'రామాయ‌ణం'పై విమ‌ర్శ‌లు: VFXలో 8 ఆస్కార్ల విజేత అలా తేలిపోయారు!

సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందన చూస్తుంటే..ఈ సినిమాలోని కొన్ని సీన్లు ఏఐ తో తయారు చేసినట్టు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి.;

Update: 2026-04-03 18:48 GMT

ప్రస్తుతం భారతీయ సినీ ఇండస్ట్రీలో నితీష్ తివారీ రూపొందిస్తున్న `రామాయణం` టీజర్ చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్ (VFX)పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఎనిమిది సార్లు ఆస్కార్ గెలుచుకున్న DNEG సంస్థ పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ సినిమా విజువల్స్ ఒక సెక్ష‌న్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తడబడినట్లు కనిపిస్తోంది. కేవలం గ్రాఫిక్స్ హంగుల కంటే కూడా కథలో సహజత్వానికి ప్రాధాన్యత ఇచ్చే నేటి కాలపు ప్రేక్షకులు ఈ టీజర్‌లోని కృత్రిమత్వాన్ని వేలెత్తి చూపుతున్నారు.

నిజానికి `రామాయణం` టీజర్‌లో చూపించిన గ్రాఫిక్స్‌తో పోలిస్తే తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన‌ ప్రశాంత్ వర్మ `జై హనుమాన్`, తేజ సజ్జా `మిరాయ్' చిత్రాల్లోని వీఎఫ్ఎక్స్ ఎంతో మెరుగ్గా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ రెండు సినిమాల్లోని విజువల్స్ ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించకుండా కథలోని మూడ్‌కు తగ్గట్టుగా సహజంగా ఉన్నాయి. కానీ రామాయణం ప్రమోషనల్ వీడియోలో శ్రీరాముడి పాత్రను వెంటాడే మాన్‌స్ట‌ర్ బిట్ ఒక అతుకుల బొంతలా అనిపించిందని, ఆ విజువల్‌లో ఎమోషన్ అస్సలు వర్కవుట్ కాలేదని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఇంట్రోలోనే నీర‌సం పుట్టించారు. రాక్ష‌స అధ‌ముడి స్త్రైర‌విహారాన్ని కూడా ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్ద‌డంలో విజువ‌ల్ గ్రాఫిక్స్ ఫెయిల‌య్యాయ‌ని విమ‌ర్శిస్తున్నారు. అవ‌న్నీ ఏఐ బొమ్మ‌ల్లా క‌నిపిస్తున్నాయ‌ని, కృత్రిమంగా ఉన్నాయ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నితీష్ తివారీ వీఎఫ్ఎక్స్ విషయంలో రాజీ పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందన చూస్తుంటే..ఈ సినిమాలోని కొన్ని సీన్లు ఏఐ తో తయారు చేసినట్టు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. `రేడియోయాక్టివ్` అనే యూజర్ స్పందిస్తూ ``ఇంత పెద్ద బడ్జెట్ సినిమాలో విజువల్స్ ఇంత ఆర్టిఫిషియల్‌గా ఉండటం విచారకరం. మాకు 2026 నాటి క్వాలిటీ కావాలి కానీ యావరేజ్ రెండరింగ్ పిక్సెల్స్ కాదు`` అని తీవ్రంగా విమ‌ర్శించారు. గౌరవ్ చౌబే అనే మరో యూజర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ.. హై-బడ్జెట్ సినిమా విజువల్స్ లాగా కాకుండా.. ఇవి కేవలం ఏఐ నుంచి పుట్టిన బొమ్మ‌ల్లా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు.

మరికొందరు నెటిజన్లు అయితే ఈ టీజర్‌ను ఏకంగా`ఆదిపురుష్ ఏఐ వెర్షన్` అంటూ ఏకిపారేస్తున్నారు. ఈ టీజ‌ర్ లో రాక్షసులు `గేమ్ ఆఫ్ థ్రోన్స్` నుండి కాపీ కొట్టినట్లు అసహజంగా ఉన్నారని.. అయోధ్య నగరం కూడా డీటెయిలింగ్ లేక ప్లేస్టేషన్ గేమ్ క్లిప్‌లా కనిపించింద‌ని విమర్శించారు. రణబీర్ కొన్నిచోట్ల బావున్నా కొన్ని చోట్ల ఏఐ బొమ్మ‌లా ఫేక్ గా క‌నిపించాడ‌ని కూడా విమ‌ర్శిస్తున్నారు. అడ‌వులు, ప్ర‌కృతి, జ‌ల‌పాతాలు కూడా తేలిపోయాయి. ఆర్టిఫిషియ‌ల్ గా క‌నిపిస్తున్నాయి. ఆ ర‌థ చ‌క్రం కూడా కృత్రిమంగా క‌నిపించిందని విమ‌ర్శిస్తున్నారు.

ఓవరాల్‌గా `రామాయణం` టీజ‌ర్ చూడ‌గానే భారీ విజువ‌ల్ గ్రాఫిక్స్ తో ట్రీట్ ఉంటుంద‌ని అర్థ‌మైనా కానీ, ఏదో గ‌జిబిజి గంద‌ర‌గోళం ఒక‌వైపు లాగేస్తోంద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. ఇలాంటి అత్యంత ప్రతిష్టాత్మక చిత్రానికి కేవలం భారీ బడ్జెట్ ఉంటే సరిపోదని ప్రేక్షకులను మెప్పించే `క్వాలిటీ` ఉండాలని విమర్శలు నిరూపిస్తున్నాయి. 8 ఆస్కార్ల అనుభవం ఉన్న DNEG సంస్థ కూడా ఈ చిన్న బిట్‌లో మాన్‌స్ట‌ర్ ఎలివేషన్‌ను సరిగ్గా చూపించలేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సినిమా విడుదల నాటికైనా ఈ లోపాలను సరిదిద్ది `జై హనుమాన్` లేదా `మిరాయ్` తరహాలో కంటికి ఇంపుగా ఉండే విజువల్స్ అందిస్తారని సినీ ప్రియులు ఆశిస్తున్నారు. లేదంటే ఎంతటి భారీ చిత్ర‌మైనా విజువల్స్ లోని కృత్రిమత్వం వల్ల పరాజయం పాలయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News