వీడియో గ్లింప్స్: సీతాదేవి పాత్రధారిపై సందేహం వైదొలిగిందా?
ప్రకృతి అందాల నడుమ రాముడిగా రణ్‌బీర్ కపూర్.. సీతాదేవిగా సాయిపల్లవి కనిపిస్తున్న తీరు.. రాముడు సీత తలలో పువ్వు అద్దుతున్న ఆ అద్భుతమైన రొమాంటిక్ మూవ్‌మెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
నితేశ్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం `రామాయణం` నుంచి గణేష్ చతుర్థి కానుకగా విడుదలైన కొత్త పోస్టర్, జైజై రామ్ వీడియో గ్లింప్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో సీతాదేవి పాత్రలో నటిస్తున్న సాయిపల్లవి ఎంపికపై ఇప్పటివరకు హిందీ బెల్ట్‌లో రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ వచ్చాయి. అయితే తాజాగా విడుదలైన పోస్టర్‌తో ఆ సందేహాలన్నీ తొలగిపోయాయని... సీతాదేవి పాత్రకు సాయిపల్లవి నూటికి నూ శాతం సరిపోతుందనే స్పష్టత వచ్చేసిందని అభిమానులు తమ ఫేవరెట్ నటికి మద్ధతుగా నిలుస్తున్నారు.
ప్రకృతి అందాల నడుమ రాముడిగా రణ్‌బీర్ కపూర్.. సీతాదేవిగా సాయిపల్లవి కనిపిస్తున్న తీరు.. రాముడు సీత తలలో పువ్వు అద్దుతున్న ఆ అద్భుతమైన రొమాంటిక్ మూవ్‌మెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఒక్క పోస్టర్‌తో, ఇంతలోనే గణేష్ చతుర్థి ఉత్సవం సందర్భంగా వచ్చిన జైజై రామ్ వీడియో గ్లింప్స్ తో ఉత్తరాది ప్రేక్షకుల్లో ఉన్న చిన్నపాటి సందేహాలు కూడా పటాపంచలయ్యాయి. సౌత్ ఇండస్ట్రీలో సాయిపల్లవి నటనపై, తనకున్న అభినయ ప్రతిభపై ఉన్న అపారమైన నమ్మకం ముందు హిందీ బెల్ట్ విమర్శలు పూర్తిగా వెనక్కి తగ్గాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేవలం గ్లామర్ కోణంలో కాకుండా.. పాత్ర స్వభావాన్ని అర్ధం చేసుకుని నటించే సాయిపల్లవి తన అద్భుత హావభావాలతో సీతాదేవి పాత్రకు నిజంగానే ప్రాణప్రతిష్ట చేయగలదని నెటిజన్లు బలంగా నమ్ముతున్నారు. సహజ సిద్ధమైన అంకితభావం.. పద్ధతైన రూపం సీతాదేవి పాత్రకు సరిపోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హీరో రణ్‌బీర్ కపూర్ సైతం గతంలో సాయిపల్లవి నటనపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
దాదాపు రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయి వీఎఫ్‌ఎక్స్ హంగులతో రూపొందుతున్న ఈ బ్రహ్మాండమైన చిత్రంలో రణ్‌బీర్, సాయిపల్లవితో పాటు కన్నడ సూపర్ స్టార్ యశ్ రావణాసురుడిగా నటిస్తున్నారు. అరుణ్ గోవిల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
రెండు భాగాలుగా రానున్న ఈ దృశ్య కావ్యంలో మొదటి భాగాన్ని 2026 దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఏదేమైనా... తాజా పోస్టర్‌తో సీతాదేవి పాత్రపై నెలకొన్న సందిగ్ధత కొంతవరకూ తొలగిపోయిందని.. తెరపై సాయిపల్లవి రూపం ప్రేక్షకులను మైమరిపించడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. సినిమా రిలీజయ్యాక వందశాతం ఉత్తరాది జనాలకు సాయిపల్లవిపై ఉన్న అభిప్రాయం మారిపోతుందని కూడా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం రామ్- సీతాదేవి పాత్రలతో ఉన్న చిన్న పాటి వీడియో గ్లింప్స్ గణేష్ చతుర్థి కానుకగా భావించి అభిమానులు వైరల్ చేస్తున్నారు. జైజై రామ్ గ్లింప్స్ వైరల్ గా దూసుకెళుతోంది.