర్ణయాలపై ఇతరుల అభిప్రాయాల ప్రభావం పడకుండా స్వతంత్రంగా బతకడం సుస్మితా సేన్ ప్రత్యేకత. మహిళలు జీవిత భాగస్వామి లేకుండా కూడా సంతోషంగా, విజయవంతంగా జీవించగలరని సుస్మితా సేన్ ప్రయాణం ద్వారా చాటి చెబుతున్నారు. డేటింగ్ .. రిలేషన్‌షిప్‌ల విషయంలోనూ ఆమె ఎప్పుడూ ఓపెన్‌గానే ఉంటారు. అయినా? పెళ్లి అనే అంశంపై సుస్మితా సేన్ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, వర్తమానంలో జీవించడమే తన శైలి అని మరోసారి నిరూపించారు.
ఈ నేపథ్యంలో జీవితంలో పెళ్లి విషయంలో సుస్మితలా ఉండటం ఉత్తమం అంటూ కొందరు నెటి జనులు స్పందిస్తున్నారు. సుస్మిత పరిణితి చెందిన ఆలోచనా విధానం యువతరానికి స్ఫూర్తిని ఇస్తోదంటున్నారు. సమాజంలో మహిళల వివాహంపై ఉండే అనవసరమైన ఆసక్తిని, పదే పదే అడిగే ప్రశ్నలను సుస్మితా సేన్ తనదైన శైలిలో సున్నితంగా తిప్పికొట్టే విధానంపై ప్రశంశిస్తున్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా మాటల గారడీతో ప్రశ్నను దాటవేయడంలో సుస్మిత తలపండిన నటి అనిపించుకున్నారు. ఇక సుస్మితా సేన్ కు ఇప్పటికే 50 ఏళ్ల నిండాయి. సినిమా జర్నీలో పలువురితో రిలేషన్ షిప్ ని కొనసాగించారు. చివరిగా లలిత్ మోదీతో కొతకాలం పాటు రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇద్దరు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ పెళ్లి వరకూ ఆ రిలేషన్ షిప్ దారి తీయలేదు.